Breaking News

01/05/2019

ఉత్తమ్, మల్లు కు ముసళ్ల పండుగే

హైద్రాబాద్, మే 1,  (way2newstv.in)
తెలంగాణ కాంగ్రెస్ కు వేరే దారిలేదా..? ఉన్న సభ్యులను కాపాడుకోవడం మించి మరో మార్గం లేదా? ఉన్నవారిలో ఉండేదెవరు? వెళ్లేదెవరు? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో ఇద్దరు నుంచి ముగ్గురిపై కన్నేశారని తెలియడంతో హస్తం పార్టీ అగ్రనేతలు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. అసలు ఎవరు ఉంటారో తెలియని పరిస్థితి కాంగ్రెస్ లో ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీ వైపు వెళ్లిపోయారు. కొందరు నేరుగా గులాబీ కండువా కప్పుకోగా, మరికొందరు కేసీఆర్ కు మద్దతు ప్రకటించారు.ఇప్పుడు మిగిలిన సభ్యులు ఎనిమిది మంది మాత్రమే. మరో ముగ్గురిని కలుపుకుని తెలంగాణ కాంగ్రెస్ ను తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేయాలన్నది గులాబీ బాస్ ప్లాన్ గా ఉంది. అదే జరిగితే ఇక అసెంబ్లీలో విపక్షం ఉండదు.


ఉత్తమ్, మల్లు కు ముసళ్ల పండుగే

అందుకే ముందుగా కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ ఆలీలు నిజామాబాద్ జిల్లాలో ఉన్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్న ఈ ప్రక్రియను ఆపాలని కోరారు. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్ ను కూడా కలసి పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలనికోరారు. కానీ స్పీకర్, గవర్నర్ నుంచి వచ్చిన స్పందన చూసిన తర్వాత కాంగ్రెస్ నేతలకు తమకు న్యాయం జరగదన్న విషయం బోధపడినట్లుంది.అందుకే మిగిలిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది. వారితో విడివిడిగా సమావేశమై వారి వ్యక్తి గత సమస్యల తో పాటు నియోజకవర్గ సమస్యలను కూడా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు ఏమాత్రం జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్కలు రోజూ ఎనిమిది మందితో మాట్లాడే విధంగా ప్లాన్ చేసుకున్నారు. పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేయాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.అయితే లోక్ సభ ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ దొరకదని తెలిసి మే 20వ తేదీన ఢిల్లీ టూర్ ప్లాన్ చేసుకుంటున్నారు. అన్ని వ్యవస్థలను కలిసి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడటంపై ఫిర్యాదు చేయనున్నారు. తొలుత రాష్ట్రపతిని కలవనున్నారు. తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకోవాలంటే జాతీయ స్థాయిలో ఉద్యమం చేయడమే మేలన్న నిర్ణయానికి వచ్చారు. అప్పుడే కేసీఆర్ దూకుడుకు అడ్డుకట్ట వేయగలమని అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

No comments:

Post a Comment