Breaking News

26/06/2019

గందరగోళంగా వైద్య ఆరోగ్య పోస్టులు


వరంగల్, జూన్ 26, (way2newstv.in)
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో భారీ స్థాయిలో పోస్టులను రెగ్యులర్‌ ప్రాతిపదికన భర్తీ చేయాలని తలపెట్టిన ప్రభుత్వం వెనకడుగు వేసే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రం వచ్చాక ఉద్యోగుల విభజన అయితే తప్ప ఖాళీల సంఖ్య తేలదని భావించిన సర్కారు 2017, 2018 సంవత్సరాల్లో నోటిఫికేషన్లను జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖలో నర్సింగ్‌, పారామెడికల్‌ పోస్టులు దాదాపు 4000కు పైగా ఏకకాలంలో రెగ్యులర్‌ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు వేల సంఖ్యలో వాటికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి టీఎస్‌ పీఎస్‌ సీ ద్వారా నిర్వహించే రాత పరీక్షలో 30 శాతం వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హయాంలో కాంట్రాక్టు పోస్టుల భర్తీల్లో రిజర్వేషన్లు పాటించలేదని, అలాంటి వారికి వెయిటేజీ ఇస్తే నిరుద్యోగులతో పాటు రిజర్వేషన్‌ ఉన్న తరగతులకు కూడా అన్యాయం జరుగుతుందని కొందరు నిరుద్యోగులు కోర్టును ఆశ్రయించారు. 

గందరగోళంగా వైద్య ఆరోగ్య పోస్టులు


ఈ నేపథ్యంలో కోర్టు దీనిపై స్టే విధించింది. కేసు కొనసాగుతున్నందున ఆ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. ఒక వైపు పరీక్ష రాసిన నిరుద్యోగ అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, పోస్టుల భర్తీ ఆలస్యమవుతుండడంతో వైద్య ఆరోగ్య శాఖలో సేవలకు విఘాతం కలుగుతున్నది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న వారి సేవలను ఈ సంవత్సరానికి గాను మరోసారి రెన్యూవల్‌ చేశారు. వీరి సేవలను రెన్యూవల్‌ చేసినప్పటికీ ప్రభుత్వాసుపత్రుల్లో నలుగురు చేయాల్సిన పనిని ఒక్కరే చేయాల్సి రావడంతో రోగులకు మెరుగైన సేవలు అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌, కుటుంబ సంక్షేమ, ప్రజారోగ్య విభాగాల్లో 3331 స్టాఫ్‌ నర్సులు, 325 ల్యాబ్‌ టెక్నీషియన్లు, 369 ఫార్మసిస్ట్‌ లు, 150 ఎఎన్‌ఎం, 115 రేడియోగ్రాఫర్లు, 105 ఫిజియోథెరపిస్టులు పోస్టులు మొత్తం 4,375 పోస్టులను భర్తీ పలు వివాదాలతో ఆగిపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలపై అధికారుల ద ష్టి సారించారు. కోర్టు తీర్పు వచ్చి ఫలితాలు వెలువడి శాశ్వత ప్రాతిపదికన పోస్టులు భర్తీ అయ్యేంత వరకు అవసరమైనంత మేరకు కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయాలని ఇప్పటికే ఒక ఉన్నతాధికారి ప్రభుత్వానికి సూచించినట్టు తెలిసింది. పోస్టుల భర్తీపై కోర్టు స్టే విధిస్తే దాన్ని తొలగించేందుకు ప్రభుత్వం ఎలాంటి గట్టి చర్యలు తీసుకోలేదని భావిస్తున్న నిరుద్యోగులు కొంత మంది ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగానే పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అదే జరిగితే రాష్ట్రం తెచ్చుకున్నా ఫలితం దక్కదని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పోస్టులు భర్తీ అయ్యేంత వరకు రోగులకు తగిన రీతిలో సేవలందించలేమని అధికారులు అంటున్నారు. నిరుద్యోగుల వినతి, ఉన్నతాధికారుల సూచనలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

No comments:

Post a Comment