Breaking News

17/05/2019

చంద్రబాబుతో పొసగని లోకల్ కాంగ్రెస్

అనంతపురం, మే 17, (way2newstv.in)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో జత కడుతున్నా రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ నేతలు చంద్రబాబును అంగీకరించడం లేదు. చంద్రబాబును అవకాశవాద రాజకీయ నేతగా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు కూటమి ఏర్పాటులో బిజీగా ఉన్నారు. రాహుల్ గాంధీతో ఢిల్లీ వెళ్లినప్పుడల్లా చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ కు ఫలితాలకు ముందే అవసరమైన కూటమిని ఏర్పాటు చేయాలన్న తలంపుతో చంద్రబాబు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ నేతలు మాత్రం చంద్రబాబునాయుడిని నమ్మడం లేదు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అని, ఏక్షణమైనా మళ్లీ రంగులు మార్చేస్తారని వీరంటున్నారు. ముఖ్యంగా సీనియర్ కాంగ్రెస్ నేతలు మాత్రం చంద్రబాబు పోకడలను సహించడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ తో పార్టీ తో పొత్తు పెట్టుకున్నారన్న కారణంగానే కాంగ్రెస్ సీనియర్ నేతలు రాజీనామా చేసి వెళ్లిపోయారు. 


చంద్రబాబుతో పొసగని లోకల్ కాంగ్రెస్

వట్టి వసంతకుమార్ సయితం ఇదేరకమైన ఆరోపణ చేసి పార్టీకి గుడ్ బై చెప్పారు.ఇక రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పోలవరం విషయంలో చంద్రబాబునాయుడికి ఊపిరి ఆడనివ్వడం లేదు. ఆయన లేఖల మీద లేఖలు రాస్తున్నారు. పోలవరంలో చంద్రబాబు అనుసరించిన వైఖరిని కేవీపీ తప్పుపడుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు బీజం వేస్తే తానే అంతా చేశానని చంద్రబాబు చేసినట్లు చెప్పుకోవడాన్ని కేవీపీ సహించలేక కాంగ్రెస్ తో స్నేహంగా ఉంటున్న చంద్రబాబును ఏమాత్రం ఖాతరు చేయడం లేదుతాజాగా తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ కూడా చంద్రబాబుపై ఫైరయ్యారు. ఆయన పచ్చి అవకాశవాది అని చింతామోహన్ ధ్వజమెత్తారు. ప్రధానంగా చింతామోహన్ టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై ఆయన గవర్నర్ నరసింహన్ కు లేఖ రాశారు. టీటీడీ బంగారం తరలింపు వ్యవహారాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. తక్షణమే టీటీడీలో ఆడిట్ అధికారులను నియమించాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు. టీటీడీ తక్షణం స్పందించకపోతే తాను ఈ నెల 23వ తేదీ తర్వాత ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఇలా కాంగ్రెస్ నేతలే చంద్రబాబుకు రాష్ట్రంలో శత్రువులుగా మారారు. దీనిపై చంద్రబాబు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. కాంగ్రెస్ నేతలను కట్టడి చేయాలని, లేకుంటే ప్రత్యర్థి పార్టీలకు అవకాశమిచ్చినట్లవుతుందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు.

No comments:

Post a Comment