Breaking News

06/06/2019

ఐదేళ్ల నుంచి కానరాని పరిశ్రమలు


అదిలాబాద్, జూన్ 6, (way2newstv.in)
అదిలాబాద్ జిల్లాకు ఈ సామెత కరెక్ట్ గా సూటవుతుంది. ఐదేళ్ల నుంచి కొత్త పరిశ్రమల ఏర్పాటు ఊసే లేకుండా పోయింది. ప్రభుత్వం కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనేక ప్రోత్సాహకాలను అందచేస్తుండడమే కాకుండా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తోడ్పాటును అందిస్తోంది. అయితే ఉమ్మడి జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్క కొత్త పరిశ్రమ ఏర్పాటు కాకపోవడం పాలకుల చిత్తశుద్ధికి నిదర్శనంగా చెబుతున్నారు. జిల్లాలో విస్తారమైన సహజ వనరులు, మానవ వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ వనరులను సద్వినియోగం చేసుకోవడంలో యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం స్టార్టప్‌లు, మేకిన్ ఇండియా లాంటి ప్రోత్సాహిక విధానాలను ప్రవేశ పెట్టినప్పటికీ ఒక పరిశ్రమ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఒకటి రెండు మినహా ఇప్పటి వరకు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. 


ఐదేళ్ల నుంచి కానరాని పరిశ్రమలు
జిల్లావ్యాప్తంగా గోదావరి నది పరివాహకం ఉన్నందున ఎలాంటి నీటి కొరత లేదు. అలాగే మానవ వనరులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. చాలా మంది సాంకేతిక విద్యతో పాటు అత్యున్నత విద్యను అభ్యసించిన వారు ఉన్నారు. వీరందరినీ పరిశ్రమల కోసం సద్వినియోగం చేసుకుంటే ఉపాధి, అభివృద్ధి రంగాలు పురోగమిస్తున్నాయని అంటున్నారు. అలాగే రైల్వే సౌకర్యంతో పాటు రోడ్డు రవాణా సౌకర్యం ఉండడంతో పరిశ్రమల ద్వారా ఉత్పత్తయ్యే సరుకుల రవాణాకు ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. సరిహద్దులోనే మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలతో పాటు నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు ఉన్నాయి. అలాగే ఇదే సరిహద్దున బడా పరిశ్రమలు ఉండడంతో ఉమ్మడి జిల్లా అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనుకూలంగా ఉంటుందంటున్నారు. ప్రభుత్వ పరమైన ప్రోత్సాహకాలు గాని విస్తృతమైన ప్రచారం జరగకపోవడంతో ఇతర ప్రాంతాల పారిశ్రామికవేత్తలుజిల్లాలో పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకు రావడం లేదని అంటున్నారు. అయితే కొంతమంది చిన్న తరహా పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నప్పటికీ వారికి ప్రోత్సాహకాల విషయంలో అనేక రకాల నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి. దీనికితోడు బ్యాంకులు సైతం రుణాలిచ్చేందుకు ముందుకు రావడం లేదు. బ్యాంకుల సహాయ నిరాకరణ కారణంగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు నిరాశకు గురై కొత్త పరిశ్రమలు స్థాపించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వపరంగా ఉమ్మడి జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు కృషి జరిగితే ఓ వైపు అభివృద్ధి పాటు మరోవైపు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని పలువురు సూచిస్తున్నారు.

No comments:

Post a Comment