Breaking News

19/06/2019

కమలం వైపు టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు


హైద్రాబాద్, విజయవాడ, జూన్ 19 (way2newstv.in)
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు, తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయాలు పెను సంచ‌ల‌నాల‌కు కేంద్రాలుగా మారుతున్నాయి. ప‌లువురు నాయ‌కుల క‌ద‌లిక‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. వారి మాట‌లు రాజ‌కీయవ‌ర్గాల్లో హాట్‌హాట్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా ఈ పెనుమార్పుల‌కు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నే కేంద్ర‌బిందువుగా ఉంద‌ని చెప్పొచ్చు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి అటు అంధ్ర‌ప్ర‌దేశ్‌లో, ఇటు తెలంగాణ‌లో రెండో స్థానానికి.. అవ‌స‌ర‌మైతే.. అధికారంలోకి రావాల‌న్న వ్యూహంతో ఇప్ప‌టి నుంచే బీజేపీ నేత‌లు పావులు క‌దుపుతున్నారు. ఏపీలో టీడీపీ దారుణ ఓట‌మిని ఆస‌రాగా చేసుకుని, తెలంగాణ‌లో కాంగ్రెస్ ద‌య‌నీయ ప‌రిస్థితిని అద‌నుగా తీసుకుని ఒక్క‌సారిగా ఎదిగిపోవాల‌న్న‌ది క‌మ‌లం వ్యూహంగా క‌నిపిస్తోంది.ఇటీవ‌ల జ‌రిగిన ఏపీ అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో అధికార టీడీపీ ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. కేవ‌లం మూడు పార్ల‌మెంటు స్థానాలు, 23 అసెంబ్లీ స్థానాల్లో మాత్ర‌మే విజ‌యం సాధించింది. ఇక తెలంగాణ‌లో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా బీజేపీ నాలుగు పార్ల‌మెంట్ స్థానాల్లో విజ‌యంతో సంచ‌ల‌నం సృష్టించింది. నిజామాబాద్‌లో ఏకంగా సిట్టింగ్ టీ ఆర్ ఎస్ ఎంపీ, సీఎం కేసీఆర్ కూతురు క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను బీజేపీ అభ్య‌ర్థి అర్వింద్ ఓడించారు. అలాగే.. క‌రీనగ‌ర్‌లో సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌ను బీజేపీ అభ్య‌ర్థి బండి సంజ‌య్ ఓడించారు. 


కమలం వైపు టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు

అలాగే.. ఆదిలాబాద్ స్థానంతోపాటు సికింద్రాబాద్ స్థానాన్ని క‌మ‌లం త‌న ఖాతాలో వేసుకుంది.ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో పార్టీ సీనియ‌ర్ నేత కిష‌న్‌రెడ్డికి కేంద్ర హోం శాఖ స‌హాయ‌మంత్రి ప‌ద‌వి కూడా క‌ట్ట‌బెట్టారు. ఆ పార్టీ వ్యూహ‌క‌ర్త రామ్‌మాధ‌వ్ త‌ర‌చూ హైద‌రాబాద్‌లో తిష్ట‌వేసి ఏపీ, తెలంగాణ‌లో బీజేపీని బ‌లోపేతం చేసే వ్యూహాల‌పై దృష్టి సారిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ కూడా మూడు స్థానాల్లో విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు కేంద్రంలో బీజేపీ తిరుగులేని విజ‌యాన్ని సాధించింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బ‌ల‌ప‌డాలంటే.. ఇదే స‌రైన స‌మ‌యని భావించిన బీజేపీ పెద్ద‌లు అందుకు త‌గ్గ‌ట్టుగా మైండ్‌గేమ్ ఆడుతూ.. చేరిక‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీలు కోమ‌టి వెంక‌ట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి కూడా బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో శ‌నివారం నాడు న‌ల్ల‌గొండ‌లో కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఆ పార్టీలో కల‌క‌లం రేపుతున్నాయి. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప‌ని అయిపోయింద‌ని, ఇక్క‌డ టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయం బీజేపీయేన‌ని రాజ‌గోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లతో వెంక‌ట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డితోపాటు మ‌రికొంద‌రు కీల‌క నేత‌లు బీజేపీలోకి వెళ్తున్నార‌నే వాద‌న‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరుతోంది.ఇక ఏపీలోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీల‌ను కూడా బీజేపీలోకి తీసుకునేందుకు గ‌ట్టిగానే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఆప‌రేష‌న్ క‌మ‌లం.. రాంమాధ‌వ్ క‌నుస‌న్న‌ల్లో న‌డుస్తున్న‌ట్లు తెలుస్తోంది. విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని టీడీపీ అధిష్టానాన్ని ఇరుకునే పెట్టేలా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఆయ‌న ఇప్ప‌టికే నేరుగా బీజేపీ పెద్ద‌ల‌తో ట‌చ్‌లోకి వెళ్లిపోయారు. రాజ్య‌స‌భలో బీజేపీ బ‌లం త‌క్కువుగా ఉండ‌డంతో బీజేపీ టీడీపీకి చెందిన ఆరుగురు రాజ్య‌స‌భ స‌భ్యుల‌పై దృష్టి పెట్టిన‌ట్టు కూడా జ‌రుగుతోన్న ప్ర‌చారం ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ఇక ఎన్నిక‌ల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోవ‌డం… టీడీపీకి భ‌విష్య‌త్ నాయ‌క‌త్వ స‌మ‌స్య స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతుండ‌డంతో ఆ పార్టీకి చెందిన కీల‌క నేతలు ఇప్పుడు క‌మ‌లం వైపు చూస్తున్నారు.ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు రామ్ మాధ‌వ్‌తో మంత‌నాలు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. ఈ ప‌రిణామాల‌తో ముందుముందు మ‌రెన్ని సంచ‌ల‌నాలు న‌మోదవుతాయో చూడాలి మ‌రి

No comments:

Post a Comment