Breaking News

16/05/2019

అల్లాడుతున్న జీవాలు (మహబూబ్ నగర్)

మహబూబ్‌నగర్‌, మే16  (way2newstv.in) : 
కరువుజిల్లాలో పశువులు రోదిస్తున్నాయి. పచ్చగడ్డిని అటుంచితే మండుతున్న ఎండలకు ఎండిన గడ్డికూడా దొరక్క అల్లాడుతున్నాయి. ఆకలితో అలమటిస్తున్న జీవాలు కడుపు నింపుకోవడానికి కంటికి కనిపించినవన్నీ తింటున్నాయి. రోడ్లపై చెత్తబుట్టల్లో పడేసిన పాలిథిన్‌ కవర్లు తిని ఆకలి తీర్చుకుంటున్నాయి. అవి జీర్ణంకాక చివరకు తనువు చాలిస్తున్నాయి.  ఆకలితో పశువులను చంపుకోవడం ఇష్టం లేక చాలా చోట్ల యజమానులుజీవాలను కబేళాలకు తరలిస్తున్నారు. క్షేత్రస్ధాయిలో మూగజీవాలకు పశుగ్రాసం అందుబాటులో ఉంచాల్సిన అధికారులు దానిపై దృష్టిసారించక పోవడంతో ఈ పరిస్థితి నెలకొందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.జిల్లాలో 2,45,043 దావులు, 1,34,259 గేదెలు, 17,83,759 గొర్రెలు, 2,43,819 మేకలు ఉన్నాయి. అయితే వీటికి అవసరమైన మోతాదులో పశుగ్రాసాన్ని సమకూర్చడంలో అ«ధికారులు విఫలమయ్యారు. పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేయడం కోసం 2018–19 సంవత్సరానికి గాను 390 మెట్రిక్‌ టన్నుల పశుగ్రాస విత్తనాలు (పీసీ23 జొన్న రకం) 75 శాతం సబ్సిడీపై పశుసంవర్థశాఖ అ«ధికారులు సుమారు 72వేల మంది రైతులకు పంపిణీ చేశారు. 


అల్లాడుతున్న జీవాలు (మహబూబ్ నగర్)

గడ్డి విత్తనాలను పంపిణీ చేసినా సాగు చేసునేందుకు తగినంత సాగునీరు లభించక పోవడంతో పశుగ్రాసం ఉత్పత్తి చేయలేకపోయారు. వీటిలో రెండున్నర మెట్రిక్‌ టన్నుకు మించి పశుగ్రాసం ఉత్పత్తి కాలేదు. దీంతో కొందరు పాడి రైతులు మేతను బయట కొనుగోలు చేసి పశువులకు అందిస్తున్నారు.ఈ క్రమంలో ఒక్కో ట్రాక్టర్‌కు రూ.10వేల పైనే వెచ్చిస్తున్నారు. ఇక అంత ఆర్థిక స్థోమత లేని కొందరు రైతులు ఆకలితో అలమటిస్తున్న పశువులను కబేళాలకు తరలిస్తున్నారు. ప్రత్నామ్యాయ మార్గాలు ద్వారానైనా పశుగ్రాసాన్ని సమకూర్చి పశుసంపదను కాపాడవల్సిన సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు. తమ ముందే పశువులు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యంకావడం లేదు. అందువల్ల గతంలో మాదిరిగా లభ్యత గల ప్రాంతాల్లో పశుగ్రాసాన్ని కొనుగోలు చేసి జిల్లాలో పశువులకు అవసరమైన మేర సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో ఉన్న పశువులకు మొత్తం 6.57 లక్షల మెట్రిక్‌ టన్నుల మేత అవసరం ఉంది. ఇందులో ప్రస్తుతం 5.65 లక్షల మెట్రిక్‌ టన్నుల మేత లభ్యత ఉందనీ  92వేల మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసం కొరత ఉన్నట్లు పశుసంవర్థకశాఖ అధికారులే చెబుతున్నారు. అనధికారింకంగా పశుగ్రాసం కొరతగా ఇంకా ఎక్కువే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో అవసరం మేరకు పశుగ్రాసం అందుబాటులో ఉండేలా అధికారులు 75శాతం సబ్సిడీపై పీసీ23 జొన్నరకం గడ్డి విత్తనాలను 390 మెట్రిక్‌ టన్నులు రైతులకు పంపిణీ చేశారు. దీంతో పాటు పశుగ్రాసం వృథాను అరికట్టేందుకు 325 మంది రైతులకు 50 శాతం సబ్సిడీపై గడ్డి కత్తరించే యంత్రాలనూ ఇచ్చారు. కానీ ఎండలకు పశుగ్రాసం ఎదగక మేత అందని పరిస్థితి నెలకొంది.


No comments:

Post a Comment