Breaking News

01/06/2019

మోడీకి వారసుడిగా అమిత్ షా


న్యూఢిల్లీ, జూన్ 1, (way2newstv.in)
కేంద్రంలో బీజేపీకి ఈసారి అధికారం చేజారడం ఖాయమంటూ ప్రతిపక్షాలు ఊదరగొట్టిన వేళ అద్భుతమైన మెజార్టీతో భారత ప్రధానిగా మోదీ రెండో సారి పదవీ బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ కంచుకోటలను బద్దలుగొట్టారు. అమేథిలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా పరాజయం మూటగట్టుకున్నారు. స్వాతంత్ర్య భారత దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీకి వరసగా రెండోసారి పడమర దారి చూపించింది మోదీ-అమిత్ షా ద్వయం. మోదీ-అమిత్ షా ద్వయం.. యావత్ భారత దేశాన్ని కాషాయ మయం చేస్తూ ముందుకెళ్తున్న తీరు చూస్తుంటే ఎన్డీఏ మరో దఫా అధికారంలోకి వచ్చినా రావచ్చంటున్నారు విశ్లేషకులు. అదే జరిగితే అప్పుడు ప్రధాని ఎవరు? బీజేపీలో నరేంద్ర మోదీ వారసుడు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎన్డీఏతో పాటు ప్రతిపక్ష యూపీఏ పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. తాజాగా మోదీ ఏర్పాటు చేసుకున్న మంత్రివర్గ కూర్పు ద్వారా ఆ దిశగా కొన్ని సంకేతాలు వెలువడ్డాయి. తొలిసారి మంత్రివర్గంలో చోటుదక్కించుకున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు ప్రధాని మోదీ కీలక బాధ్యతలు అప్పగించారు. 


మోడీకి వారసుడిగా అమిత్ షా
ఆయనకు హోం శాఖను కేటాయించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పార్టీలో మోదీ తర్వాత నం.2గా ఉన్న అమిత్ షాను.. ఇప్పుడు ప్రభుత్వంలోనూ నం.2గా పట్టం కట్టారు. భవిష్యత్ వ్యూహంలో భాగంగానే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2024 నాటికి మోదీ 2.0 పరిపాలన పూర్తవుతుంది. మోదీకి అప్పటికి 73 ఏళ్లు నిండుతాయి. పార్టీలో ఆయన ఓ సంప్రదాయం నెలకొల్పారు. దీని ప్రకారం 75 ఏళ్లు నిండిన నాయకులు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలి. లోక్‌సభ ఎన్నికల్లో వారు పోటీకి అనర్హులు. ఎల్‌.కె. అద్వాణీ, మురళీ మనోహర్‌జోషి, సుమిత్రా మహాజన్‌ లాంటి దిగ్గజాలను ఇదే నియమం ఆధారంగా పక్కన పెట్టారు. దీని ప్రకారం.. 2024లో మోదీ కూడా పక్కకు తప్పుకోవాల్సిందే.బీజేపీ వరసగా మూడోసారి కూడా లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే.. మోదీ తన వారసుడిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు కీలకమైన హోం శాఖ బాధ్యతలు చేపట్టిన అమిత్‌ షా భవిష్యత్తులో మోదీ వారసుడిగా ప్రధాని పీఠం అధిష్ఠించే అవకాశం ఉందన్నమాట. మోదీ, అమిత్ షా మంచి మిత్రులే అయినప్పటికీ వారిద్దరికీ వయసులో పదేళ్ల తేడా ఉంది. దీంతో ప్రధాని పదవికి అమిత్ షా అన్ని విధాలా సరితూగుతారనే వాదన వినిపిస్తోంది. బీజేపీ అధ్యక్షుడిగా అత్యధిక విజయాలు నమోదు చేసిన ఘనత కూడా ఆయనకు ఉంది. భారత రాజకీయాల్లో కృష్ణార్జునుల్లా గుర్తింపు పొందింది మోదీ-అమిత్‌ షా ద్వయం. 1980 నుంచి వీరిద్దరూ రాజకీయాల్లో చేయిచేయి పట్టుకుని నడుస్తున్నారు. వాజ్‌పేయి- అద్వాణీ ద్వయం తర్వాత దేశంలో ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లో మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పార్టీలో నంబర్‌ 1, 2లుగా వీరిద్దరూ ఉన్నారు. గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులోనూ మోదీ, అమిత్ షా కీలక పాత్ర పోషించారు. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల తర్వాత కూడా మోదీ ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నికవడంలో అమిత్‌ షా ప్రధాన పాత్ర పోషించారు. నాటి నుంచి అమిత్‌ షాను మోదీ అత్యంత నమ్మకస్తుడిగా భావిస్తున్నారు. నాడు ఆయనకు ఏకంగా 10 మంత్రిత్వ శాఖలను కట్టబెట్టడమే ఇందుకు తార్కాణం. వాటిలో హోం, న్యాయ, జైళ్లు, సరిహద్దు భద్రత, హౌసింగ్‌ తదితర కీలక శాఖలుండటం విశేషం. తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. మోదీ వారసుడు, బీజేపీ భవిష్యత్తు నేతగా అమిత్ షా అవతరించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. 

No comments:

Post a Comment