Breaking News

04/06/2019

వసూళ్ల ఊసే లేదు... (నల్గొండ)


నల్గొండ, జూన్ 4 (way2newstv.in): 
రుణాల వసూళ్లకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) ఆసక్తి చూపడం లేదు. ఏళ్లు గడుస్తున్నా రూ.కోట్లలో ఉన్న బకాయిలు రాబట్టుకోలేకపోతోంది. రుణాలు ఇచ్చిన వారి చిరునామాలు సైతం బ్యాంకు వద్ద లేవు. వసూళ్లకు తిరుగుతున్నట్లు చూపిస్తూ అధికారులు రూ.లక్షల్లో ఖర్చులు రాస్తున్నారు. బకాయిలతో డీసీసీబీ కూరుకుపోతుంది. ఏటా రుణాల ఎగవేత పేరుతో రూ. లక్షల్లో నష్టం వస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు తప్పితే చర్యలు తీసుకోవడంలో దార్శనికత చూపడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.డీసీసీబీ పరిధిలో 30 శాఖలు పనిచేస్తున్నాయి. 2 లక్షల మంది రైతులు వివిధ సంఘాల ద్వారా సభ్యులుగా ఉన్నారు. ఇంత విస్తరించినా ఇచ్చిన రుణాలను వసూలు చేయలేక బకాయిలు గుట్టలా పేరుకుపోతున్నాయి. 2011లో నల్గొండ శాఖ 800 మంది మైనార్టీలకు రూ.కోటికి పైగా అధికారులు రుణాలు ఇచ్చారు. 


వసూళ్ల ఊసే లేదు... (నల్గొండ)
ఎనిమిదేళ్లు గడుస్తున్నా కనీసం ఒక్క రూపాయను కూడా వసూలు చేయలేకపోయారు. రుణాలు ఇచ్చే సమయంలో వారి పూర్తి వివరాలు సేకరించనట్లు తెలుస్తోంది. దీంతో రుణాలు తీసుకున్నవారి ఆచూకీ సరిగ్గా తెలియటం లేదు. బకాయిదారులకు నోటీసులు ఇస్తున్నామంటున్నా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు.మైనార్టీలకు రుణాల పంపిణీలో అక్రమాలు జరిగాయని, వాటిని ఇచ్చే సమయంలో పూర్తిస్థాయి సమాచారం సేకరించలేదని ఆరోపణలతో గత డీసీసీబీ పాలకవర్గంలోని అయిదుగురి డైరెక్టర్లతో కమిటీ వేశారు. నెల రోజుల పాటు విచారణ జరిపారు. రుణాలు ఇచ్చిన కొందరి ఉద్యోగులను బాధ్యులను చేశారు. నిబంధనలు పాటించకుండా పంపిణీ చేశారని నివేదిక ఇచ్చారు. కమిటీ నిర్వహణ ఖర్చు రూ.3 లక్షలు అయినట్లు చూపారు. తదనంతరం ఆ నివేదిక బుట్టదాఖలైంది. డీసీసీబీలో వ్యవసాయేతర, స్వయం ఉపాధి, స్వయం సహాయక సంఘాలకు అధికారులు రుణాలు ఇచ్చారు. వసూళ్లలో నిర్లక్ష్యం వల్ల 1998 నుంచి రూ.4 కోట్లు బకాయిలు ఉన్నాయి. చాలామంది రుణ గ్రహీతల చిరునామాలు లేవు. వోటీఎస్‌ కింద చెల్లించాలని కోరినా స్పందన లేదు. రుణాలు పొందిన నాటి నుంచి పూర్తిగా చెల్లించే తేదీ వరకు అప్పు పొందిన అసలుకు సమానమైన వడ్డీ చెల్లించినచో మిగతా మొత్తం మాఫీ చేస్తారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా 10 శాతం కూడా వసూలు కాలేదు.

No comments:

Post a Comment