Breaking News

25/06/2019

యూనిఫాం సరే... కూలి సంగతేంటి..


కరీంనగర్, జూన్ 25,(way2newstv.in)
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫారాల కోసం గత విద్యా సంవత్సరం చివరలోనే క్లాత్‌ పంపిణీ చేసిన సర్కారు.. నేటికీ కుట్టు కూలి డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో విద్యార్థులు దుస్తుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కుట్టు కూలి డబ్బులు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యం కారణంగా నేటికీ యూనిఫారాలు దర్జీల వద్దే మూలుగుతున్నాయి. పాఠశాలల పునః ప్రారంభం రోజునే ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున దుస్తులు పంపిణీ చేస్తామని హడావుడి చేసిన విద్యాశాఖ.. స్కూళ్లు తెరుచుకుని 25 రోజులు గడుస్తున్నా వారికి యూనిఫారాల పంపిణీ విషయంలో చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.  జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి రూ. 70 లక్షల నిధులు కుట్టు కూలి అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో 82 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.  అందు లో 9, 10 తరగతులకు దుస్తులు పంపిణీ చేయడం లేదు. ఆ రెండు తరగతులను మినహాయిస్తే 70 వేల మంది విద్యార్థులకు పంపిణీ చేయాల్సి ఉంది. 1నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేయాలి. 

యూనిఫాం సరే... కూలి సంగతేంటి....

ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున 1,40,000 దుస్తులు పంపిణీ చేయాల్సి ఉంది. ఒక్కో జత కుట్టేందుకు అధికారులు రూ. 50 చొప్పున వెచ్చిస్తున్నారు. అంటే ఈ లెక్కన జిల్లాలో సుమారు రూ.70 లక్షల కుట్టు కూలి డబ్బులు అవసరమవుతాయని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల పునః ప్రారంభమైన మొదటి రోజునే విద్యార్థులకు రెండు జతల దుస్తులు, నూతన పాఠ్య పుస్తకాలు అందిస్తామని విద్యాశాఖ ఆర్భాటంగా ముందుగానే ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా మూడు నెలల ముందుగానే యూనిఫారాలకు సంబంధించి క్లాత్‌ కూడా పంపిణీ చేసింది. ఎస్‌ఎంసీ(స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ) తీర్మానాల మేరకు ఎవరికి అనుకూలంగా ఉన్న చోట వారు కుట్టించుకోవాలని హెచ్‌ఎంలకు సూచించింది.ఈక్రమంలో అనుకున్న విధంగానే చాలాచోట్ల పాఠశాలల పునఃప్రారంభం నాటికి దర్జీల వద్ద స్టిచింగ్‌ సైతం పూర్తయింది. అయితే, దర్జీలకు కూలి డబ్బులు మాత్రం ప్రభుత్వం మంజూరు చేయలేదు. కాగా, కొందరు దర్జీలు హెచ్‌ఎంలపై నమ్మకంతో కొన్ని పాఠశాలలకు దుస్తులు అందజేశారు. మెజారిటీ దర్జీలు తమకు కూలి డబ్బులు ఇచ్చే వరకు దుస్తులు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. దీంతో కుట్టిన దుస్తులు వారివద్దే ఉండిపోయాయి. ఈ విషయమై పరిగి ఎంఈఓ హరిశ్చందర్‌ను వివరణ కోరగా.. ఇంకా కూలి డబ్బులు మంజూరు కాలేదని, అవి నేరుగా ఎస్‌ఎంసీ ఖాతాల్లోకే వస్తాయని తెలిపారు. నిధులు వచ్చాక దర్జీలకు చెల్లించి యూనిఫారాలు తీసుకొచ్చి పంపిణీ చేస్తామని వివరించారు.

No comments:

Post a Comment