Breaking News

27/05/2019

రెండోసారి మోడీ


చాయ్ వాలా టూ చౌకీదార్
న్యూఢిల్లీ మే 27 (way2newstv.in)
అంతా ఏదో అనుకున్నారు. హంగ్ పార్లమెంటు అన్నారు. మోడీ డీలా పడిపోయారని అంచనాలు వేశారు. ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత కూడా పెదవి విరిచారు. మేనేజ్ చేశారని అనుమానించారు. కార్పొరేట్ శక్తుల ప్రమేయం దాగి ఉందేమోనని సందేహించారు. ప్రతిపక్ష ప్రాంతీయపార్టీలు యూపీఏ కూటమితో జట్టు కట్టకుండా నిరోధించడానికి బీజేపీ నాయకులే ఒక అస్త్రంగా దీనిని మీడియా ద్వారా ప్రయోగించారని అభియోగాలు మోపారు. అదంతా ఒట్టిదేనని తేలిపోయింది. సర్వే సంస్థల అంచనాలను మించి ప్రజామద్దతు లభించింది. దేశంలో సమ్మోహకనేతగా ముద్ర పడిన నరేంద్రమోడీ ద్విగుణీకృత శక్తిమంతుడయ్యాడు. తిరుగులేని నాయకునిగా మరో అయిదేళ్లపాటు దేశాన్ని పాలించమని ప్రజలు ఆశీర్వదించారు.తాను సామాన్యుడిని అంటూ చాయ్ వాలాగా జాతీయ రాజకీయ యవనికపై చర్చ మొదలుపెట్టిన మోడీ..క్రమక్రమంగా పాలిటిక్స్ పై పట్టు సాధించారు. మధ్యతరగతిలో ఆశలు రేకెత్తించారు. యువతలో ఉత్తేజాన్ని నింపారు. మనవాడనే భావన ప్రజ్వలింపచేశారు. వారసత్వకిరీటాలు లేవు. వంశ సంప్రదాయ భుజకీర్తులు లేవు. అవే అతనికి కలిసొచ్చాయి. 


