Breaking News

08/04/2019

ఏపీలో టీడీపీ బదిలీ రాజకీయం

విజయవాడ, ఏప్రిల్ 8(way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్రపునేత పై వేటు వేయడాన్ని తెలుగుదేశం పార్టీ తనకు అనుకూలంగా మలచుకోనుందా? వరసగా అధికారులను ఎన్నికల కమిషన్ బదిలీ చేస్తుండటంతో కక్ష సాధింపు చర్యలని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లదలచుకుందా? అంటే అవుననే అంటున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవల ఇంటలిజన్స్ అడిషనల్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు కడప, శ్రీకాకుళం ఎస్పీలను తప్పించారు.చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్రపునేత ను తప్పించి ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ కేవలం ఆంధ్రప్రదేశ్ పైనే కక్ష కట్టిందని చంద్రబాబు నాయుడు విస్తృత ప్రచారం చేయనున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయకుండా అడ్డుకునేందుకే అధికారులను వరసగా బదిలీలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సమయంలో బదిలీ చేయడం అరుదైన విషయమే. 


ఏపీలో టీడీపీ  బదిలీ రాజకీయం

అయితే వచ్చిన ఆరోపణల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీలు చేయడం సర్వ సాధారణమే.ఇక్కడ అనిల్ చంద్ర పునేట పాలకుల ఒత్తిడికి తలొగ్గారని కేంద్ర ఎన్నికల కమిషన్ భావించింది. ఏబీ వెంకటేశ్వరరావును ఎన్నికల కమిషన్ బదిలీ చేస్తే దానిని నిలుపుదల చేస్తూ చీఫ్ సెక్రటరీ జీవో ఇచ్చారు. దీనిని కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడాన్ని కూడా తప్పుపట్టింది. దీనిపై ఆయన నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ వివరణ తీసుకున్న తర్వాతనే వేటు వేశారన్నది ఢిల్లీ వర్గాల సమచారం.
ఐటీ, ఈడీ దాడులు తమ పార్టీ నేతలపై చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. నిన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దీక్షకు దిగారు. అయితే సాయంత్రానికి చీఫ్ సెక్రటరీని బదిలీ చేయడంతో తనను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తారని చంద్రబాబు ప్రజల ముందుకు వెళుతున్నారు. తనపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని, జైలుకు వెళ్లేందుకైనా సిద్దమని చంద్రబాబు ప్రకటించారు. మొత్తం మీద అధికారుల వరస బదిలీలను తనకు అనుకూలంగా మార్చుకుని సానుభూతిని పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మరి ఇది ఎంతవరకూ సఫలమవుతుందో చూడాలి.

No comments:

Post a Comment