Breaking News

26/06/2019

పాతాళంలోకి గంగ (విజయవాడ)

విజయవాడ, జూన్ 26  (way2newstv.in): 

వేసవి ప్రభావం భూగర్భ జలాలపై తీవ్రంగా పడుతోంది. ఏప్రిల్‌ నుంచే క్రమేపీ అడుగంటడం ప్రారంభమయ్యాయి. ఇది కొనసాగుతూనే ఉంది. వర్షాలు నామమాత్రంగా పడడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ కారణంగా తాగు, సాగునీటి అవసరాలకు బోర్లపైనే ఆధారపడుతున్నారు. దీని వల్ల మరింతగా నీటిమట్టం పడిపోతోంది. జిల్లాలో సగటు నీటి మట్టం 12.13 మీటర్లకు దిగజారింది. మరో వైపు ఖరీఫ్‌ సీజన్‌ మొదలైంది. డెల్టాలోని పలు ప్రాంతాల్లో రైతులు ముందస్తుగా పంటలు వేస్తున్నాయి. కాలువలకు నీరు వదలకపోవడంతో బోర్లపైనే నార్లు పోస్తున్నారు.జిల్లాలో భూగర్భ నీటి మట్టం రోజు రోజుకు వేగంగా పడిపోతోంది. ప్రస్తుతం ఇది 12.13 మీటర్లకు దిగజారింది. డిసెంబరు నుంచి నీటిమట్టం క్రమేపీ పడిపోతూ వచ్చింది. మే నెలలో భూగర్భ నీటి మట్టం 12.05 మీటర్లు ఉంది. జూన్‌ నెలలో మరింత పడిపోయింది. 0.08 శాతం తగ్గింది. ఈ ప్రభావం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కనిపిస్తోంది. జిల్లాలో మూడు మీటర్లలోపు నీరు 13.90 శాతం ప్రాంతాల్లోనే దొరుకుతోంది. మూడు నుంచి ఎనిమిది మీటర్లలోపు 30.70 శాతం చోట్ల అందుతోంది. 55.40 శాతం ప్రాంతాల్లో 8 మీటర్లపైగా వెళ్తేనే నీరు దొరికే పరిస్థితి నెలకొంది. సముద్ర తీర ప్రాంతాల్లో తక్కువ లోతులోనే నీరు దొరుకుతున్నా.. ఇది తాగేందుకు పనికిరాని పరిస్థితి. ఉప్పునీటిమయంగా మారడమే దీనికి కారణం. 


పాతాళంలోకి గంగ (విజయవాడ)
కైకలూరులో 1.62 మీ, కృత్తివెన్ను.. 1.62 మీ, మచిలీపట్నం.. 1.286 మీ, మోపిదేవి మండలం వెంకటాపురం.. 2.66 మీ, నాగాయలంక.. 2.281 మీటర్లలోనే దొరుకుతోంది.ఈ ఏడాది ప్రారంభం నుంచి లోటు వర్షపాతం వెన్నాడుతోంది. గత ఏడాది డిసెంబరులో పెథాయ్‌ తుపాను రావడంతో ఆ నెలలో మంచి వర్షాలు నమోదయ్యాయి. జనవరి నుంచి సరిగా కురవలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సాధారణ వర్షపాతం 7.4 మి.మీ కాగా.. 5.2 మి.మీ మాత్రమే పడింది. మార్చిలో 10.7 మి.మీకు గాను 5.2 మి.మీ పడింది. ఏప్రిల్‌లో 14.5 మి.మీ పడాల్సి ఉంది, కానీ పడింది.. 4.9 మి.మీ మాత్రమే. మే నెలలో 116.0 మి.మీ గాను 15.8 మి.మీ కురిసింది. జూన్‌లో ఇప్పటి వరకు 30.10 మి.మీ కురవాలి.. 4.90 మి.మీ పడింది. 83.70 శాతం లోటు నమోదైంది. ఈ సంవత్సరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తింది. దీనిని నివారించేందుకు బ్యారేజి నుంచి కాలువలకు నీటిని పలు దఫాలు వదలాల్సి వచ్చింది. ప్రస్తుతం తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలోని తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్న పలు ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు. మచిలీపట్నం, గుడివాడ, పెడన, కైకలూరు, కృత్తివెన్ను, తదితర ప్రాంతాల్లో సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో గత నెల 28 నుంచి జూన్‌ 7వ తేదీ వరకు రైవస్‌ కాలువకు 0.64 టీఎంసీలు వదిలారు. బందరు కాలువకు మే, 29 నుంచి జూన్‌, 5వరకు 0.18 టీఎంసీలు ఇచ్చారు. ఇటీవల జడ్పీ సమావేశంలో పలువురు సభ్యులు దివిసీమలో తాగునీటి సమస్యలపై తమ గళాన్ని వినిపించారు. తక్షణమే నీటిని అందించాలని కోరారు. దీంతో బుధవారం నుంచి దివిసీమకు వెళ్లే కేఈబీ కాలువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజి నీటి నిల్వ 8.9 అడుగులు ఉంది. కేఈబీ కాలువకు రోజుకు 302 క్యూసెక్కులు చొప్పున ఇస్తున్నారు.పశ్చిమ కృష్ణా పరిధిలోని ముసునూరు, చాట్రాయి, విస్సన్నపేట, నూజివీడు, ఆగిరిపల్లి, బాపులపాడు మండలాలు భూగర్భ జలశాఖ అధికారుల గణాంకాల ప్రకారం నీటిమట్టం 20 మీటర్ల కంటే దిగువకు పడిపోయింది. ఈ ప్రాంతాల్లో నాగార్జునసాగర్‌ జలాలే దిక్కు. గత కొన్నేళ్లుగా సాగర్‌ జలాలు సరిగా రావడం లేదు. దీంతో బోర్ల కింద మామిడి, అరటి, అయిల్‌పామ్‌, కూరగాయలు, మొక్కజొన్న, మిర్చి, జామ, తదితర పంటలను సాగు చేస్తున్నారు. ముసునూరులో అట్టడుగు స్థాయికి నీటిమట్టం పడిపోయింది. నీటి జాడ కోసం చాలా మంది రైతులు విధిలేని పరిస్థితుల్లో 20 హెచ్‌పీ మోటార్లను కూడా వినియోగిస్తున్నారు. పశ్చిమ కృష్ణాలోని చాలా ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు బోర్లపైనే ఆధారపడతారు. డెల్టాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు, గుడివాడ, ఉంగుటూరు మండలాల్లో బోర్ల కింద వరినార్లు పోస్తున్నారు. పమిడిముక్కల, తోట్లవల్లూరు మండలాల్లోనూ నార్లు పోసుకుంటున్నారు. చెరకు, పసుపు, అరటి, కంద, తమలపాకు వంటి పంటలను ప్రస్తుతం వేస్తున్నారు. కాలువలకు నీరు వదలకపోవడంతో బోర్లపైనే నీటి కోసం ఆధారపడుతున్నారు. విచ్చలవిడిగా నీటిని తోడేస్తున్నారు. పశ్చిమ ప్రాంతంలోని తిరువూరు, ఎ.కొండూరు, మైలవరం, తదితర మండలాల్లో కూరగాయలు, పూలు సాగుచేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భూగర్భ జలం మరింతగా పడిపోయే ప్రమాదం ఉంది.

No comments:

Post a Comment