Breaking News

21/05/2019

పవన్ ఎన్నికల ఖర్చు 8 లక్షలేనా...


విశాఖపట్టణం,  మే 21, (way2newstv.in)
రాజకీయ నాయకుడన్నాక చాలా నేర్చుకోవాలి. లేకపోతే అక్కడే మనలేరు. హామీలు గుప్పించాలి. అన్నీ చేస్తామనాలి. ఇక ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూపించాలి. విశాఖ జిల్లాలో ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోరు జరిగింది. అలాగే ఎంతో మంది అభ్యర్ధులు తాము ప్రజాసేవ చేద్దామని ఉత్సాహంగా ఉరకలు వేశారు. మరి అంత నిజాయతీ వారి నుంచి జనం చూశారా అంటే ఉత్తి మాటేనని తేలిపోయింది. ఎవరో ఇండిపెండెంట్ అభ్యర్ధులు తప్ప ప్రధాన పార్టీలకు చెందిన వారంతా చెప్పినవి శ్రీరంగ నీతులన్న మాట బాహాటంగా తెలిసిపోయింది. లేకపోతే విశాఖ లాంటి కాస్మోపాలిటిన్ సిటీలో ఎన్నికల ప్రచారం చేసిన ఏ అభ్యర్ధి ఎన్నికల ఖర్చు ఇరవై లక్షలకు మించలేదట. ఇంతకన్నా పచ్చి అబద్దం ఉంటుందా అని అధికారులే కాదు ప్రజలే ముక్కున వేలు వేసుకుంటున్నారు.ఆయన టాప్ సినిమా స్టార్. పైగా ఓ పార్టీకి చెందిన అధినాయకుడు. విశాఖ అర్బన్ జిల్లా గాజువాక నుంచి పవన్ అసెంబ్లీకి పోటీ చేశారు. మరి పవన్ ఎన్నికలకు పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా అక్షరాలా 8 లక్షల 39 వేల 799 రూపాయలు మాత్రమేనట. రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజకవర్గాల్లో రెండవది గాజువాక. పవన్ ఎన్నికల ఖర్చు 8 లక్షలేనా...

మరి అంతటి పెద్ద సీట్లో పోటీ పడిన జనసేనాని చాలా తక్కువ ఖర్చు చేశానని ఎన్నికల అధికారులకు అందించిన నివేదికలో పేర్కొన్నారు. అదే విధంగా విశాఖ రాజకీయాల్లో చక్రం తిప్పే మంత్రి గారు గంటా శ్రీనివాసరావు. ఆయన విశాఖ ఉత్తరం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తే అయిన ఖర్చు 16 లక్షల 42 వేల 284 రూపాయలు మాత్రమేనట. మరి గంటా అనేక ర్యాలీలు నిర్వహించారు. దాదాపు పదిహేను రోజుల పాటు ఆయన పార్టీ కార్యకర్తలు వీధుల్లో తిరిగారు. ప్రతీ రోజూ ఓ పెళ్ళి సందడిగా ఆయన ఎన్నికల ఆఫీస్ కనిపించేది. మరీ ఇంత తక్కువ ఖర్చు చూపిస్తే షాక్ తినడం ఎన్నికల అధికారుల వంతు అయింది.విశాఖ జిల్లాలో అసెంబ్లీ అభ్యర్ధుల్లో ఎక్కువ ఖర్చు పెట్టి రికార్డ్ సృష్టించిన ఘనతను అనకాపల్లికి చెందిన టీడీపీ అభ్యర్ధి పీలా గోవింద సత్యనారాయణ కొట్టేశారు. మంత్రిని మించిపోయి చేసిన ఆయన ఖర్చు 17 లక్షల 97 వేల 243 రూపాయలట. ఇక అతి తక్కువగా ఖర్చు చేసింది విశాఖ ఉత్తరం నుంచి జనసేన తరఫున పోటీ చేసిన ఉషాకిరణ్. ఆమె ఎన్నికల ఖర్చు 57 వేల 950 రూపాయలుట. ఇక మంత్రి గారి మీద పోటీ పడిన వైసీపీ అభ్యర్ధి కేకే రాజు చేసిన ఖర్చు 2 లక్షల రూపాయలు మాత్రమే. భీమిలీ నుంచి తొడకొట్టి మరీ వైసీపీ నుంచి పోటీ చేసిన అవంతి శ్రీనివాసరావు పెట్టిన ఖర్చు 12 లక్షల 88 వేల రూపాయలు మాత్రమేనట. నిజానికి ఈ లెక్కలు చూసినపుడు అధికారులకు బుర్ర తిరిగిపోయిందని అంటున్నారు.ఇపుడున్న పరిస్థితుల్లో ఓ ధనవంతుని ఇంట్లో ఒక రోజు పెళ్ళికే 8 నుంచి పదిలక్షల ఖర్చు అవుతోంది. అలాంటిది మొత్తం పదిహేను రోజుల ప్రచారం, ప్రతీ రోజూ పెళ్ళి మాదిరిగా విచ్చలవిడిగా ఖర్చు చేశారు. జనాలకు మందు, బిర్యాని సప్లై చేశారు. ఎన్నికల సంధర్భంగా డబ్బులు తీసి పంచారు. ఇవన్నీ కూడా కలిపినా ఎవరిదీ ఇరవై లక్షలు మించకపోవడం విశేషం. ఇలాగైతే సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అవకాశం ఉంటుందేమో. కానీ ఇది నిజం కాదన్నది అందరికీ తెలుసు. అదే అసలైన విషాదం.

No comments:

Post a Comment