రెండోసారి మోడీ

సామాన్యుడు ప్రధాని అవుతున్నాడనే బలమైన విశ్వాసం గతంలో ఎన్నడూ లేని మద్దతును సమీకరించి పెట్టింది. పడని మీడియాతో గిల్లికజ్జాలు, పేచీలు, పెడార్థాలు వెరసి దుష్ప్రచారమే చేసినా వాటిని ప్రజలెవరూ పెద్దగా పట్టించుకోలేదు. టైమింగ్ తెలిసిన నాయకుడు కావడంతో తనను తాను తీర్చిదిద్దుకోవడంలోనూ , ప్రత్యర్థుల పని పట్టడంలోనూ చాణక్యాన్నే కనబరిచాడు మోడీ. విదేశీ దౌత్యం…అత్యధిక పర్యటనలు చేసిన ప్రధానిగా రికార్డు. పాక్ తో ఎప్పటికప్పుడు రక్షణ దోబూచులు…అవునన్నా కాదన్నా అంతర్జాతీయంగా భారత్ ..ఈ అయిదేళ్లలో విజయపథాన్నే నడిచింది. ఇదంతా నియో మిడిల్ క్లాస్, మేధోవర్గాల్లో ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ చేసింది. మోడీ కి వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేసింది. చాయ్ వాలా నుంచి చౌకీదార్ గా సామాన్యుడి నుంచి సంరక్షకుడిగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. ఏడాది క్రితం ఓటమి చవిచూసిన రాష్ట్రాల్లోనూ విజయకేతనం ఎగరవేశారు. పార్టీనంతటినీ ఏకోన్ముఖంగా నడపటంలో ఈ చౌకీదార్ జాదూ చేశాడు. బంగారం ఆభరణంగా మారాలంటే కొలిమిలో కరగబెట్టాలి. సుత్తి దెబ్బలకు తట్టుకోవాలి. అప్పుడే అలంకారంగా ఆక్రుతి దాల్చగలుగుతుంది. ఎన్నెన్నో విమర్శలు, ఎగుడుదిగుళ్లతో తీవ్ర సంక్షోభాలను చవిచూసిన నరేంద్రమోడీ …తన పాలనతో భారత్ కీర్తికిరీటంలో మేలిమి ఆభరణంగా రాణిస్తాడనే ఆశించవచ్చు.సునామీ అలాగే చుట్టుముడుతుంది. ప్రభం’జనం‘ అంతటి ఉద్ధృతంగా వీస్తుంది. దేశంలో, రాష్ట్రంలో ఇప్పుడు జరిగిందదే. ఒక్కడికి వ్యతిరేకంగా వందమంది జట్టు కట్టాలని చూశారు. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కనపెట్టేశారు. వ్యక్తిగతవైరం పూనారు. ఓడించాలని చూశారు. ఎందుకనే ప్రశ్నకు ఎక్కడా సరైన సమాధానం ఇవ్వలేదు. ప్రత్యామ్నాయం ఎవ్వరనే సందేహానికి జవాబూ దొరకలేదు. అందరికీ అందలమెక్కాలనే ఉంటుంది. తమలో ఒక్కడిని ఎంపిక చేసుకోవడానికే తీరిక దొరకలేదు. కూటమి కట్టాలనుకున్నారు. కూడి రావడానికి స్వార్థం అడ్డొచ్చేసింది. ఆధిపత్యం, అహం అడ్డుగోడలై నిలిచాయి. అదే సమయంలో అటువైపు చూస్తే అతనొక్కడై నిలిచాడు. అంతర్గతంగానూ, బహిరంగంగానూ సవాల్ స్వీకరించడానికి సిద్ధమయ్యాడు. స్థితప్రజ్ణత కనబరిచాడు. ప్రజామద్దతుతో సునామీనే సృష్టించాడు. చీలికలుపీలికలుగా ఉన్న పార్టీల నేతల బలహీనతను పక్కాగా తుత్తునియలు చేయగలిగాడు. అతడు నమో ..నరేంద్ర దామోదర్ దాస్ మోడి. ఇనుపనరాల, ఉక్కు కండరాల యువభారత్ కు రానున్న అయిదేళ్ల దశాదిశా నిర్దేశకుడు. మార్గదర్శకుడు. 130 కోట్ల ప్రజానీకంతో అలరారే భారతావనికి తిరుగులేని ప్రధాని.సంకీర్ణాల శకం  మొదలైన తర్వాత భారత్ అనేక ఒడిదుడుకులకు గురవుతూ నిర్ణయాత్మకశక్తిగా తన పాత్రను కోల్పోతూ వచ్చింది. ఇంటాబయటా సమస్యలు. ఇరుగుపొరుగుకు లోకువ. అస్థిరత, అయోమయం..భవిష్యత్తుపై భయాందోళనలు..అటువంటి అనిశ్చితికి, ఊగిసలాటకు, సంశయాలకు, సందేహాలకు, బెదిరింపులకు, ప్రలోభాలకు, రాజకీయ బ్లాక్ మెయిలింగులకు చరమగీతం పాడుతూ  2014లో భారతీయజనతాపార్టీ పార్లమెంటులో ప్రజాధిక్యపార్టీగా ఆవిర్భవించింది. ఆ విజయంలో నరేంద్రమోడీ జనసమ్మోహకశక్తి ప్రధానపాత్ర పోషించింది. కరిష్మాటిక్ లీడర్ గా, క్రౌడ్ పుల్లర్ గా, పోస్టర్  బోయ్ గా అసేతు హిమాచలాన్ని ఆవహించాడు. అప్రతిహతవిజయం నమోదు చేశాడు. అది తాత్కాలికమన్నారు. అయిదేళ్లతో ముగిసిపోతుందనుకున్నారు. వచ్చినవాడు ఫల్గుణుడు అన్నట్టుగా 
విజ్రుంభించాడు. ఇంతింతై వటుడింతై నభోవీధిపైనంతై అన్నట్లుగా శిఖరసదృశంగా ఎదిగిపోయాడు. సామదానభేదోపాయాలతో కిందకు దించాలని ప్రతిపక్ష నేతలు ప్రయాసపడ్డారు. కానీ అప్పగించిన  కర్తవ్యం ముగియలేదని అఖండ భారత్ మరోసారి ఆశీర్వదించింది. తాజా విజయంతో దీవించింది. నరేంద్రుని మళ్లీ అక్కున చేర్చుకుంది. అధినేతగా పాలించమని పట్టం గట్టింది. నియంత్రుత్వం, నిరంకుశత్వం,నిప్పులా విరుచుకుపడే తత్వం వంటి ఆరోపణలెన్నైనా ఉండవచ్చు. విపక్షాలకు నిలువనీడ లేకుండా కమల బావుటాతో కబళించి వేస్తున్నాడనే విమర్శలూ ఉండవచ్చు. కానీ నిజాయతీ,నిబద్ధత, నిలువెత్తు దేశభక్తి విషయంలో మోడీని మించిన మొనగాడు కనిపించడు. ఈ విషయంలో మొహమాటానికి కూడా పోడు. ఆ చిత్తశుద్దే అతనిని ఎవరికీ అందనంత ఎత్తున నిలబెట్టింది…

No comments:

Post a Comment