Breaking News

22/07/2019

టీ కాంగ్రెస్ కు దారేదీ...

అధ్యక్షుడి కోసం వెయిటింగ్
హైద్రాబాద్, జూలై 22, (way2newstv.in)
తెలంగాణలో వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నిలదొక్కుకోవడం కష్టంగానే మారింది. వరస ఓటములతో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో పడింది. నేతలందరూ పార్టీని వీడుతుండటంతో క్యాడర్ కూడా నిస్తేజంలోకి వెళ్లిపోయింది. అసెంబ్లీ, పార్లమెంటు, జిల్లా పరిషత్ ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనైనా నిలదొక్కుకుంటుందా? అన్న చర్చ పార్టీలోనే జరుగుతోంది. మరోవైపు నేతల మధ్య సయోధ్య లేకపోవడం, నాయకత్వ లోపం కాంగ్రెస్ కు తెలంగాణలో శాపంగా మారాయి.కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువంటారు. అలాగే జిల్లాకో ముఖ్యమంత్రి స్థాయి నేతలు కూడా ఈ పార్టీలోనే కనిిపిస్తారు. 
టీ కాంగ్రెస్ కు దారేదీ...

అసెంబ్లీ ఎన్నికలలో దారుణ ఓటమిని చవిచూసిన తర్వాత కాంగ్రెస్ ముఖ్యనేతలు మౌనం పాటిస్తుండటంతో క్యాడర్ లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. ఎన్నికల సమయంలో బీఫారం కోసం పోటీ పడే నాయకులు ఎన్నికల అనంతరం కనిపించకుండా పోయారు. పేరుకు జాతీయ స్థాయి నాయకులున్నప్పటికీ పార్టీ కష్టాల్లో ఉన్న ప్పుడు మాత్రం వారు సైలెంట్ గా ఉండటం విశేషం.కాంగ్రెస్ పార్టీకి నాయకుల కొదవలేదు. అలాగని క్యాడర్ కూడా తక్కువేమీ కాదు. సీనియర్ నేతలు జైపాల్ రెడ్డి, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మధు యాష్కీ లాంటి వాళ్లు నోరుమెదపడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది శాసనసభ్యులు గెలిస్తే 12 మంది శానససభ్యులు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని కూడా విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. అయినా సీనియర్ నేతలు ఎవరూ దీనిపై పెద్దగా స్పందించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం.ఇక కాంగ్రెస్ పార్టీకి ఏడుగురు శాసనసభ్యులే ఉన్నారు. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంటుకు ఎన్నిక కావడంతో తన శాసనసభ్యాత్వానికి రాజీనామా చేయడంతో ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. వీరిలో కూడా ఎవరి దారి వారిదే. కోమటి రాజగోపాల్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఇక జగ్గారెడ్డి సయితం తన నియోజకవర్గ ప్రయోజనాల కోసం పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కోలుకోలేని పరిస్థితిలో ఉంది. మరి సరైన నాయకుడు వస్తేనే తిరిగి పుంజుకునే అవకాశాలున్నాయి.

No comments:

Post a Comment