Breaking News

19/07/2019

ఇన్ఫో యాప్ తో తపాల శాఖ

నిజామాబాద్, జూలై 19, (way2newstv.in)
తపాలా శాఖ అందిస్తున్న సేవల సమస్త సమాచారాన్ని పోస్ట్‌ ఇన్ఫో యాప్‌ అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగాక ప్రతి విషయాన్ని వాటి ద్వారానే తెలుసుకుంటున్నారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వాలు కూడా అన్ని సేవలను ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ శాఖలు యాప్‌లను కూడా అందుబాటులోకి తెచ్చాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తపాలా శాఖ కూడా ఆన్‌లైన్‌ సేవలతో పాటు, అందించే సేవల సమాచారాన్ని సులభంగా అర్థమయ్యే విధంగా అందించాలన్న ఉద్దేశంతో పోస్ట్‌ ఇన్ఫో యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. మైసూర్‌లోని సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ పోస్టల్‌ టెక్నాలజీ(సీఈపీటీ) అనే సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 
ఇన్ఫో యాప్ తో తపాల శాఖ

యాప్‌ ద్వారా తపాలా బీమా పథకాలు, ఉత్తరాలు, వాటికి అయ్యే ఖర్చు, తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చు. సాధారణంగా తపాలా శాఖ అందిస్తున్న పొదుపు పథకాలు, వడ్డీ రేట్లు, బీమా పథకాల పాలసీలు, తదితర వివరాలను ఆ శాఖలోని ఉద్యోగుల ద్వారానే తెలుసుకోవాలి. కానీ ఒక్కోసారి ఆ విషయాలు తపాలా ఉద్యోగులు అర్థమయ్యే విధంగా చెప్పకపోవడం, పనిలో ఉండి పట్టించుకోకపోవడం జరుగుతుంటుంది. వాళ్లు చెప్పిన విషయాల ఆధారంగా ఏ పాలసీ, పొదుపు పథకాన్ని ఎంచుకుంటే మన పరిస్థితులకి సరిపోతుందో తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ పోస్ట్‌ ఇన్ఫో యాప్‌ ద్వారా అలాంటి సమస్యలు దూరమవుతాయిసాధారణంగా ఒక ఉత్తరం, పార్సిల్‌, బుక్‌ పాకెట్‌ పంపించడానికి అయ్యే ఖర్చును తపాలా కార్యాలయంలో బరువును చూసి దానికి ఎంత ధర కలిగిన స్టాంపులు అతికించాలో చెబుతారు. కానీ దాని బరువును పోస్టేజ్‌ కాలిక్యులేటర్‌లో నమోదు చేసి ఉత్తరం పంపడానికయ్యే ఖర్చును తెలుసుకోవచ్చు. ఇతర దేశాలకు ఉత్తరాలు పంపాలనుకుంటే ఇంటర్నేషనల్‌ స్పీడ్‌పోస్టులో దాని బరువును నమోదు చేసి దానికయ్యే ఖర్చును తెలుసుకొనే వీలుంది.ప్రజలు తమ ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా బీమా పాలసీని ఎంచుకోవాలి. మోయలేని భారాన్ని తలకెత్తుకొని పాలసీలను మధ్యలోనే వదిలేసే వారెందరో. అలా కాకుండా మన సంపాదన, పొదుపును బట్టి బీమా పథకాలను ఎంచుకోవాలి. ప్రీమియం కాలిక్యులేటర్‌ ఆప్షన్‌ ద్వారా చెల్లించగల మొత్తాన్ని, వయస్సును నమోదు చేసి ఎన్ని సంవత్సరాలు బీమా చెల్లించాలో, పాలసీ పూర్తయిన తర్వాత వచ్చే బీమా ప్రయోజనం మొత్తం, రుణ సదుపాయం, తదితర వివరాలను తెలుసుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన, ఎంఐఎస్‌, ఆర్డీ, సీనియర్‌ సిటిజన్‌ స్కీమ్‌, నేషనల్‌ సేవింగ్‌ సర్టిఫికేట్‌, టీడీ, తదితర పొదుపు పథకాలపై నిర్ణీత కాలపరిమితికి పొందే వడ్డీ రేటు, కాల పరిమితి పూర్తయ్యాక వచ్చే మొత్తం వివరాలను, వడ్డీ రేట్లను ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఐ అనే సింబల్‌ ద్వారా పొదుపు ఖాతాల వివరాలు, రుణ సదుపాయం, మెచ్యూరిటీ తదితర వివరాలను తెలుసుకోవచ్చు.ఏదైనా తపాలా కార్యాలయం నుంచి ఉత్తరం పంపిస్తే, అది చేరవలసిన వారికి చేరకపోతే ఆ విషయాన్ని తపాలా కార్యాలయంలో ఫిర్యాదు చేసి రశీదు పొందాలి. పోస్ట్‌ ఇన్ఫో యాప్‌లో ఉన కంప్లైంట్‌ ఆప్షన్‌ను తెరిచి రసీదుపై ఉన్న కంప్లైంట్‌ నంబర్‌ను నమోదు చేసి ఉత్తరం ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. ఉత్తరం, మనీయార్డర్‌, పార్సిల్‌ కచ్చితంగా ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే ట్రాకింగ్‌ ఆప్షన్‌లో రశీదుపై ఉన్న ఆర్టికల్‌ నంబర్‌ను నమోదు చేసి తెలుసుకోవచ్చు. పోస్ట్‌ ఆఫీసు సెర్చ్‌ ఆప్షన్‌ ద్వారా ఊరి పేరును ఉపయోగించి తపాలా కార్యాలయ పిన్‌కోడ్‌ను ఆ తెలుసుకోవచ్చు. అదే విధంగా పిన్‌కోడ్‌ను ఉపయోగించి ఊరు పేరును కూడా తెలుసుకోవచ్చు.పోస్ట్‌ ఇన్ఫో యాప్‌ ద్వారా తపాలా శాఖ అందిస్తున్న సేవల సమస్త సమాచారం తెలుసుకోవచ్చు. పొదుపు పథకాలు, బీమా పథకాలు, వడ్డీరేట్లు, ఉత్తరాలు పంపడానికయ్యే ఖర్చు, ఉత్తరం పరిస్థితిలాంటి విషయాలు తపాలా కార్యాలయానికి వెళ్లకుండానే తెలుసుకోవచ్చు. ప్రజలు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని తపాలా శాఖ సేవలను వినియోగించుకోవాలి.

No comments:

Post a Comment