Breaking News

20/07/2019

నగరంలో రోడ్ల తవ్వకాలకు ముందస్తు ప్రతిపాదనల స్వీకరణ

నవంబర్ నుండి తవ్వకాలకు అనుమతి 
సిటీ సమన్వ సమావేశంలో నిర్ణయం
హైదరాబాద్, జూలై 20 (way2newstv.in)
గ్రేటర్ హైదరాబాద్ లో వివిధ శాఖలు చేపట్టే అభివృద్ది పనుల నిమిత్తం కావాల్సిన రోడ్ల తవ్వకాలకు ముందస్తుగా ప్రతిపాదనలు సమర్పిస్తే ఈ నవంబర్ నుండి రోడ్డు తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలని శనివారం జరిగిన సిటీ సమన్వయ సమావేశంలో నిర్ణయించారు. మింట్ కంపౌండ్ లోని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపనీ (సి.పి.డి.సి.ఎల్) సి.ఎం.డి కార్యాలయంలో సిటీ సమన్వయ సమావేశం జరిగింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్, సి.ఎం.డి రఘుమారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల జాయింట్ కలెకర్టర్లు జి.రవి, హరీష్, హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం డి.సి.పి చౌహాన్, జీహెచ్ ఎంసీ విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటిలతో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు, ఆర్మీ, రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ మాట్లాడుతూ వర్షకాలం దృష్ట్యా నగరవాసులకు ఇబ్బందులు రావద్దనే ఉద్ధేశంతో నగరంలో అన్ని రకాల తవ్వకాలను నిషేదించడం జరిగిందని గుర్తుచేశారు. 
నగరంలో రోడ్ల తవ్వకాలకు ముందస్తు ప్రతిపాదనల స్వీకరణ

వివిధ విభాగాలు చేపట్టే అభివృద్ది కార్యక్రమాలకుగాను కావాల్సిన రోడ్డు తవ్వకాలకు సంబంధించి ప్రతిపాదనలు ఇప్పటి నుండే జీహెచ్ఎంసీ, హెచ్.ఆర్.డి.సి.ఎల్ లకు సమర్పిస్తే ముందస్తుగానే అనుమతులు జారీచేసి నవంబర్ నుండి తవ్వకాలకు అనుమతించడం జరుగుతుందని వివరించారు. నగరంలో విపత్తులను మరింత సమర్థవంతంగా ఎదుర్కునేందుకు జీహెచ్ఎంసీలో ఉన్న విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాన్ని మరింత పటిష్టపర్చేందుకు నిర్ణయించామని, దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం వర్షాకాల ఎమర్జెన్సీ బృందాలకు వెచ్చిస్తున్న నిధులతో శాశ్వత ప్రాతిపదికపై వాహనాలను కొనుగోలుచేసి తగు సిబ్బందితో డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ ల సంఖ్యను పెంపొందించాలని నిర్ణయించామని కమిషనర్ ప్రకటించారు. ఇందుకుగాను ప్రతి రెండు వార్డులకు ఒక డి.ఆర్.ఎఫ్ టీమ్ను ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. ఈ బృందాలను అక్రమ నిర్మాణాల తొలగింపు, ఆస్తిపన్ను సేకరణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ తదితర పనులన్నింటికి ఉపయోగించుకోనున్నట్టు వివరించారు. గ్రేటర్ పరిధిలో ఎస్.ఆర్.డి.పి పనుల మార్గాల్లో అడ్డంగా ఉన్న వాటర్ పైప్లైన్లను, విద్యుత్ కేబుళ్లు, స్తంభాలను తొలగించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులను కమిషనర్ కోరారు. ప్రస్తుత వర్షాకాల సీజన్లో అన్ని విభాగాల ఎమర్జెన్సీ బృందాలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తున్నాయని అభినందించారు. నగరంలో దాదాపు 12వేల మ్యాన్హోళ్లను రహదారులపై సమాంతరంగా నిర్మించే పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని, ఈ మ్యాన్హోళ్లను జియో ట్యాంగింగ్ చేయడానికి జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి అందించాలని జలమండలి, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలో జీహెచ్ఎంసీ అధికారులు ప్రతిరోజు ఉదయం 7గంటలలోగా స్థానిక సమస్యల పరిష్కారం, పారిశుధ్య కార్యక్రమాల పర్యవేక్షణకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని, వీరితో పాటు సంబంధిత జలమండలి అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ప్రతిరోజు పర్యటించాలని దానకిషోర్ ఆదేశించారు. నగరంలో ఉన్న ప్రధాన రహదారులలో అధిక శాతం హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహణలోనే ఉన్నాయని, ఈ రహదారులపై లేన్ మార్కింగ్లు చేపట్టాలని హైదరాబాద్ ట్రాఫిక్ డిసిపి చౌహాన్ కోరారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 1400 బస్ షెల్టర్లు ఉండగా వీటిలో 400 బస్ షెల్టర్లను వివిధ కారణాలతో జీహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రో రైలు విభాగాలు తొలగించాయని, తిరిగి ఈ బస్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని ఆర్టీసి అధికారులు విజ్ఞప్తి చేశారు. తొలగించిన బస్ షెల్టర్లను తిరిగి ఏర్పాటుచేసే విషయంలో తగు ప్రతిపాదనలు చేయడానికి అడిషనల్ కమిషనర్ అద్వైత్కుమార్ సింగ్, సైబరాబాద్ డిసిపి విజయ్కుమార్, ఆర్టిసీ ఈడి వినోద్కుమార్, సీసీపీ దేవేందర్రెడ్డి, సి.ఇ జియాఉద్దీన్లతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు, ఈ కమిటి 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని దానకిషోర్ పేర్కొన్నారు. మలక్పేట్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద మరో మార్గాన్ని (వెంట్) నిర్మించేందుకు ఆరు ఆస్తుల సేకరణకు చర్యలు చేపట్టామని, వీటిలో ఒక ఆస్తిని అందించడానికి అంగీకారం తెలిపారని, ఈ విషయంలో మిగతా ఆస్తుల సేకరణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రణాళిక విభాగం డైరెక్టర్ను ఆదేశించారు.

No comments:

Post a Comment