Breaking News

21/05/2019

మాగంటి వర్సెస్ కోటగిరి


ఏలూరు, మే 21, (way2newstv.in)
పశ్చిమ, కృష్ణా జిల్లాల పరిధిలో ఉన్న ఏలూరు లోక్‌స‌భ నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగరనుంది? ఈ ఎన్నికల్లో ఓటరు మరోసారి సీనియర్ నేత మాగంటి బాబును మహారాజును చేస్తారా ? లేదా యువనేత కోటగిరి శ్రీధర్‌కు యువరాజుగా పట్టం కడ‌తారా ? అన్నది ఆసక్తిగా ఉంది. ఇక్కడ నుంచి మాగంటి బాబు గెలిస్తే అది సాధారణ విషయమే అవుతుంది. అదే వైసీపీ నుంచి పోటీ చేసిన కోటగిరి శ్రీధర్ విజయం సాధిస్తే అది ఎన్నో సంచలనాలకు, రికార్డులకు వేదికగా ఓ చరిత్రలో నిలిచిపోతుంది. 1996 నుంచి 2004 మినహా అన్ని ఎన్నికల్లోనూ మాగంటి బాబు ఏలూరు ఎంపీగా పోటీ చేస్తూ వస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాగంటి గత మూడు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. కోటగిరితో పోలిస్తే మాగంటి రాజకీయంగా చాలా సీనియర్. ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ఎన్నో పదవులు చేపట్టారు. ఇటు కోటగిరి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ పోరులో కోటగిరి గెలిస్తే 57 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రను తిరగరాసిన వ్యక్తిగా ఏపీ రాజకీయాల్లో నిలుస్తారు. 



మాగంటి వర్సెస్ కోటగిరి

ఏలూరు ఎంపీగా ఆరు దశాబ్దాలుగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే గెలుస్తున్నారు. ఇప్పుడు కోటగిరి విజయం సాధిస్తే తొలిసారి ఇక్కడ నాన్ కమ్మ వర్గానికి చెందిన వ్యక్తి విజయం సాధించినట్లు అవుతుంది. పోలింగ్ ముగిశాక ఈ ఇద్దరు ఎవరికి వారే గెలుపు తమదేనని లెక్కలు వేసుకుంటున్నారు. ఇక జనసేన నుంచి పోటీ చేసిన ప్రముఖ ఆర్థికవేత్త పెంటపాటి పుల్లారావు ఎన్నికల్లో నామ మాత్రపు పోటీ ఇచ్చారు. పుల్లారావు గతంలో కూడా ఎన్టీఆర్ టీడీపీ నుంచి ఏలూరు ఎంపీగా పోటీ చేశారు. ఇక సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబు విషయానికి వస్తే కనిష్టంగా 50 వేల నుంచి గరిష్టంగా 75 వేల ఓట్ల మెజార్టీతో మరోసారి విజయం సాధించ‌ బోతున్నానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. లోక్‌స‌భ నియోజకవర్గం పరిధిలో ఉన్న రెండు అసెంబ్లీ సీట్ల మినహా మిగిలిన అన్ని సీట్లను టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థులే విజయం సాధించబోతున్నారని ఆయన చెబుతున్నారు. రెండు అసెంబ్లీ సీట్ల గెలుపు ఓటముల విషయంలో మాత్రమే కాస్త సందేహంగా ఉన్న మాగంటి బాబు తన లోక్‌స‌భ పరిధిలో ఐదు అసెంబ్లీ సీట్ల తో పాటు తాను గెలవటం ఖాయమని చెబుతున్నారు. ఇక కోటగిరి శ్రీధర్ గెలుపు విషయంలో పూర్తి ధీమాతో ఉన్నారు. ఇప్పటికే తన అనుచరులకు 50 నుంచి 60 వేల ఓట్ల మెజార్టీతో తన గెలుపు ఖాయమని చెప్పేస్తున్నారు. అదే టైంలో శ్రీధర్ గెలుపుపై రూపాయికి రెండు రూపాయలు ఇచ్చి మరి వైసిపి వర్గాలు బెట్టింగ్‌ల‌కు దిగుతున్నాయి. ఏలూరు ఎంపీగా తాను గెలిచి రికార్డు సృష్టించబోతున్నాన‌ని శ్రీధర్ ఇప్పటికే తనకు కావాల్సిన ముఖ్య అంతరంగిక వద్ద చెప్పినట్టు కూడా తెలుస్తోంది.లోక్‌స‌భ నియోజకవర్గ పరిధిలోని ఒక అసెంబ్లీ సెగ్మెంట్ మినహా మిగిలిన అన్ని సెగ్మెంట్లతో పాటు ఎంపీగా తాను విజయం సాధిస్తామన్న ధీమాతో శ్రీధర్ ఉన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే ఆ ఏడో సెగ్మెంట్‌ కూడా వైసిపి ఖాతాలోనే పడుతుందని వైసీపీ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఇక జనసేన అభ్యర్థి పెంటపాటి పుల్లారావుకు గెలుపుపై ఎలాంటి అసలు లేకపోయినా ఆయన సాధించిన ఓట్లు ప్రధాన పార్టీల్లో ఎవరి విజయావకాశాలపై ప్రభావం చూపుతాయి అన్నది ఒక్కటే ఫలితాల్లో తేలనుంది. ఏదేమైనా ఏలూరు ఎంపీగా మాగంటి బాబు గెలిచి మహారాజు అవుతారా లేదా ? కోటగిరి శ్రీధర్ రికార్డులు బద్దలు కొడుతూ యువరాజుగా పట్టాభిషిక్తం అవుతారో ? 23న తేలిపోనుంది.

No comments:

Post a Comment