తిరుపతి, మే 15, (way2newstv.in)
ముఖ్యమంత్రి స్వంత జిల్లా అయిన చిత్తూరులో ప్రతీ నియోజకవర్గమూ రెండు పార్టీలకు కీలకంగా మారింది. రెండు పార్టీలకూ ఇక్కడ విజయం సాధించేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగించాయి. మొత్తానికి ఎన్నికలు ముగిసి ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. జిల్లా కేంద్రమైన చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఇక్కడ జనసేన పార్టీ సైతం పెద్ద ఎత్తున ఓట్లు చీల్చే అవకాశం ఉంది. దీంతో చిత్తూరు నియోజకవర్గంలో గెలుపెవరిదనే ఎవరి ఊహలకూ అందడం లేదు. అయితే రెండు పార్టీలూ గెలుపుపై పూర్తి ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ముందు నియోజకవర్గంలో జరిగిన రాజకీయ పరిణామాలు గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.గత ఎన్నికల్లో చిత్తూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డీకే సత్యప్రభ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులుపై 6,799 మెజారిటీతో విజయం సాధించారు.
చిత్తూరులో రెండు పార్టీలకు కీలకం
అంతకుముందు 2009లోనూ జంగాలపల్లి శ్రీనివాసులు ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈసారి తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఏఎస్ మనోహర్ కు కేటాయించింది. సత్యప్రభను రాజంపేట ఎంపీగా పోటీ చేయించారు. ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న డీకే సత్యప్రభపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఏర్పడింది. ఆమె ప్రజలకు అందుబాటు లేరని, కొంతమంది పెత్తనం నియోజకవర్గంలో ఎక్కువైందనే విమర్శలు ఉన్నాయి. సమస్యలు సైతం పరిష్కారం కాకపోవడం వంటి అనేక అంశాల వల్ల టిక్కెట్ ను కొత్త వారికి కేటాయించారు. ఏఎస్ మనోహర్ కు టిక్కెట్ రావడం పట్ల కూడా కొంతమంది నేతలు వ్యతిరేకంగా ఉన్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులుపై రెండుసార్లు స్వల్ప మెజారిటీతో ఓడిపోయన సానుభూతి ఉంది. ప్రధానంగా ఆయన సామాజకవర్గ ప్రజలు ఇక్కడ గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఆయన బలంతో పాటు తెలుగుదేశం పార్టీపై ఉన్న వ్యతిరేకత, ఆ పార్టీలో విభేదాలు వైసీపీకి ఎక్కువగా కలిసి వచ్చాయి. అయితే, ఎన్నికల వేళ వైసీపీకి అనుబంధంగా ఉంటూ చివరి వరకు టిక్కెట్ కోసం ప్రయత్నించిన సీకే బాబు తెలుగుదేశం పార్టీలో చేరడం వైసీపీకి పెద్ద దెబ్బగా భావించవచ్చు. సీకే బాబు చిత్తూరు నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన బలమైన నేతలు. ఆయన టీడీపీ అభ్యర్థి గెలుపు బాధ్యతలు సైతం తీసుకొని పనిచేయడం వైసీపీకి మింగుడు పడని వ్యవహారం. నియోజకవర్గంలో 70 వేల వరకు ఉన్న బీసీల ఓట్లపై టీడీపీ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. అ తర్వాత కమ్మ, రెడ్డి సామాజకవర్గ ఓట్లు సమంగా ఉన్నాయి. ఈ రెండు వర్గాలు రెండు పార్టీలకు ఎక్కువగా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఎస్సీలు, ముస్లింలలో వైసీపీ పట్ల ఆధరణ కనిపించింది. మొత్తంగా పోలింగ్ సరళి తర్వాత వైసీపీలో గెలుపుపై ధీమా పెరిగింది. ఈసారి వైసీపీ అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు స్వల్ప మెజారిటీతోనైనా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
No comments:
Post a Comment