ఖరీఫ్ సాగుకు అన్నదాత సిద్ధం అవుతున్నాడు.ఖరీఫ్ సీజన్‌కు పెట్టుబడి సాయం అందచేయడంతో పాటు విత్తనాలను సబ్సిడీపై అందచేయడానికి వ్యవసాయ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. సాధారణ సాగు విస్తీర్ణం అంచనాలకు అనుగుణంగా విత్తనాలను సేకరించి సిద్ధంగా ఉంచింది. ఆగ్రో రైతు సేవ కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మన గ్రోమోర్ కేంద్రాల ద్వారా విత్తనాలు విక్రయించడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఇప్పటికే వరి 8900 క్వింటాళ్ల , జొన్న 1562 క్వింటాళ్లు,యూరియా 34388 మెట్రిక్ టన్నులు, డిఎపి 2907 మెట్రిక్ టన్నులు, యంఓపి 18539 మెట్రిక్ టన్నులతో పాటు పలు కాంప్లెక్స్ ఎరువులు అవసరమని గుర్తించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు.
ఖరీఫ్ కు అన్న దాత రెడీ
రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంతో పెట్టుబడికి డబ్బులు చేతికందడంతో చినుకు పడితే చాలు పనులు చేయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంకు ముందే పెట్టుబడి కోసం ప్రభుత్వం ఎకరాకు నాలుగు వేల చొప్పున రంగారెడ్డి జిల్లాలో రూ. 282 కోట్లు రైతులకు అందచేయడంతో పల్లెలలో వ్యవసాయం పండగలా చేయడానికి రైతన్నలు ముందుకు సాగుతున్నారు. ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం గతం కన్నా పెరగనుండటంతో అధికారులు సైతం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 17 వేల హెక్టార్‌లు, పత్తి 85 వేల హెక్టార్‌లు, జొన్న 15620 హెక్టార్‌లు, మొక్కజొన్న 40755 హెక్టార్‌లు, పెసరలు 75 హెక్టార్‌లు, కందులు 6888 హెక్టార్‌లు, మినుములు 100 హెక్టార్‌లు, ఆముదం 1810 హెక్టార్‌లు, జనుము మూడు వేల హెక్టార్‌లు, సోయా 524 హెక్టార్‌లుగా అధికారులు అంచనాలు వేసినా వరుణుడు సకాలంలో కరుణిస్తే సాగు విస్తీర్ణం మరింత పెరగనుంది.
No comments:
Post a Comment