Breaking News

08/06/2019

పాఠాలు చెప్పేవారేరీ..? (మహబూబ్ నగర్)

మహబూబ్ నగర్, జూన్ 8 (way2newstv.in):
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. ప్రధానంగా నాగర్‌కర్నూలు జిల్లాలో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచినా.. పాఠశాలల్లో మాత్రం ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోపక్క టీఆర్టీ, టీఎస్‌పీఎస్సీ రాసిన నిరుద్యోగ ఉపాధ్యాయులు నియామకాల కోసం ఎదురు చూస్తున్నారు. మరో 4 రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయి. అప్పటి వరకైనా ప్రభుత్వం స్పందించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.జిల్లాలో మొత్తం 436 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 

 పాఠాలు చెప్పేవారేరీ..? (మహబూబ్ నగర్)
వీటి భర్తీకి ఇటీవల ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నిర్వహించారు. నాగర్‌కర్నూలు జిల్లాలో 2016 సెప్టెంబరు చివరి నాటికి 436 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ లెక్కలు తేల్చి, అప్పట్లో టీఎస్‌పీఎస్సీకి నివేదికను ఇచ్చింది. వీటిలో అత్యధికంగా ఎస్జీటీ పోస్టులు 329 ఉన్నాయి. జిల్లాలో మొత్తం ఉపాధ్యాయ పోస్టులు 3,534 ఉండగా, ప్రస్తుతం 3,098 మంది మాత్రమే ఉన్నారు. మొత్తం పోస్టుల్లో ఏజెన్సీ ప్రాంతంలో 364, మైదాన ప్రాంతాల్లో 3,170 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఏజెన్సీలో అన్ని కేటగిరిల్లో 124 పోస్టులు, మైదాన ప్రాంతంలో 312 చొప్పున మొత్తం 436 పోస్టులు ఖాళీలున్నాయి.తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 2017 ఫిబ్రవరిలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) ప్రకటన జారీ చేసింది. ప్రకటన వెలువడిన ఏడాది తర్వాత 2018 ఫిబ్రవరిలో  పరీక్ష నిర్వహించారు. ఆగస్టులో 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల అర్హతపత్రాలను పరిశీలించారు. నవంబరులో తుది ఫలితాలు, ఎంపిక జాబితా విడుదల చేశారు. ఆరు నెలలు గడిచినా ఇప్పటి వరకు నియామక ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అభ్యర్థులు మాత్రం ఏరోజుకు ఆ రోజు నియామక ఉత్తర్వులు వస్తాయేమోనని ఎదురు చూస్తున్నారు.

No comments:

Post a Comment