Breaking News

27/06/2019

చేపకు ఏదీ చేయూత..? (తూర్పుగోదావరి)

కాకినాడ, జూన్ 27  (way2newstv.in): 
జిల్లాలో సుదీర్ఘ సాగర తీరం..అపార మత్స్య సంపద..ఇలా అన్ని వనరులున్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో వెనుకబాటు కనిపిస్తోంది. సేకరిస్తున్న మత్స్యసంపదను ఎక్కువ కాలం నిల్వ ఉంచలేక తక్కువ ధరలకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ క్రమంలో వనరుల సద్వినియోగం ద్వారా మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంపొందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. జిల్లాలోని 13 మండలాల పరిధిలో 164 కిలోమీటర్ల మేరకు సాగర తీరం ఉంది. 105 గ్రామాల్లోని 60,168 మంది మత్స్యకారులు సముద్రంలో చేపల వేటపైనే ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.03 లక్షల మంది సముద్రంపై ఆధారపడి ఉన్నారు. జిల్లాలో రొయ్యల నిల్వకు ప్రైవేటు పరంగా అనువైన వసతులు, ప్రాసెసింగ్‌ యూనిట్లు అందుబాటులో ఉన్నా..సముద్రంలో మత్స్యకారులు సేకరిస్తున్న సంపద పరంగా ఎలాంటి వసతులూ లేవు. దీంతో కష్టానికి తగిన ప్రతిఫలం పొందలేని పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు 30 ఉన్నాయి. 

చేపకు ఏదీ చేయూత..? (తూర్పుగోదావరి)

వేటకు వెళ్లిన మత్స్యకారులు ఆయా కేంద్రాలకు మత్స్య సంపదతో చేరుకుంటారు. ప్రభుత్వ పరంగా చేపల నిల్వ కేంద్రాలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు అందుబాటులో లేవు. ప్రైవేటు యాజమాన్యాల నిర్వహణలో 3,082 మెట్రిక్‌ టన్నుల సామర్య్యం గల 10 ఫ్రీజింగ్‌ ప్లాంట్లు ఉన్నాయి. ప్రాసెసింగ్‌ కేంద్రాలు 13 ఉండగా వాటిలో రోజుకు 558 మెట్రిక్‌ టన్నుల సరకు ప్రాసెస్‌ చేసే వీలుంది.ఆదాయంలో విశాఖ జిల్లా అగ్రస్థానంలో ఉంది. మన జిల్లాలో మత్స్యసంపద అపారంగా అందుబాటులో ఉన్నా వాటి నిల్వ, నిర్వహణ సామర్థ్యాలు లేకపోవడంతో వెనుకబడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ప్రభుత్వపరంగా ఏటా అందిస్తున్న సైకిళ్లు, వలలు, శీతల పెట్టెల కారణంగా తాత్కాలిక ఉపశమనం కలుగుతోంది తప్ప ఇతర ప్రయోజనాలు చేకూరడం లేదు. జిల్లాలో 2017-18 ఆర్థిక  సంవత్సరంలో రూ.6.40 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళిక కింద రూ.3.13 కోట్లు, మత్స్యకారుల అభివృద్ధి పథకం కింద రూ.4.71 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో అర్హులకు సైకిళ్లు, వలలు, ఐస్‌ పెట్టెలు అందజేశారు. దీనికితోడు వేట నిషేధ భృతి కింద 22,250 మందికి రూ.నాలుగు వేల చొప్పున రూ.8.20 కోట్లు బ్యాంకు ఖాతాలకు జమచేశారు. మెకనైజ్డ్, మోటరైజ్డ్‌ బోట్ల యజమానులకు డీజిల్‌ రాయితీ పథకం కింద నమోదైన పడవలకు రూ.2.50 కోట్లు కేటాయించారు. సముద్రంలో చేపల వేట ద్వారా మత్స్య సంపద సేకరణలో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది. సముద్రం, సంప్రదాయ చేపల పెంపకం, రొయ్యల పెంపకం ఇలా అన్నీ కలిపితే మాత్రం నాలుగో స్థానానికి పరిమితం అయింది. మొదటి స్థానానికి ఎదగాలంటే ప్రస్తుతం మత్స్యకారులకు అందుతున్న చేయూత చాలదని, అదనపు వసతులు సమకూర్చాలన్న వాదన వినిపిస్తోంది. ప్రతికూల వాతావరణం, నైపుణ్య లేమి, సముద్రంలో వేటకు వెళ్లే వారికి భద్రత తక్కువగా ఉండడం వంటి ప్రతికూల అంశాలు మత్స్యకారులను వెంటాడుతున్నా..వారి జీవనానికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఉపాధిలో మెరుగైనదారులు చూపాల్సి ఉంది. దీనికితోడు సంప్రదాయ మత్స్యకారులు జిల్లాలో 82,392 మంది ఉన్నారు. ఇక జిల్లాలో చేపల చెరువులతో పాటు 4,088 హెక్టార్లలో రొయ్యల పెంపకం సాగుతోంది. జిల్లాలో ఆక్వా రైతులు 24,469 మంది వరకు ఉన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2017-18 సంవత్సరానికి ఉత్పత్తిలో 89 శాతం వృద్ధి ఉంది. జీవీఏ రూ.2,155 కోట్ల నుంచి రూ.5,846 కోట్లకు పెరిగింది. గత నాలుగేళ్లలో 171 శాతం వృద్ధి సాధించామని అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇంత సామర్థ్యం ఉన్నా జిల్లా నుంచి పీతలు రెండు శాతం, రొయ్యలు రెండు శాతం.. చేపలు 3 నుంచి 4 శాతం మాత్రమే యూరప్, లాటిన్‌ అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేయగలుగుతున్నారు. నిల్వ నిర్వహణ సామర్థ్యం పెంచగలిగితే ఎగుమతులకు ఊతమిచ్చినట్లవుతుంది.

No comments:

Post a Comment