Breaking News

25/06/2019

పురపాలికలుగా మారిన పంచాయితీలు


హైద్రాబాద్, జూన్ 25, (way2newstv.in)
కొన్నేళ్ల నుంచి సర్పంచుల పాలనలో నడుస్తున్న పలు గ్రామ పంచాయతీలు ఈసారి పురపాలికల పరిధిలోకి వెళ్లడంతో ఎన్నికలకు దూరమయ్యాయి.పురపాలికలుగా మార్పు చెందిన, విలీనమైన గ్రామ పంచాయతీల సర్పంచులు వచ్చే నెల చివరి వరకు పదవుల్లో కొనసాగనున్నారు. ఆయా పంచాయతీలను విలీనం చేసినప్పటికీ వారి పదవి కాలం వచ్చే నెల చివరి వరకు ఉండటంతో పదవి కాలం పూర్తయ్యే వరకు కొనసాగుతారు. జులై తర్వాత ఆయా పంచాయతీలను పురపాలికల్లో విలీనం చేయనున్నారు. ప్రస్తుతం వీటిల్లో ఎన్నికల సందడి కనిపించడం లేదు. ఆయా ప్రాంతాల్లో సర్పంచి పదవుల కోసం ఆసక్తిగా ఉన్న నాయకులు పురపాలిక ఎన్నికల కోసం ఎదురు చూడాల్సిందే.కొత్తగా ఏర్పాటు కానున్న పురపాలికల్లో ఉమ్మడి జిల్లాలో 40 పంచాయతీలు విలీనం కానున్నాయి. ఈసారి వీటిల్లో పురపాలిక ఎన్నికలను నిర్వహించనున్నారు.


పురపాలికలుగా మారిన పంచాయితీలు
నల్గొండ జిల్లాలో నకిరేకల్‌, సాగర్‌, హాలియా, చిట్యాల, చండూరు పురపాలికలుగా రూపాంతరం చెందనున్నాయి. శివనేనిగూడెం పంచాయతీతో కలిపి చిట్యాల, అంగడిపేట పంచాయతీ విలీనంతో చండూరు పంచాయతీలు పురపాలికలుగా మారనున్నాయి. నకిరేకల్‌, సాగర్‌, హాలియాల్లో ఏ పంచాయతీలు కలవడంలేదు. ప్రస్తుతమున్న ప్రాంతాలతో పురపాలికలుగా మారనున్నాయి. సూర్యాపేట జిల్లాలో పిల్లలమర్రి, గాంధీనగర్‌, కుడకుడ, బీబీగూడెం, దారవల్లి, కేటీఅన్నారం, కుసుమవారిగూడెం, దాసోజిగూడెం పంచాయతీలను సూర్యాపేట పురపాలికలో విలీనం చేయనున్నారు. కోదాడ పురపాలికలో కొమరబండ, తమ్మర, బాలాజీనగర్‌, విలీనం కానున్నాయి. రామాపురం,   నర్సాయిగూడెం, చిల్లేపల్లి గ్రామాలను కలిపి నేరేడుచర్ల పురపాలిక ఏర్పాటు కానుంది. మాలిపురం, నందపురం, అనంతారం గ్రామాలను విలీనం చేసి తిరుమలగిరి పురపాలికను ఏర్పాటు చేయనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తంగెడుపల్లి, లక్కారం, తాళ్ల సింగారం, లింగోజిగూడెం పంచాయతీలను కలిపి చౌటుప్పల్‌ పురపాలికను ఏర్పాటు చేస్తున్నారు. యాదగిరిగుట్ట, పాతగుట్ట, పెద్దిరెడ్డిపల్లి విలీనంతో యాదగిరిగుట్ట పురపాలికగా ఆవిర్భవించనుంది. బహదూర్‌పేట పంచాయతీని కలిపి ఆలేరును, బుజిలాపురం, కొండగడ పంచాయతీలను విలీనం చేసి మోత్కూరును పురపాలికగా ఏర్పాటు చేయనున్నారు. రేవన్‌పల్లి, జలాల్‌పురం, ముక్తాపురం పంచాయతీలతో కలిపి భూదాన్‌ పోచంపల్లిని పురపాలికగా మార్పు చేస్తున్నారు.

No comments:

Post a Comment