హైద్రాబాద్, జూన్ 7, (way2newstv.in)
జూన్ నెల వచ్చిందంటే స్కూల్‍కు పోయే పిల్లలున్న పేరెంట్స్ గుండెల్లో కంగారు పుడుతుంది. నూతన అకడమిక్ ఇయర్‍లో స్కూల్స్ జూన్ 12 నుంచి ప్రారంభమవుతున్నాయి. పిల్లల స్కూల్స్ ఫీజులు, పుస్తకాలు, నోట్‍బుక్స్, డ్రెస్ ఇతరత్రా ఖర్చులు తడిసి మోపడైపోతున్నట్లు పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ కుటుంబాలపై దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. తమ కటుంబ ఆర్థిక బడ్జెట్ తలకిందులవుతుందని వారు ఆందోళన పడుతున్నారు. ఏడాదంతా దాచుకున్న సొమ్మంతా ఒక్క నెలలోనే ఆగకుండా ఖర్చైపోతుందని పేరెంట్స్ పేర్కొంటున్నారు. కానీ అదే సమయంలో తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన చదువుకు ఎంతైనా ఖర్చు చేసేందుకు పేరెంట్స్ వెనుకాడటం లేదు. పైగా అప్పులు చేసైనా ఫీజులు చెల్లించేందుకు మొగ్గు చూపుతున్నారు. సరిగ్గా ఇక్కడే ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల మేనేజ్‍మెంట్లు పేరెంట్స్ ఆశలను, ఆశయాలను క్యాష్ చేసుకుంటున్నాయి. ఫీజులు ఇతర ఖర్చుల రూపేణా అందిన కాడికి దోచుకొని పేరెంట్స్ ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
పేరెంట్స్ కు జూన్ టెన్షన్
చిన్న తరగతుల నుంచే ఐఐటీ ఫౌండేషన్ తరగతులంటూ అదనంగా వసూలు చేస్తున్నాయి. ఈ టెక్నో, డిజిటల్, మోడల్, కాన్సెప్ట్, గ్రామర్ అంటూ కొత్తకొత్త పేరులు తగిలించి ఎక్స్ ట్రా ఫీజులు, డొనేషన్ల పేరిట దోచుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు తెస్తున్నాయి. వీటన్నీ మూలంగా జూన్ నెలలో కటుంబ ఆర్థిక బడ్జెట్ అల్లకల్లోలం అవుతుంది.ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం 16 ఏండ్ల కింద తెచ్చిన జీఓ నంబర్ 1 సమర్థంగా అమలు కావడం లేదని విద్యార్థి సంఘాలు, ఎడ్యుకేషన్ యాక్టివిస్టులు అంటున్నారు. జీఓ అమలును పర్యవేక్షించాల్సి అధికార వర్గం ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‍మెంట్లతో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని నామమాత్ర తనిఖీలతో అధికారులు మమ అనిపిస్తున్నారు. జీఓ అమలుకు ప్రైవేట్ స్కూల్స్ లోని పేరెంట్స్ కమిటీల్లో ఉన్న కొందరు స్కూల్ మేనేజ్‍మెంట్లకు కొమ్ముకాస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్నవారికి అదనపు రాయితీలు ఇస్తూ తమ ప్లాన్‍ను అమలు చేసుకుంటూ ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచి వసూలు చేసుకుంటున్నాయి. పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తే అక్కడ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఉచిత దుస్తులతో పాటు అర్హత, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను ప్రభుత్వమే ఫ్రీగా అందజేస్తుందని విద్యాశాఖాధికారులు పేర్కొంటున్నారు.నగరంలోని ప్రైవేట్ స్కూల్స్ లో ఎల్‌కేజీ, యూకేజీలకు ఏడాదికి రూ.15 వేల నుంచి 25 వేల వరకు వసూలు చేస్తుండటం గమనార్హం. పుస్తకాలు, యూనిఫాం, షూస్ ఇతరత్రా ఖర్చులకు అదరూ.10వేల వరకు అదనంగా ఖర్చు అవుతోంది. కార్పొరేట్ స్కూల్స్ లో చేర్పిస్తే రూ.35 వేల నుంచి 50 వేల వరకు ఖర్చవుతుంది. వీటికి అదనంగా ట్రాన్స్ పోర్ట్ కు రూ.15 వేల నుంచి 20 వేలు కట్టాలి. పుస్తకాలు, యూనిఫాం, షూస్, బెల్ట్, సాక్స్ ఇతరత్రా ఖర్చులకు ఎంతలేదన్నా ఇంకో రూ.10వేల నుంచి రూ. 15 వేలు సిద్ధంగా ఉంచుకోవాల్సిందే.
No comments:
Post a Comment