గుడికి వెళ్తే దర్శనం చేసుకున్నాక ప్రసాదం కచ్చితంగా తీసుకుంటాం. లడ్డూ, పులహోర.. ఇలా రకరకాల ప్రసాదాలను కౌంటర్లలో కొంటుంటాం. ఒక్కో ఆలయంలో ఒక్కో తీరుగా, ఒక్కో పరిమాణంలో, ఒక్కో రేటుతో లడ్డూలు అమ్ముతుంటారు. ఇకపై అన్ని ప్రధాన ఆలయాల్లో ఒకే పరిమాణంలో బెల్లం లడ్డూలు ఉండనున్నాయి. రాష్ట్రంలోని ఏ ఆలయమైనా వాటి ధర కూడా ఒకేలా ఉంటుంది.
అన్నీ దేవాలయాల్లో బెల్లం లడ్డూలు
ఈ మేరకు దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 80 గ్రాముల పరిమాణంలో, బెల్లం పాకంతో తయారు చేసిన లడ్డూ ప్రసాదాన్ని కేవలం రూ.20కే భక్తులకు అందుబాటులో ఉంచాలని, లడ్డూ తయారీకి ఒకే రకమైన దిట్టం వినియోగించాలని నిర్ణయించారు. ప్రస్తుతం అన్ని ఆలయాల్లో చక్కెర పాకంతో లడ్డూలను తయారు చేసి భక్తులకు అందిస్తున్నారు. అయితే మధుమేహం వంటి సమస్యలు, ఇతర ఆరోగ్య కారణాలతో చక్కెర లడ్డూలను చాలామంది భక్తులు స్వీకరించలేకపోతున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ బెల్లం పాకంతో లడ్డూ ప్రసాదాలను అందించడానికి గల అవకాశాలపై అధికారులతో చర్చించారు. ఈ మేరకు ప్రముఖ ఆలయాల్లో ప్రయోగాత్మకంగా లడ్డూలను తయారు చేసి విక్రయాలు ప్రారంభించారు. అయితే ఒక్కో ఆలయంలో పరిమాణం, ధరల్లో తేడాలున్నాయి. రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో ఒకే ధర, ఒకే పరిమాణంలో లడ్డూలు ఉండాలని సమావేశంలో నిర్ణయించారు.
No comments:
Post a Comment