Breaking News

11/06/2019

2021 టార్గెట్ బెంగాల్


కోల్ కత్తా, జూన్ 11, (way2newstv.in)
అందరి అంచనాలను తారుమారు చేస్తూ పశ్చిమ బెంగాల్‌లో 18 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ తాజాగా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించింది. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు బెంగాల్ రాజకీయాలను ఒక కుదుపు కుదపడమే కాదు, బలమైన శక్తిగా బీజేపీ అవతరించడం అధికార టీఎంసీ, ప్రతిపక్ష కాంగ్రెస్, సీపీఎంలకు ఊహించని ఎదురుదెబ్బగా పరిణమించింది. 42 ఎంపీ స్థానాల్లో 18 స్థానాల్లో విజయదుందుభి మోగించి యావత్ దేశాన్ని బీజేపీ ఆశ్చర్యపరిచింది. తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటలను బద్దలు కొట్టిన కమలం అసెంబ్లీలోనూ పాగా వేసేందుకు ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. 294 సభ్యులు కలిగిన శాసనసభలో 250 స్థానాలను కైవసం చేసుకునేందుకు లక్ష్యంగా నిర్ణయించుకుంది. 2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నాటికి పార్టీ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలపై బీజేపీ కేంద్ర అధినాయకత్వం ఇప్పటినుంచే వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తోంది. కిందిస్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేయడంతో పాటు తృణమూల్ నాయకుల చేరికలపై ఆచితూచి అడుగులు వేస్తోంది. బెంగాలీల ఆత్మగౌరవం నినాదంతో పటిష్ఠంగా ఉన్న తృణమూల్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు సంసిద్ధమవుతోంది. 


2021 టార్గెట్ బెంగాల్
పారిశ్రామికీకరణతో ఉద్యోగాల కల్పన, పౌరసత్వ బిల్లు, జాతీయ పౌర రిజిస్టర్ అమలు చేస్తామన్న స్పష్టమైన హామీలతో బీజేపీ ముందుకు కదులుతోంది. అయితే బీజేపీ ఇస్తున్న హామీలను అంతగా పట్టించుకోని తృణమూల్ 2021లో మళ్లీ అధికారం మాదేనన్న ధీమాతో ఉంది. రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాలన్న బీజేపీ కల కలగానే మిగిలిపోతుందని భావనలో ఉంది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో 40.5 శాతం ఓట్లు సాధించిన బీజేపీకి బెంగాల్ అసెంబ్లీలో ఆరుగురు సభ్యుల ప్రాతినిధ్యం ఉంది. ‘లోక్‌సభ ఎన్నికల్లో 23 స్థానాలను లక్ష్యంగా పెట్టుకున్నా 18 స్థానాల్లో విజయం సాధించాం. ప్రస్తుతం అసెంబ్లీలో 250 సీట్లు లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. ఈ లక్ష్య సాధన దిశగా వ్యూహరచన చేస్తున్నాం’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి, బెంగాల్ ఇన్‌చార్జి కైలాష్ విజయ్ వర్గీయ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు కేంద్ర అధినాయకత్వంతో రాష్ట్ర బీజేపీ శాఖ సంప్రదింపులు ప్రారంభించింది. టీఎంసీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టిన బీజేపీ అన్నీ ఆలోచించిన తర్వాతే పార్టీలో వారికి ఆహ్వానం పలకాలని నిర్ణయించుకుంది. ప్రజల్లో మంచి పేరు కలిగిన నాయకులను మాత్రమే పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించినట్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడని బీజేపీ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించడం గమనార్హం. టీఎంసీ ఎమ్మెల్యే మనిరుల్ ఇస్లాం చేరికపై వివాదం చెలరేగడం, జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్లిన నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన వ్యాఖ్యానించారు. ముస్లిం నేతలను పార్టీలో చేర్చుకునే విషయంలో రాష్ట్ర బీజేపీ శాఖలో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్టవ్య్రాప్తంగా పార్టీ రూపురేఖలు మార్చే దిశగా బీజేపీ అధినాయకత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని అసెంబ్లీ సెగ్మెంట్లను నాలుగు విభాగాలుగా విభజించింది.లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గట్టి పోటీ ఇచ్చిన నియోజకవర్గాల వారీగా విభజించి ఆ మేరకు పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. గ్రామాలకు సైతం పార్టీ కర్యకలాపాలు 

విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది.

No comments:

Post a Comment