Breaking News

04/06/2019

హూజూర్ నగర్ నుంచి కోదండరామ్

నల్గిండ, జూన్ 4, (way2newstv.in): 
హుజూర్‌ నగర్ ఎమ్మెల్యేగా ఉంటూ నల్లగొండ ఎంపీగా విజయం సాధించారు టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ కుమార్ రెడ్డి. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. హుజూర్ నగర్ స్థానానికి ఉప ఎన్నిక కూడా ఖాయమైంది. ఉత్తమ్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయడం లాంఛనమే కావడంతో... ఈ సీటు మరోసారి గెలుచుకోవడంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఉత్తమ్ రాజీనామా చేస్తే ఇక్కడి నుంచి ఆయన భార్య, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి పోటీ చేయడం ఖాయమనే ప్రచారం ఎప్పటి నుంచో సాగుతోంది. ఇక్కడి నుంచి టీఆర్ఎస్ తరపున కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత పోటీ చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపించాయి.  

హూజూర్ నగర్ నుంచి కోదండరామ్
తాజాగా హుజూర్ నగర్ స్థానం నుంచి తెలంగాణ జనసమతి అధ్యక్షుడు, టీజేఎస్ మాజీ చైర్మన్ కోదండరామ్ బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జనగామ నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకుని చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన కోదండరామ్... ఈ సారి అవకాశం వస్తే హుజూర్ నగర్ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఉప ఎన్నిక కావడంతో అధికార టీఆర్ఎస్‌ను తట్టుకోవాలంటే కోదండరామ్ వంటి వారిని బరిలోకి దింపితే బాగుంటుందని కాంగ్రెస్ యోచిస్తోందని టాక్ వినిపిస్తోంది. కోదండరామ్ బరిలోకి దిగితే బీజేపీ సహా ఇతర పక్షాలు తమ అభ్యర్థులను బరిలోకి దింపే అవకాశం ఉండకపోవచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. అయితే తన బలం ఉన్న సిట్టింగ్ స్థానాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదండరామ్‌కు విడిచిపెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఉత్తమ్ రాజీనామాతో ఖాళీ కాబోతున్న హుజూర్ నగర్ స్థానం టీఆర్ఎస్, కాంగ్రెస్ తరపున ఎవరు బరిలోకి దిగుతారన్న చర్చ చాలా ముందుగానే మొదలైంది.

No comments:

Post a Comment