Breaking News

06/06/2019

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం


తిరుపతి జూన్ 6, (way2newstv.in)
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది.  ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ సందర్భంగా  కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలో జూన్ 9 నుండి 13వ తేదీ వరకు మహాసంప్రోక్షణ  నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. 


శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

ఉదయం 6.30 నుండి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. మధ్యాహ్నం 12.00 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలైన తిరుప్పావడసేవ, కల్యాణోత్సవం రద్దు చేశారు.
పరదాలు విరాళం :తిరుపతికి చెందిన  నరసింహులు నాలుగు పరదాలు, రెండు కురాళాలను ఆలయానికి విరాళంగా అందించారు. రానున్న బ్రహ్మోత్సవాల్లో వీటిని వినియోగించనున్నారు.  ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  ధనంజయులు, సూపరింటెండెంట్   రమణయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్  అనిల్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment