Breaking News

26/07/2019

ఏటేటా పెరుగుతున్న పర్యాటకులు

హైద్రాబాద్, జూలై 26, (way2newstv.in)
 తెలంగాణ పర్యాటక రంగానికి మహర్దశ పట్టింది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత పెద్ద సంఖ్యలో దేశీయ, విదేశీయ పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారు. తెలంగాణ పర్యాటక సంస్థ ఆఫర్ చేస్తున్న ప్యాకేజీలకు విశేష స్పందన లభిస్తోంది. అనంతగిరి హిల్స్, నాగార్జునసాగర్ , జోగుళాంబ, బొగత వాటర్ ఫాల్స్, రామప్ప దేవాలయం, యాదగిరిగుట్ట దేవాలయం, బాసర సరస్వతి అమ్మవారి దేవాలయం, భద్రాచలం, పాపికొండలను సందర్శించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది.చారిత్రికంగా హైదరాబాద్, వరంగల్‌కు అంతర్జాతీయంగా విశిష్టమైన స్థానం లభించడం వల్ల విదేశీ పర్యాటకుల తాకిడి పెరిగింది.
ఏటేటా పెరుగుతున్న పర్యాటకులు

దక్షిణ భారతదేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే హైదరాబాద్ నగరంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం, అందుబాటులో అన్ని మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఇతర నగరాలతో పోల్చితే తక్కువ ఖర్చు, ఇక్కడి ప్రజలు దేశ, విదేశీయ పర్యాటకుల పట్ల గౌరవ మర్యాదలతో వ్యవహరిస్తున్న తీరు, పలు భాషలు మాట్లాడే ప్రజలు ఉండడం వల్ల రాష్ట్రానికి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ముందుగా దేశీయ పర్యాటకులను విశ్లేషిస్తే 2014లో 7.2 కోట్ల మంది రాష్ట్రంలో, 92 లక్షల మంది హైదరాబాద్‌ను, 2015లో 9.4 కోట్ల మంది రాష్ట్రంలో, 95 లక్షల మంది హైదరాబాద్‌ను సందర్శించారు. 2016లో 9.5 కోట్ల మంది రాష్ట్రంలో, 2.33 కోట్లమంది హైదరాబాద్‌ను, 2017లో 8.5 కోట్ల మంది రాష్ట్రాన్ని, 2.71 కోట్ల మంది హైదరాబాద్‌ను, 2018లో 9.2 కోట్ల మంది రాష్ట్రాన్ని, 1.95 కోట్ల మంది నగరాన్ని సందర్శించారు. 2014తో 7.2 కోట్ల మంది రాష్ట్రాన్ని సందర్శిస్తే, ఈ సంఖ్య ఐదేళ్లలో 9.2 కోట్లకు పెరిగింది. విదేశీ పర్యాటకుల తాకిడి విశేషంగా పెరిగింది. విదేశీ పర్యాటకులు 2014లో 75171 మంది విదేశీ పర్యాటకులు, హైదరాబాద్‌ను 70051 మంది యాత్రికులు, 2015లో 1.26 లక్షల మంది రాష్ట్రంలో, 1.22 లక్షల మంది హైదరాబాద్‌ను, 2016లో 1.66 లక్షల మంది రాష్ట్రంలో, 1.63 లక్షల మంది హైదరాబాద్‌ను, 2017లో 2.51 లక్షల మంది విదేశీ యాత్రికులు రాష్ట్రంలో, 2.47 లక్షల మంది హైదరాబాద్‌ను సందర్శించారు. 2018లో 3.18 లక్షల మంది విదేశీ యాత్రికులు రాష్ట్రంలో, 3.11 లక్షల మంది హైదరాబాద్‌ను సందర్శించారు. ఈగణాంక వివరాలనువిశే్లషిస్తే ఐదేళ్లలో హైదరాబాద్‌ను సందర్శించే విదేశీ యాత్రికులు 70 వేల నుంచి 3.11 లక్షలకు, రాష్ట్రాన్ని సందర్శించే వారి సంఖ్య 75వేల నుంచి 3.18 లక్షలకు పెరిగింది.

No comments:

Post a Comment