Breaking News

25/04/2019

నెల్లూరు లో సోమిరెడ్డికి నల్లేరు మీద నడకేనా

నెల్లూరు, ఏప్రిల్ 25, (way2newstv.in)
హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకున్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈసారైనా గట్టెక్కుతారా? లేక మరోసారి ఓటమిని చవిచూస్తారా? ఎమ్మెల్సీ పదవికి కూడా ఎన్నికలకు ముందు రాజీనామా చేసిన సోమిరెడ్డిలో గెలుపుపై అంత ధీమా ఎందుకు? ఇదే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్. గత ఎన్నికల్లో ఓటమి పాలయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని జిల్లా పరిస్థితులను చక్క దిద్దేందుకు ఎమ్మెల్సీని చేసి మరీ మంత్రిని చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. 2014 ఎన్నికల్లో పార్టీకి జిల్లాలో ఘోరమైన పరాజయం ఎదురు కావడంతో ఆ పరిస్థితి రాకుండా చూసేందుకే సోమిరెడ్డి, నారాయణలను ఎమ్మెల్సీలను చేసి మంత్రులగా నియమించారు.వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లా కంటే సర్వే పల్లిపైనే ఎక్కువగా గత మూడేళ్ల నుంచి దృష్టి పెట్టారు. తొలుత చంద్రమోహన్ రెడ్డి తన తనయుడిని సర్వేపల్లి నుంచి బరిలోకి దింపాలని భావించారు. పార్టీ కార్యక్రమాలన్నీ సోమిరెడ్డి తనయుడే సర్వేపల్లిలో చూసుకునే వారు. 


 నెల్లూరు లో సోమిరెడ్డికి నల్లేరు మీద నడకేనా

అయితే చివరి నిమిషంలో చంద్రబాబునాయుడు సూచన మేరకు ఆయనే పోటీకి దిగాల్సి వచ్చింది. ఎమ్మెల్సీ పదవి ఉంటే అది ఉంది కదా? అని ప్రజలు ఆదరించరని దానికి నామినేషన్ కు ముందే సోమిరెడ్డి రాజీనామా చేసి ప్రజల తీర్పు కోసం వెళ్లారు.సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరు, తోటపల్లి గూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో వైసీపీ బలంగా ఉండటం సోమిరెడ్డికి ఈసారి కూడా ఇబ్బందికరంగా మారిందంటున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్థన్ రెడ్డి చేతిలో పరాజయాన్ని చవి చూశారు. వరుస ఓటములతో కుంగిపోయి ఉన్న సోమిరెడ్డి మంత్రి పదవి కాస్త బలాన్నిచ్చినా దాన్ని ఏమాత్రం సద్వినయోగం చేసుకోలేకపోయారన్నది విన్పిస్తున్న టాక్. సొంత పార్టీలోనే సోమిరెడ్డిపై అసంతృప్తులు నెలకొన్నాయంటే ఆయన పనితీరును సులువుగానే అర్థం చేసుకోవచ్చు.కాకాణి గోవర్థన్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో సోమిరెడ్డిపై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడంతో కాకాణి గోవర్థన్ రెడ్డికి సర్వేపల్లి నియోజకవర్గంలో మరింత పట్టు దొరికిందని చెబుతున్నారు. వైసీపీ ఓటు బ్యాంకు నెల్లూరు జిల్లాలోనే బలంగా ఉండటం, ఫ్యాన్ పార్టీ గాలి ఈసారి వీచిందని చెబుతుండటంతో తన గెలుపు మరోసారి ఖాయమని కాకాణి ధీమాగా ఉన్నారు. సోమిరెడ్డి సయితం తాను సానుభూతితోనైనా గట్టెక్కుతానని నమ్మకంతో ఉన్నారు. కానీ సోమిరెడ్డి గెలుపు అంత సులువు కాదన్నది పోలింగ్ అనంతరం విశ్లేషణలు వెలువడుతున్నాయి. దీంతో ఎమ్మెల్సీ పదవిని వదులుకున్న సోమిరెడ్డి మరోసారి ఓటమి ఎదురైతే ఏం చేస్తారన్నది ఆలోచించాల్సిందే.

No comments:

Post a Comment