Breaking News

02/05/2019

ధాన్యం రైతు దైన్యం (కరీంనగర్)

కరీంనగర్, మే 2 (way2newstv.in): 
పంట పండించడం ఒక ఎత్తయితే.. వచ్చిన దిగుబడిని విక్రయించడం రైతులకు కత్తిమీద సాములా మారుతోంది. ఇక మగ వడ్లు సాగు చేసిన అన్నదాతలు కల్లాల్లో ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఆడ, మగ వరి సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడ పండించిన ధాన్యం ఆరేళ్లయినా మొలకెత్తే స్వభావం కలిగి ఉంటుంది. హైబ్రీడ్‌ వరిని 32 ఏళ్లుగా ఇక్కడి రైతులు సాగు చేస్తున్నారు. గత ఏడాది మగ వడ్లను ప్రభుత్వ రంగసంస్థలు కొనుగోలు చేయకపోవడంతో ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురించగా.. అప్పటి పౌరసరఫరాల శాఖ మంత్రి.. ప్రస్తుత వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెంటనే స్పందించి మగ వడ్లను కొనుగోలు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను ఆదేశించారు.


ధాన్యం రైతు దైన్యం (కరీంనగర్)

అప్పుడు కొనుగోలు చేసిన సంస్థలు మళ్లీ ఈ రబీలో ముఖం చాటేశాయి. కేంద్రాలకు తరలించిన మగ ధాన్యం   కొనుగోలుకు తిరస్కరిస్తున్నారు. దీంతో రైతులు మగ వడ్లను అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర గ్రేడ్‌–ఏకు క్వింటాల్‌కు రూ.1770, కామన్‌ రకం రూ.1750 ఉండగా మిల్లర్లు మగ వడ్లను రూ.1200కే అతికష్టం మీద కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు నిలువుదోపిడీకి గురవుతున్నారు.మగ(హైబ్రీడ్‌) ధాన్యం గింజ పొట్టిగా ఉంటుందనే సాకుతో కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని తిరిగి పంపిస్తున్నారు. కనీసం గ్రేడ్‌ బీ(కామన్‌రకం) కింద కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వ రంగసంస్థలు చేతులెత్తేశాయి. మగ ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా అధికారులకు రైతులు విన్నవించినా ఫలితం లేకుండా పోతోంది. గ్రామాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయి విక్రయించడం సవాల్‌గా మారింది. కొందరు రైతులు గత్యతంరం లేక మిల్లర్లకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా మిల్లర్లు రైతులను దోపిడీకి గురి చేస్తున్నారు. ఆడ వడ్లను విత్తన కంపెనీలు కొనుగోలు చేస్తాయి. వీటికి మాత్రమే అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ ఉంటుంది. మగ ధాన్యాన్ని రైతులే మార్కెట్లో అమ్ముకోవాలి. రైతులతో కంపెనీలు ముందస్తుగా అలా ఒప్పందం చేసుకుంటున్నాయి. మార్కెట్లో మగ ధాన్యానికి డిమాండ్‌ లేకపోవడంతోపాటు కనీసం కొనేవారు లేక నానా తంటాలు పడుతున్నారు.ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 45వేల ఎకరాలలో హైబ్రీడ్‌ వరి సాగులోకి వచ్చింది. ఇందులో 8వేల ఎకరాలు ఎండిపోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1.75 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. ఇందులో 40 నుంచి 50 వేల క్వింటాళ్లు మగ ధాన్యం పండినట్లు సమాచారం. ప్రస్తుతం వరి కోతలు 60శాతం పూర్తయ్యాయి. హైబ్రీడ్‌ వరి సాగులో రాష్ట్రంలోనే కరీంనగర్‌ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఈసారి ఎకరాకు 6నుంచి 9క్వింటాల దిగుబడి వస్తుందని అంచనా. ఆడ వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.5 వేల నుంచి రూ.8వేల వరకు కంపెనీలు ధర చెల్లిస్తున్నాయి. ఎకరాకు రూ.38వేల వరకు పెట్టుబడి పెట్టామని, మగ ధాన్యం కొనుగోలు చేస్తేనే కష్టాల నుంచి గట్టేక్కుతామని రైతులు అంటున్నారు.ప్రభుత్వ రంగ సంస్థలు మగ ధాన్యం కొనుగోలు చేయడంలో చేతులెత్తేసింది. గ్రేడ్‌ ఏ రకం కింద 1010ధాన్యం, కామన్‌ రకం కింద మరి కొన్ని రకాల వడ్లను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మగ ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాలేదని కేంద్రాల నిర్వాహకులు తెలిపారు. కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందనే ఆశతో కొందరు రైతులు కళ్లాల వద్ద రాశులు పోసి వేచి చూస్తున్నారు. మగ ధాన్యం మిల్లర్ల పాలవుతోంది. రైతులకు తక్కువ ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారు. ఈ నెలలో వివాహ శుభకార్యాలు ఉండడంతో ఖర్చుల కోసం రైతులు గత్యంతరం లేక మిల్లర్లకే విక్రయిస్తున్న సంఘటనలు ఉన్నాయి. క్వింటాల్‌కు ప్రభుత్వ మద్దతు ధర రూ.1770 ఉండగా మిల్లర్లు రూ.1200లోపే చెల్లిస్తున్నారు. తరుగు, తేమ పేరుతో మరింత కోత విధిస్తున్నారు. జిల్లా మంత్రి ఈటల రాజేందర్‌ చొరవ తీసుకొని మగ ధాన్యం ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

No comments:

Post a Comment