ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జూన్ 8న ఏర్పాటు చేయనున్న మంత్రివర్గంలో జిల్లా నుంచి ఎవరికి అవకాశం లభిస్తుందనే దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. జిల్లాలో 15 మంది వైసిపి ఎమ్మెల్యేలు గెలిచారు. ఇద్దరు ఎమ్మెల్సీలున్నారు. మంత్రివర్గంలో స్థానం కోసం పలువురు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. ప్రత్తిపాడు నుంచి గెలిచిన మేకతోటి సుచరిత, బాపట్ల నుంచి గెలిచిన కోన రఘుపతి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మహ్మద్ ముస్తాఫా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఎన్నికల ప్రచార సభల్లోనే వైఎస్ జగన్ ఇద్దరి పేర్లు ముందస్తుగా ప్రకటించారు. మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిపిస్తే మంత్రిని చేస్తాననిఏప్రిల్ 9న జరిగిన మంగళగిరి సభలో జగన్ ప్రకటించారు. లోకేష్‌పై రామకృష్ణారెడ్డి ఘన విజయం సాధించారు. రాజధాని అంశంలో పూర్తి అవగాహన కలిగిన మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి మునిసిపల్ పరిపాలన శాఖ మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం ఉంది. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుపై చిలకలూరిపేటలో పోటీ చేసిన విశదల రజనీని గెలిపిస్తే పార్టీ సీనియర్ నాయకుడు మర్రి రాజశేఖర్‌ను మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. ఇదే అంశాన్ని చిలకలూరిపేట ఎన్నికల ప్రచార సభలోనూ ప్రకటించారు. ఎన్నికల్లో పత్తిపాటి పరాజయం పాలయ్యారు.
గుంటూరులో ఎవరికి వరమాల...
రజనీ కూడా ఘనవిజయం సాధించారు. సామాజిక సమీకరణలో భాగంగా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికి మంత్రివర్గంలో స్థానం ఉంటుందని ప్రచారం ఉంది. మైనార్టీల నుంచి గుంటూరు తూర్పునియోజకవర్గం అభ్యర్థి ముస్తాఫా పేరు పరిశీలనలో ఉంది. ముస్తాఫా, కోన రఘుపతిని టిడిపిలో చేర్చుకోవాలని ఆ పార్టీ అగ్రనాయకులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా వీరిద్దరు పార్టీని అంటిపెట్టుకుని ఉండటం వల్ల జగన్ దృష్టిలో వీరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరికి మంత్రి పదవి ఇవ్వని పక్షంలో కీలకమైన పదవులు ఎదో ఒకటి ఇస్తారనే వాదన కూడా ఉంది. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రత్తిపాడు నుంచి గెలిచిన మేకతోటి సుచరిత 2010లో కాంగ్రెస్ నుంచి వైసిపిలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. జగన్ వెంట నడిచి 2012లో జరిగిన ఉపఎన్నికల్లో వైసిపి తరుఫున ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన సుచరితకూ మహిళా కోటాలో అవకాశం రావచ్చని తెలిసింది. ఇదే రీతిలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన కూడా 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచి 2010లో రాజీనామా చేసి వైసిపిలో చేరి 2012లో ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. జగన్ ముందుగానే మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించడం వల్ల మాచర్ల ఎమ్మెల్యేకు అవకాశాలు ఏ మేరకు ఉంటాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆశావాహులు ఎక్కువగా ఉన్నందున కోన రఘుపతిని స్పీకర్‌గా నియమించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. రాజకీయ చైతన్యం, రాజధాని ప్రాంతం కావడం వల్ల ఈసారి మంత్రి పదవులు ఎక్కువ రావచ్చనే అభిప్రాయం పార్టీలో ఉంది. గతంలో వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో జిల్లాలో నలుగురు మంత్రులున్నారు. నాదెండ్ల మనోహర్ కొంత కాలం డిప్యూటీ స్పీకర్‌గా, మరికొంత కాలం స్పీకర్‌గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ముగ్గురు నుంచి నలుగురికి అవకాశం దక్కుతాయనే వాదన ఉంది. అయితే ఇతర జిల్లాలోనూ వైసిపి ఎమ్మెల్యేలు ఎక్కువ సంఖ్యలో గెలిచినందున ఈసారి ఎక్కువ మందికి ఛాన్సు దక్కకపోవచ్చునంటున్నారు. అలాగే తొలి విడతలో ఒక్కరు లేదా ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటుందని వీరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు మరొకరికి అవకాశం ఉంటుందనే వాదన ప్రభలంగా ఉంది.
No comments:
Post a Comment