Breaking News

10/06/2019

రెండో వారంలో మున్సిపాల్టీ ఎన్నికలు


హైద్రాబాద్, జూన్ 10, (way2newstv.in)
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలకు 2019 జూన్ రెండోవారం తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో ఆరు మున్సిపల్ కార్పోరేషన్లు, 142 మున్సిపాలిటీలు ఉన్నాయి. నక్రేకల్ మున్సిపాలిటీ మినహా మిగతా మున్సిపాలిటీల గడువు వచ్చే నెలతో పూర్తవుతుంది. జూలైలో కొత్త పాలక వర్గాలు రావలసి ఉంటుంది. మున్సిపాలిటీలకు ముందుగానే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ, లోక్‌సభ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వరుసగా గత ఐదు నెలల నుండి కొనసాగుతండటంతో వీలుకాలేదు. మున్సిపల్ చైర్‌పర్సన్లు, మున్సిపల్ వార్డుల వర్గీకరణ (ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలుగా) చేస్తూ ప్రభుత్వం ఒక నివేదికను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందించాల్సి ఉంది. ఈ రిజర్వేషన్ల వివరాలు అందగానే మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధంగానే ఉందని ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి స్పష్టం చేశారు. 

రెండో వారంలో మున్సిపాల్టీ ఎన్నికలు
ప్రభుత్వం పూర్తి సమాచారం ఇవ్వగానే ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను విడుదల చేస్తామని బుధవారం ఇక్కడ మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో రాష్ట్రంలో 73 మున్సిపాలిటీలు ఉండేవి. ఆ తర్వాత మేజర్ గ్రామ పంచాయతీలను నగరపంచాయతీలుగా, ఆ తర్వాత మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేశారు. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట గ్రామ పంచాయతీని తొలుత నగరపంచాయతీగా అప్‌గ్రేడ్ చేశారు. ఆ తర్వాత దీన్ని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసిన వెంటనే వాటికి ప్రత్యేక ప్రతిపత్తి లభిస్తుంది. పన్నులు పెంచాల్సి ఉంటుంది. అలాగే తాగునీరు, వీధి దీపాలు, రోడ్లు తదితర వౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటులో అనేక సమస్యలు ప్రభుత్వానికి ఎదురయ్యాయి. 136 గ్రామాలను మున్సిపల్ కార్పోరేషన్లలో కలిపి వేశారు. మరో 131 గ్రామ పంచాయతీలను పాత 42 మున్సిపాలిటీలలో కలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో 175 గ్రామాలను కలిపివేశారు. ఈ విధంగా గ్రామాలను మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కార్పోరేషన్లలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో కేసులు నమోదయ్యాయి. కోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించడంతో ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలిగిపోయాయి.ఎన్నికలు జరగాల్సిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్లలో 136 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 293 లక్షల మంది ఓటర్లు ఉన్నట్టు ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తాజాగా జరిగిన పరిషత్ ఎన్నికల్లో 156 లక్షల మంది ఓటర్లు ఉన్నట్టు అధికారికంగా వెల్లడించారు. అందువల్ల మున్సిపాలిటీల్లో 136 లక్షల మంది ఓటర్లు ఉన్నట్టు స్పష్టమవుతోంది.

No comments:

Post a Comment