Breaking News

25/06/2019

ముందుకు సాగని మున్సిపల్ పోరు


నల్లగొండ, జూన్ 25, (way2newstv.in)
మున్సిపల్‌ ఎన్నికలపై పీటముడి పడింది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు, అధికారులు చెబుతున్నదానికి పొంతన లేకుండా పోయింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు, ప్లార్లమెంటు ఎన్నికలు, స్థానిక సంస్థలకు ఎన్నికలు ముగిశాయి. ఇక మిగిలింది మున్సిపల్‌ ఎన్నికలు మాత్రమే. ఈ ఎన్నికలను కూడా నిర్వహించి పరిపాలనపై దృష్టి సారించాలని సర్కారు భావిస్తోంది. అందులో భాగంగానే జులైలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహిస్తామని సిఎం కెసిఆర్‌ వెల్లడించారు. కానీ అధికారులు మాత్రం రెండు నెలల్లో నిర్వహించడం సాధ్యం కాదనీ, ఐదు నెలల సమయం కావాలని అంటున్నారు. ఈ విషయాన్ని అధికారులు కోర్టుకు సైతం చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి సూచన ప్రకారం ఎన్నికలు జరుగుతాయా? లేక అధికారులు చెబుతున్నట్టు ఐదు నెలల సమయం పడుతుందా? అనే సందిగ్ధత ఏర్పడింది. 

ముందుకు సాగని మున్సిపల్ పోరు


రాష్ట్రంలో పాత, కొత్త మున్సిపాల్టీలు కలిపి 142 ఉన్నాయి. హైదరాబాద్‌ మినహా పాత 53 మున్సిపాల్టీలకు జులై 2న పాలకమండళ్ల సమయం ముగియనుంది. గ్రామపంచాతీ యలను కొత్త మున్సిపాల్టీలుగా గుర్తించింది. ఇక్కడ ప్రస్తుతం స్పెషలాఫీసర్ల పాలన కొనసాగుతుంది. వీటన్నింటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కొత్త మున్సిపాల్టీలో జనాభా ప్రాదిపదికన వార్డుల విభజన ప్రక్రియ, ఎస్సి, ఎస్టి రిజర్వేషన్లు పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. కోర్టుకు మాత్రం ఎక్కువ సమయం కావాలని కోరారు. బిసి రిజర్వేషన్లలో అత్యంత వెనకబడిన కులాలు (ఎంబిసి)లకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని ఎంబిసి సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. బిసి రిజర్వేషన్ల ఖరారుపై పేచీ కొనసాగుతుంది. దీంతోపాటు మున్సిపాల్టీల్లో అవినీతి అరికట్టేందుకు, పౌరసేవలు మరింత సులభతం చేయడానికి, స్వయం సమృద్ధి సాధించడానికి కొత్త మున్సిపల్‌ చట్టం రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ఆ చట్టం ఇప్పటికీ కొలిక్కి రాలేదని అధికారులు చెబుతున్నారు. చట్టం పూర్తయిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలన్న సర్కారు లక్ష్యం నెరవేరేలా లేదని అధికారులు చెబుతున్నారు. ''రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలకు జులై చివరకల్లా ఎన్నికలు నిర్వహిస్తాం. పది, పదిహేను రోజుల్లో ఆ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు పూర్తి చేస్తాం. నూతన మున్సిపల్‌ చట్టాన్ని ఇప్పుడే తేవాలా? ఆర్డినెన్స్‌ తెచ్చి ఎన్నికలు నిర్వహించాలా? అనే దానిపై ఆలోచిస్తున్నాం'' అని సిఎం చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికలను నిర్వహించేందుకు 151 రోజుల సమయం కావాలని మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ కోర్టుకు తెలిపారు. 131 గ్రామాల్ని 42 మున్సిపాల్టీలు లేదా మున్సిపల్‌ కార్పొరేషన్లల్లో విలీనం చేయడంతోపాటు 173 గ్రామాల్ని 68 మున్సిపాల్టీలుగా గుర్తించినట్టు తెలిపారు.

No comments:

Post a Comment