Breaking News

05/06/2019

పర్యావరణాన్ని పరిరక్షణ ప్రతి ఒక్కరి భాద్యత : మంత్రి అల్లోల


నిర్మ‌ల్ జూన్ 5 (way2newstv.in):
జీవకోటి మనుగడకు జీవనాధారమైన పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ‌ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. బుధ‌వారం ప్రపంచ పర్యావరణ సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలో మంత్రి అల్లోల మొక్కలు నాటారు. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ.. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగానే ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగి, వర్షాలు తగ్గుతున్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణను సామాజిక భాద్య‌త‌గా ప్ర‌తి ఒక్క‌రూ తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. పర్యావరణ  పరిరక్షణ కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని వెల్లడించారు. దీంట్లో భాగంగానే తెలంగాణ స‌ర్కార్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. హరితహారం కార్యక్రమం ప్రపంచానికే ఆదర్శమన్నారు. హరితహారంలో భాగంగా 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 


పర్యావరణాన్ని పరిరక్షణ ప్రతి ఒక్కరి భాద్యత : మంత్రి అల్లోల
నాలుగు విడ‌తల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 113 మొక్క‌లు నాటామ‌ని, ఐదో విడుత హరిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా ఈ ఏడాది 83 కోట్ల మొక్క‌ల‌ను నాటాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పదివేల నర్సరీల్లో వందకోట్ల మొక్కలు సిద్ధంగా ఉంచామ‌న్నారు. రాష్ట్రాన్ని ఆకుపచ్చగా మార్చాలన్న లక్ష్యం కోసమే హరితహారం కార్య‌క్ర‌మాన్ని సీఎం కేసీఆర్ చేపట్టార‌ని వెల్ల‌డించారు. మొక్కలు నాట‌డ‌మే కాదు పెంపకం, రక్షణకు ప్రాధాన్యత ఇస్తేనే హ‌రిత‌హారం ల‌క్ష్యం నెర‌వేరుతుంద‌ని చెప్పారు. భవిష్యత్ తరాల కోసమే చెట్లు పెంపు ఆలోచన అందరిలో రావాలని, ప్రజల భాగస్వామ్యంతోనే హరితహారం విజయవంతం అవుతుందన్నారు జులైలో జరిగే ఐదో విడత హరితహారంలో అందరూ పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. హరితహారంలో నాటిన ప్రతీ మొక్క బతికేలా రక్షణచర్యలు తీసుకోవాలని ప్రజలకు, అధికారులకు సూచించారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఈ ఏడాది ఉష్ణోగ్ర‌త‌లు పెరిగాయ‌న్నారు. అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడానికి వాతావరణంలో వస్తున్న మార్పులే ప్రధాన కారణ‌మ‌న్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు అందరూ పాటుపడితేనే ఇలాంటి విపత్కర వాతావరణ పరిస్థితులను అడ్డుకోగలమ‌ని వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎఫ్ డీవో గోపాల‌రావు, ఎఫ్ ఆర్వో జైపాల్ రెడ్డి, ఇత‌ర అట‌వీ శాఖ అధికారులు, సిబ్బంది, టీఆర్ఎస్ నాయ‌కులు జీవ‌న్ రెడ్డి, మొహినొద్దీన్, ప్ర‌సాద్ రెడ్డి, పాకాల రామ‌చంద‌ర్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment