Breaking News

01/05/2019

కర్షకులను కష్టాల పాలు చేస్తున్న యాసంగి

హైద్రాబాద్, మే 1, (way2newstv.in)
యాసంగి పంటలు ఉమ్మడి కామారెడ్డి జిల్లాలో కర్షకులను కష్టాల పాలు చేశాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు ఆశించిన స్థాయిలో దిగుబడులను అందించలేకపోయాయి. చేతికందిన అరకొర పంటను కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే, వారాలు గడిచినా డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈసారి కనీసం పంట సాగుకైన పెట్టుబడులను కూడా రాబట్టుకునే పరిస్థితి లేకుండాపోయిందని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. సీజన్ ఆరంభం నుండే రైతన్నను కష్టాలు చుట్టముట్టగా, ఇప్పటికీ అవి దూరం కాలేకపోతున్నాయి. అనుకున్న రీతిలో ధాన్యం సమకూరక, అమ్మినా పైకం చేతికి రాక అన్నదాతలు ఆగమాగం అవుతున్నారు. సాగునీటి సమస్యల కారణంగా పంటకు సరిపడా నీరు అందక పలుచోట్ల వేసిన పంటలు ఎండుముఖం పట్టాయి. కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు కోసం అధికారులు 205 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో ఇప్పటివరకు కేవలం 70వరకు మాత్రమే కేంద్రాలను ప్రారంభించగా, అందులో 45కేంద్రాల్లోనే ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. 


కర్షకులను కష్టాల పాలు చేస్తున్న యాసంగి

ఇప్పటివరకు జిల్లాలో 9వేలటన్నుల ధాన్యం మాత్రమే సేకరించినట్లు అధికారిక రికార్డులు తెలుపుతున్నాయి. ఈసారి ఎన్నో ఆశలతో సాగు చేసిన వరి పంట తమను ఆర్థికంగా ఆదుకుంటుందన్న నమ్మకంతో సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. కానీ ప్రకృతి వైపరీత్యాలు, సాగునీటి సమస్యల కారణంగా వరి పైరు రైతన్నలను ఆదుకోలేకపోయింది. ఎకరానికి 20వేల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టిన రైతులు, తమ కళ్లెదుటే ఎండిపోతున్న పంటలను చేష్టలుడిగి దీనవదనాలతో చూస్తుండిపోవాల్సి వచ్చింది. మరికొందరు రైతులు ఇరుగుపొరుగు రైతుల వద్ద బోర్లను అద్దెకు తీసుకుని, ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తూ ఎలాగోలా పంటను కాపాడుకోగలిగారు. ప్రధానంగా బోరుబావులను నమ్ముకుని వరి సాగు చేసిన రైతులు ఈసారి గోస పడాల్సి వచ్చిందనే చెప్పాలి. భూగర్భ జలాలు వేగంగా పడిపోవడంతో వందలాది వ్యవసాయ బోరుబావులు వట్టిపోయాయి. దీంతో పొట్ట దశలోనే వరి పైరు ఎండుముఖం పడుతూ రైతులను కలవరపాటుకు గురి చేసింది. ఎలాగోలా పంటను కాపాడుకోగలిగిన రైతులు చేతికచ్చిన ధాన్యాన్ని అమ్ముకుందామన్నా అధికారులు తక్షణమే పైకం ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. ముందుగా అధికారులు ధాన్యం అమ్మిన 48గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని హామీలు ఇచ్చారు. కానీ జిల్లాలో రైతులకు ఇప్పటి వరకు పైసా ఇవ్వని పరిస్థితి నెలకొంది. బాన్సువాడ డివిజన్‌లోని కోటగిరి, వర్ని, బీర్కూర్, నసురుల్లాబాద్, బాన్సువాడ, నిజాంసాగర్, పిట్లం ప్రాంతాలలో రైతులు వరి పంటకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈసారి రైతులు పెద్ద ఎత్తున వరిసాగుకు ముందుకు వచ్చి పంటలపై పెట్టుబడి పెట్టారు. పంట ఎదుగుతున్న దశలో సాగునీటిని అందించలేక నానా తంటాలు పడ్డారు. ఫలితంగా కొన్ని చోట్ల నీరందిన పంటలు ఆశాజనకంగా చేతికచ్చినప్పటికీ, చాలాచోట్ల నీరందక పంటలు ఎండుముఖం పట్టాయి. యాసంగి సాగు రైతులను కష్టాలకు గురిచేయడంతో అన్నదాతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే అమ్మిన పంటలకైనా తక్షణమే అధికారులు పైకం అందించేందుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

No comments:

Post a Comment