Breaking News

08/06/2019

హూజూర్ నగర్ పై ఊహాగానాలు

నల్గొండ, జూన్ 8 (way2newstv.in)
నల్లగొండ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన హుజూర్‌నగర్ శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో త్వరలో రానున్న హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఇప్పుడు అన్ని పార్టీల్లో హాట్‌టాపిక్‌గా మారింది. తాను వరుసగా మూడుసార్లు ఎన్నికైన హుజూర్‌నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం ఉత్తమ్‌కు ప్రతిష్టాత్మకంగా తయారైంది. హుజూర్‌నగర్ నియోజకవర్గం ఏర్పాటుకు ముందు ఉత్తమ్ తన రాజకీయ జీవితంలో తొలిసారి 1994లో కోదాడ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు. అనంతరం ఇదే నియోజకవర్గం నుండి 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. 2009లో పునర్విభజనలో భాగంగా ఏర్పాటైన హుజూర్‌నగర్‌కు మారి ఇక్కడి మూడు పర్యాయాలు 2009, 2014, 2018 ఎన్నికల్లో గెలువడంతో పాటు ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా సైతం పనిచేశారు. హుజూర్‌నగర్, కోదాడల్లో గట్టి పట్టు వున్నప్పటికీ తన రాజీనామాతో రాబోతున్న హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఉత్తమ్ తీవ్రంగానే శ్రమించాల్సివుంది. 

హూజూర్ నగర్ పై ఊహాగానాలు
ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్‌పై హుజూర్‌నగర్‌లో చివరి నిమిషంలో టీఆర్‌ఎస్ టికెట్ సాధించి పోటీ పడిన శానంపూడి సైదిరెడ్డి కేవలం 7,466ఓట్లతో ఓడిపోగా, ఉప ఎన్నిక జరిగితే ఈ దఫా తన గెలుపు ఖాయమన్న ధీమాతో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఉత్తమ్‌కు 12,993 ఓట్ల మెజార్టీ వచ్చినప్పటికీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రం చింతలపాలెం, హుజూర్‌నగర్, మఠంపల్లి, గరిడేపల్లి, నేరడుచర్ల మండలాల జడ్పీటీసీలు, మెజార్టీ ఎంపీటీసీలు టీఆర్‌ఎస్ వశమయ్యాయి. పాలకీడు, మేళ్లచెర్వు జడ్పీటీసీలను మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. దీంతో హుజూర్‌నగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య నువ్వానేనా అన్నట్టుగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అభ్యర్థుల నుండి బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరన్నది మాత్రం చివరిదాకా తేలేలా కనిపించడం లేదు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో సీఎం కేసీఆర్ తన ప్రచార సభలో సైదిరెడ్డిని ముందుగా ప్రకటించి ఉంటే ఉత్తమ్‌ను ఓడించేవారంటూ వ్యాఖ్యానించిన నేపధ్యంలో ఈ దఫా ఆయన అభ్యర్థిత్వాన్ని ముందుగా ప్రకటించవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో సీఎం కేసీఆర్ తన కుమార్తె, నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిన కల్వకుంట్ల కవితను ఈ నియోజకవర్గం నుండి రంగంలోకి దించవచ్చన్న ప్రచారం సైతం జోరందుకుంది. అయితే టీఆర్‌ఎస్ నుండి అభ్యర్ధి ఎవరైనప్పటికీ ఈ ఉప ఎన్నికల్లో హుజూర్‌నగర్‌లో గులాబీ జెండా ఎగరేసి ఉత్తమ్‌ను రాజకీయంగా దెబ్బకొట్టాలని టీఆర్‌ఎస్ అధిష్టానం పట్టుదలగా ఉంది.కాంగ్రెస్ పార్టీ నుండి హుజూర్‌నగర్ ఉప ఎన్నిక బరిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన సతీమణి పద్మావతి ఉత్తమ్‌ను పోటీకి దించవచ్చని భావిస్తున్నారు. కోదాడలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 756 ఓట్లతో ఓడిపోయిన పద్మావతి హుజూర్‌నగర్‌లో బరిలోకి దిగితే విజయం తథ్యమని ఉత్తమ్ వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే పీసీసీ కార్యదర్శి, సూర్యాపేట అసెంబ్లీ 

నియోజకవర్గానికి చెందిన పటేల్ రమేష్‌రెడ్డికి హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో పోటీకి దించాలన్న వాదన సైతం తెరపైకి వచ్చింది. సూర్యాపేట అసెంబ్లీ, నల్లగొండ లోక్‌సభ స్థానాల టికెట్లను అధిష్టానం ఆదేశాలతో వదులుకున్న రమేష్‌రెడ్డికి హుజూర్‌నగర్‌లో అవకాశమిస్తే ఆయన గెలుపు బాధ్యతను తాను తీసుకుంటానంటూ మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ముందుకొచ్చినట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అటు టీఆర్‌ఎస్, ఇటు కాంగ్రెస్ నుండి హుజూర్‌నగర్ ఉప ఎన్నికల బరిలో రెండేసి పేర్లు వినిపిస్తుండటంతో చివరకు పోటీ పడేదెవరన్నది ఇప్పటి నుండి ఆసక్తికరంగా మారింది

No comments:

Post a Comment