Breaking News

26/07/2019

సిటీలో రాంగ్ రూటైతే జైలే

హైద్రాబాద్, జూలై 26, (way2newstv.in)
రాంగ్ రూట్ లో వాహనాలు నడుపుకుంటూ వెళ్తున్నారా అయితే జైలుకు వెళ్లడం ఖాయం. రహదారులపై రాంగ్ రూట్ లో వెళ్లకూడదని పోలీసులు పదే పదే చెప్పినా కొంతమంది వాహనదారులు పట్టించుకోవడం లేదు. ఇష్టానుసారంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇకపై అలాంటి వారి ఆటలు సాగబోవు. రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేస్తూ వెళ్లిన ఓ యువకుడికి నాంపల్లి ప్రత్యేక కోర్టు  మొదటిసారి జైలు శిక్ష విధించింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిలో అధికంగా యువకులు, ప్రైవేట్ కంపెనీల్లో పని చేస్తున్నవారే ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. రద్దీ ప్రాంతాలు, యూ టర్న్ లు ఉన్నా.. రాంగ్ సైడ్ నుంచి వెళ్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వన్ వే, నో ఎంట్రీ ప్రాంతాల్లోనూ ఇష్టారాజ్యంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. 
 సిటీలో రాంగ్ రూటైతే జైలే

నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే బైకులతోపాటు కార్లు, స్కూల్ బస్సులూ రాంగ్ రూట్ లో వెళ్లడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది.పంజాగుట్ట, ప్యారడైజ్, జనరల్ బజార్, ఎర్రగడ్డ, ఎస్సార్ నగర్, అమిర్ పేట, బేగంపేట్, సికింద్రాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, అబిడ్స్, కోఠి, సుల్తాన్ బజార్, అంబర్ పేట, జూబ్లిహిల్స్, మెహిదీపట్నంలో ఈ సమస్య అధికంగా ఉంది. రాంగ్ రూట్ లో వెళ్తున్నవారిలో కొందరు ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొని గాయపడడం, కొన్నిసార్లు మృతి చెందుతున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇలాంటి ప్రమాదాలు పెరుగుతుండడంతో పోలీసులు రాంగ్ రూట్ లో వెళ్తున్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జరిమానాలు విధిస్తూ.. నిబంధనలు ఉల్లంఘంచిన వారిపై కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు.రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. రహదారులపై వెళ్తున్న వాహనదారులు నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. సాఫీగా ప్రయాణం సాగాలంటే రాంగ్ రూట్ లో వెళ్లకూడదని సూచించారు. పోలీసులు పలు మార్లు చెబుతున్నా కొంతమంది పట్టించుకోవడం అసహనం వ్యక్తం చేశారు. రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి కోర్టు జైలు శిక్ష విధించే పరిస్థితి వచ్చిందంటే నిబంధనల ఉల్లంఘనలపై ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చారు. హత్యలు, దొంగతనాలే కాదు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా జైలుకు వెళ్లాల్సివస్తుందన్న విషయాన్ని వాహనదారులు గుర్తుంచుకోవాలన్నారు.

No comments:

Post a Comment