Breaking News

10/06/2019

అసౌకర్యాలమయం జనగామ బస్ స్టేషన్


జనగాం , జూన్10, (way2newstv.in)
జనగామ ఆర్టీసీ బస్‌ స్టేషన్‌లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. జిల్లా కేంద్రంగా మారాక ఆర్టీసీ బస్‌స్టేషన్‌ను విస్తరిస్తామని, వజ్ర బస్సులకు జనగామలో హాల్టింగ్‌ ఇప్పిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి నుంచి స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వరకు హామీలు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి హామీలు నెరవేరలేదు.ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో సౌకర్యాలు కరవై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్‌స్టేషన్‌లో ఉన్న తొమ్మిది ప్లాట్‌ఫారాలు సరిపోవడం లేదు. అదనంగా మరో రేకుల షెడ్డుతో పాలకుర్తి, మోత్కూరు ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఆగేందుకు ప్లాట్‌ఫారం ఏర్పాటు చేశారు. పార్కింగ్‌ స్ధలం వైపు సగభాగం సీసీ రహదారులు లేకపోవడంతో చిన్నపాటి వర్షం వచ్చినా చిత్తడిగా మారుతోంది వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు నడిచే ఏసీ వజ్ర బస్సులు ప్రయాణికులు లేక ఖాళీగా వెళ్తున్నా, మధ్యలో ఆపడం లేదు.


అసౌకర్యాలమయం  జనగామ బస్ స్టేషన్
జనగామ డిపోలో ఎక్కవ శాతం పాత కాలం నాటి బస్సులే అధికంగా ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్‌ బస్సులు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు నడిచే ఇతర డిపోలకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సులనే ఈ ప్రాంత ప్రజలు ఆశ్రయించాల్సి వస్తోంది.జిల్లా పరిధిలోని 13 మండలాల ప్రజలే కాకుండా పొరుగున ఉన్న సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు వాణిజ్య, విద్యా అవసరాల కోసం నిత్యం జనగామకు వస్తూపోతుంటారు. వరంగల్‌-హైదరాబాద్‌, సిద్దిపేట-సూర్యాపేట ప్రధాన రహదారులతో పాటు హుస్నాబాద్‌, కరీంనగర్‌ వంటి ప్రాంతాలకు జనగామ నుంచి రవాణా మార్గాలు ఉన్నాయి. నిత్యం వేలాది మంది ప్రయాణికులు బస్టాండ్‌ ద్వారా ప్రయాణిస్తుంటారు. అయితే అసౌకర్యాలతో అవస్థలు తప్పడం లేదు.మూత్రశాలల నిర్వాహణ సరిగ్గా లేక దుర్వాసన వస్తోంది. సులభ్‌ కాంప్లెక్‌ బస్‌స్టేషన్‌ ఆవరణకు దూరంగా ఏర్పాటు చేశారు. బస్‌స్టేషన్‌లో గతంలో ఉన్న మూత్రశాలలను పునరుద్ధరిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాన్లు ఉన్నా తిరగడం లేదు. టెలివిజన్‌ పని చేయడం లేదు. చాలినన్ని బెంచీలు లేకపోవడంతో ప్రయాణికులు నిలబడే ఉండాల్సి వస్తోంది. బస్‌ స్టేషన్‌లో పారిశుద్ధ్య లోపం కొట్టుకొచ్చినట్లు కనబడుతోంది. టెండర్ల ద్వారా ఏర్పాటు చేసుకున్న దుకాణాల యజమానులు అనుమతి పొందిన వ్యాపారాలు కాకుండా ఎవరి ఇష్టం వచ్చిన రీతిలో వారు విక్రయాలు జరుపుతున్నారు. స్టేషన్‌లో తాగునీటి వసతి కరవైంది. ఉన్న నల్లాల వద్ద పాకురు పట్టి అపరిశుభ్రంగా మారింది.

No comments:

Post a Comment