నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రుతుపవనాలు కేరళకు వారం రోజుల పాటు ఆలస్యంగా చేరుకున్నాయి. మొత్తానికి రుతుపవనాల రాకతో కేరళలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెలఖారు నాటికి నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరిస్తాయి. నాలుగు నెలల పాటు నైరుతి రుతుపవనాలు కొనసాగనున్నాయి. రుతుపవనాల రాకతో ఈ నెల 9, 10న కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ఐఎండీ వరుసగా నారింజ, పసుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది.
కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు
9న కొల్లాం, అలప్పుజ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నారింజ హెచ్చరిక.. తిరువనంతపురం, పతినంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిసూర్, మలప్పురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా పసుపు హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపింది. విపత్కర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. మత్య్సకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించింది. నైరుతి అరేబియా సముద్రంపై గంటకు 45 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
No comments:
Post a Comment