Breaking News

11/06/2019

కల్లోలంగా కృష్ణా టీడీపీ


విజయవాడ, జూన్ 11, (way2newstv.in)
కృష్ణా జిల్లా టీడీపీలో క‌ల్లోలం ప్రారంభ‌మైందా? ఈ జిల్లా మొత్తాన్ని త‌న చంక‌లో పెట్టుకుని ఆధిప‌త్యం చ‌లాయించిన నాయ‌కుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వర‌రావు పై దండెత్తేందుకు త‌మ్ముళ్లు రెడీ అయ్యారా? ఈ క్రమంలో ఇప్ప టికే దీని తాలూకు సంకేతాలు బ‌య‌ట ప‌డుతున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. మంత్రిగా ఉన్న స‌మ‌యంలో దేవినేని ఉమా జిల్లాపై ఆధిప‌త్యం చూపించార‌న‌డంలో సందేహం లేదు. డిప్యూటీ స్పీక‌ర్‌గా ఉన్న మండ‌లి బుద్ధ ప్రసాద్ వంటివారి నుంచి ఎమ్మెల్యేల వ‌ర‌కు కూడా ఆయ‌న త‌న పెత్తనం సాగించారు. త‌న సామాజిక వ‌ర్గానికే చెందిన నాయ‌కుల‌ను కూడా అణ‌గ‌దొక్కేందుకు ప్రయ‌త్నించారు.పార్టీ అధినేత‌, అప్పటి సీఎం చంద్రబాబు వ‌ద్ద మంచి మార్కులు కొట్టేసేందుకు దేవినేని ప్రయ‌త్నించారు. ఈ క్రమంలో త‌న‌క‌న్నా ఎవ‌రైనా ఎదిగిపోతారేమో..? త‌న‌క‌న్నా ఎవ‌రైనా చంద్రబాబు వ‌ద్ద మంచి మార్కులు తెచ్చుకుంటారేమోన‌ని నిత్యం త‌ల్లడిల్లిపోయిన దేవినేని ఎవ‌రూ ఎద‌గ‌కూడ‌ద‌నే రేంజ్‌లో త‌న వికృత రాజ‌కీయాల‌కు తెర‌దీశారు. నాయ‌కుల‌తో విభేదించారు. ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను కూడా లెక్కచేయ‌కుండా వ్యవ‌హ‌రించారు. 


కల్లోలంగా కృష్ణా టీడీపీ
దీంతో గ‌న్నవ‌రం ఎమ్మెల్యేగా ఉన్న వంశీ నుంచి విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని, విజ‌య‌వాడ తూర్పు ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ వ‌ర‌కు కూడా దేవినేనిపై క‌సి పెరిగిపోయింది. ఆయ‌న‌పై ఎలాగైనా క‌సి తీర్చుకునేందుకు వీరంతా ఏక‌మ‌య్యారా? అన్నట్టుగా తాజాగా వారు వ్యవ‌హ‌రించిన తీరు బ‌హిర్గత‌మైంది.కృష్ణా జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో అందునా.. మాజీ మంత్రి దేవినేని ఉమా ఆధ్వర్యంలో  విజ‌య‌వాడ‌లోని ఏ క‌న్వెన్షన్ సెంట‌ర్‌లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి వారం ముందుగానే షెడ్యూల్ ఖ‌రారైంది. అదే స‌మ‌యంలో టీడీపీ ప్రజాప్రతినిధులుగా ఉన్న తూర్పు ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్‌, విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని, గ‌న్నవ‌రం ఎమ్మెల్యే వంశీ మోహ‌న్‌కు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. అదేవిధంగా మాజీల‌కు కూడా ఆహ్వానాలు పంపారు. అయితే, వీరెవ‌రూ కూడా ఇఫ్తార్‌లో పాల్గొన‌లేదు. త‌న‌కు ఢిల్లీలో ప‌నుంద‌ని ఎంపీ నాని సోమ‌వారం ఉద‌యాన్ని ఫ్లైట్ ఎక్కేశారు. ఇక వంశీ ఈ కార్య‌క్ర‌మానికి డుమ్మా కొట్టారు.ఇక గ‌ద్దె పూర్తిగా అంటీముట్టన‌ట్టుగా వ్యవ‌హ‌రించారు. ఇక‌,మాజీ డిప్యూటీ స్పీక‌ర్ మండ‌లి కూడా ఈ కార్యక్రమానికి హాజ‌రుకాలేదు. అంతేకాదు, ఎంపీ వ‌ర్గీయులుగా పేరు బ‌డ్డ ఎమ్మెల్సీలు కూడా దీనికి హాజ‌రు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. సాక్షాత్తూ.. చంద్రబాబు ఆయ‌న కుమారుడు లోకేష్‌లు పాల్గొన్నప్ప‌టికీ.. వీరెవ‌రూ హాజ‌రు కాక‌పోవ‌డాన్ని బ‌ట్టి వీరంతా దేవినేనిని టార్గెట్ చేసేందుకే ఇఫ్తార్‌కు దూరంగా ఉన్నార‌నే ప్ర‌చారం పార్టీ వ‌ర్గాల్లోనే బ‌లంగా వినిపిస్తోంది. దీనికి చాలా కార‌ణాలే క‌నిపిస్తున్నాయి.ప‌దేళ్ల పాటు కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లో వ‌న్ మ్యాన్ షో చేస్తూ టీడీపీలోనే అంద‌రిని అణ‌గ‌దొక్కాల‌న్న విధంగా ఉమా రాజ‌కీయాలు చేశార‌న్న టాక్ ఉంది. పైన చెప్పుకున్న వారు ఎవ‌రితోనూ ఆయ‌న‌కు స‌ఖ్యత లేదు. చివ‌ర‌కు డిప్యూటీ స్పీక‌ర్ మండ‌లి బుద్ధప్రసాద్ సౌమ్యంగా ఉంటార‌న్న పేరున్నా ఆయ‌న‌తోనూ ఉమాకు స‌ఖ్యత లేదు. పార్టీ సీనియ‌ర్ నేత కాగిత వెంక‌ట్రావుతోనూ పొస‌గ‌ని ప‌రిస్థితి. ఇలా పార్టీలో ప‌దేళ్ల పాటు అంద‌రితోనూ విబేధాలు పెట్టుకున్న ఆయ‌న్ను ఇప్పుడు పార్టీ ప్రతిప‌క్షంలో ఉండ‌డంతో ఎవ్వరూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. ఈ క్రమంలోనే జిల్లా రాజ‌కీయాల్లో ఉమా ఆధిప‌త్యాన్ని త‌గ్గించ‌క‌పోతే టీడీపీ నేత‌లు పార్టీపై తిరుగుబావుటా ఎగుర‌వేసేందుకు కూడా వెనుకాడే ప‌రిస్థితి లేద‌ని తెలుస్తోంది.

No comments:

Post a Comment