Breaking News

18/05/2019

కేకే... కు దారెటు...

హైద్రాబాద్, మే 18, (way2newstv.in)
కే.కేశవరావు.. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఓ వెలుగు వెలిగిన నేత. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరినా ఆయనకు ప్రాధాన్యత తగ్గలేదు. అధికారిక, అనధికారిక కార్యక్రమాలు, పర్యటనలు, యాత్రలన్నింటా ఆయనకు కేసీఆర్‌ తగిన ప్రియారిటీనిచ్చారు. ఆఖరుకు గత డిసెంబరులో జరిగిన ముందుస్తు ఎన్నికల సమయంలో కూడా ఆయనకు టీఆర్‌ఎస్‌ బాస్‌ పెద్ద పీటే వేశారు. ఏకంగా మ్యానిఫెస్టో కమిటీకి చైర్మెన్‌గా నియమించారు. ఇంతలా ప్రాధాన్యత సంపాదించుకున్న కేకే అకస్మాత్తుగా తెరమరుగయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలే కాదు.. పార్టీ ప్రోగ్రాముల్లో కూడా ఆయన ఎక్కడా కనపడకపోవటం గమనార్హం. గతంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ  సభ్యుడిగా ఉన్న కేకేకు జాతీయ స్థాయిలో అనేక పార్టీలతోనూ, వాటి నేతలతోనూ సంబంధాలు న్నాయి. ఈ కారణంతోనే ఆయన్ను కేసీఆర్‌ పార్టీలోకి తీసుకున్నారు. 


కేకే... కు దారెటు...

ఆయనకుగల పరిచయాలు తనకు అన్ని విధాలా ఉపయోగపడతాయని సీఎం భావించారు. అయితే రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ పక్ష నేతగా వ్యవహరిస్తున్న కేకేకు టీఆర్‌ఎస్‌లో ఇటీవల ప్రాధాన్యత తగ్గటమనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది. గతంలో రాష్ట్రానికి సంబం ధించిన అనేక అంశాలపై ప్రధాని వద్దకు ఆయన టీఆర్‌ఎస్‌ ప్రతినిధిగా వెళ్లారు. పలు విషయాలపై వినతిపత్రాలు సమర్పించారు. టీఆర్‌ఎస్‌ అధినేతగా కేసీఆర్‌... గతంలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయినప్పుడు కేకే ముఖ్యమంత్రి వెంటే ఉన్నారు. ఆ తర్వాత ఛత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రులు అజిత్‌జోగి హేమంత్‌ సోరెన్‌తో కేసీఆర్‌ సమావేశమయినప్పుడూ ఆయన పక్కనే ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, ఎస్పీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ హైదరాబాద్‌కు వచ్చినప్పుడూ కేకేతో కలిసే కేసీఆర్‌ ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఇలా అనేక ప్రాధాన్యతగల సమయాలు, సందర్భాల్లో గులాబీ దళపతి వెంటే ఉన్న కేకే... ఇప్పుడేమయ్యారనేది అంతుచిక్కని రహస్యంగా మారింది.ఇప్పుడు కేకే స్థానంలో ఎంపీ వినోద్‌కుమార్‌, రాజ్యసభ సభ్యుడు సంతోశ్‌కుమార్‌ వచ్చి చేరటం గమనార్హం. ఇటీవల ముఖ్యమంత్రి కేరళ, తమిళనాడు పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయన వెంట వినోద్‌, సంతోశ్‌ ఇద్దరూ ఉన్నారు. కేరళ సీఎం పినరయి విజయన్‌ను, డీఎమ్‌కే అధినేత స్టాలిన్‌నూ కలిసినప్పుడు వీరిద్దరూ ఆయా సమావేశాల్లోనూ పాల్గొన్నారు. వీరితోపాటు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా ఉండటం తెలిసిందే. ఇలా కేసీఆర్‌ పర్యటనలు, యాత్రల్లో కుటుంబ సభ్యుల ప్రాధాన్యత క్రమక్రమంగా పెరుగుతున్నది. ఇదే సమయంలో కేకేలాంటి సీనియర్లను, అనుభవమున్న వారినీ పక్కనబెడుతున్నారనే గుసగుసలు టీఆర్‌ఎస్‌లో వినబడుతున్నాయి.

No comments:

Post a Comment