Breaking News

24/04/2019

కొనేనాథుడేడీ.. (గుంటూరు)

గుంటూరు, ఏప్రిల్ 24 (way2newstv.in): 
బహిరంగ మార్కెట్‌లో అపరాలు ధరలు మద్దతు ధర కంటే తక్కువగా ఉండటంతో నాఫెడ్‌ ద్వారా మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు గత నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సా ర్వత్రిక ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉండటంతో  అపరాల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ఎన్నికల హడావుడి ముగిసినా కేంద్రాలు తెరచుకోక కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. రైతులు అపరాలు సాగు చేసినట్లు రెవెన్యూ, వ్యవసాయ శాఖ నుంచి సాగు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. వ్యవసాయశాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదని క్షేత్రస్థాయి వ్యవసాయశాఖ యంత్రాంగం పత్రాల మంజూరు ప్రారంభించలేదు.డీసీంఎంఎస్‌, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు తెరిచినా రైతులకు ఉపయోగపడటం లేదు. రైతుల అవసరాల దృష్ట్యా బహిరంగ మార్కెట్‌లో మద్దతు ధర కంటే తక్కువకే విక్రయిస్తున్నారు. ప్రధానంగా పెసరకు మద్దతు ధరకు బహిరంగ మార్కెట్‌ ధరకు క్వింటాకు రూ.1500పైగా ధర తేడా ఉండటం గమనార్హం. వీలైనంత తొందరగా సాగు ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసి కొనుగోళ్లు ప్రారంభించాల్సి ఉంది.రెవెన్యూ శాఖకు చెందిన వీఆర్వో, వ్యవసాయశాఖ తరఫున ఏఈవో కలసి మంజూరు చేసిన ధ్రువపత్రాన్ని మండల వ్యవసాయ అధికారి ధ్రువీకరిస్తే కొనుగోలు కేంద్రంలో అనుమతిస్తున్నారు. ఈ-పంట నమోదు ఆధారంగా వ్యవసాయశాఖ ధ్రువపత్రాలు ఇవ్వాలి. రైతు పంట వేసినా సాంకేతిక కారణాలతో ఈ-పంటలో నమోదు కాని పక్షంలో వీఆర్వో భూమి ఉన్నట్లు ధ్రువీకరిస్తే ఏఈవో పంట సాగు చేసినట్లు గుర్తించి పత్రాలు జారీచేస్తారు. 


కొనేనాథుడేడీ.. (గుంటూరు)

ఇందుకు అటు రెవెన్యూ, ఇటు వ్యవసాయశాఖ ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది.ఈఏడాది శనగల నాణ్యత వివిధ కారణాలతో దెబ్బతింది. గింజలు సన్నగా ఉండటంతోపాటు గింజ పైభాగంలో నల్లగా ఉండటంతో కొనుగోలుకు తర్జనభర్జన పడుతున్నారు.  పంట నాణ్యతగా ఉన్న ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే శీతల గోదాముల్లో నిల్వచేశారు. ప్రస్తుతం రైతుల వద్ద నాణ్యత తక్కువగా ఉన్న శనగలు మాత్రమే ఉన్నాయి. పంట పెరిగే దశలో మంచు ఎక్కువగా పడటం, పెథాయ్‌ తుపాను వల్ల ముందుగా సాగుచేసిన పంట దెబ్బతినడంతో గింజల నాణ్యత తగ్గింది. దీంతో ప్రస్తుతం రైతుల వద్ద ఉన్న శనగలు నాఫెడ్‌ ప్రమాణాల మేరకు కొనుగోలు చేయవచ్చా? లేదా? అని నిర్ధారించుకోవడానికి నమూనాలను అధికారులకు పంపారు. వీరు ఇచ్చే నివేదిక ఆధారంగా కొనుగోలు చేయనున్నారు. గింజ నల్లగా ఉన్నా లోపల పప్పు బాగుందని అధికారులు చెబుతున్నారు. బహిరంగమార్కెట్‌లో నాణ్యత లేని శనగలను క్వింటా రూ.3700 నుంచి రూ.3800 వరకు కొనుగోలు చేస్తున్నారు.
డెల్టాలో పెసర ఎక్కువగా సాగు చేశారు. బహిరంగ మార్కెట్‌కు, ప్రభుత్వ మద్దతు ధరకు క్వింటాకు రూ.1500లుపైగా తేడా ఉండటంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి ఆసక్తి చూపుతున్నారు. రెండు రోజులపాటు కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి నమూనాలు సేకరించగా పొన్నూరులో 550 మంది, చెరుకుపల్లి మండలం పొన్నపల్లిలో 200 మంది రైతులు నమూనాలు తీసుకువచ్చారు. దీంతో పెసర కొనుగోలు లక్ష్యాన్ని పెంచాల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున నాఫెడ్‌ వారి సూచనల మేరకు అపరాలు కొనుగోలు చేస్తున్నందున అపరాలు కొనుగోలు చేసిన రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వారం రోజుల్లో వారిఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన తర్వాత రెండు రోజులపాటు ఆన్‌లైన్‌లో నమోదుచేయడానికి సమయం పడుతుంది. కొనుగోలు చేసిన రోజు నుంచి పది రోజుల వ్యవధిలో రైతు ఖాతాలో సొమ్ము జమవుతుంది.ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చినా కేంద్రానికి సమీపంలో అపరాలు నిల్వ చేయడానికి గోదాములు అందుబాటులో లేకపోవడంతో కేంద్రాలు ఏర్పాటు చేయలేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం కొనుగోలు కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని గోదాముల్లోనే నిల్వచేయాలి. 30కిలోమీటర్ల వరకు రవాణా ఛార్జీలు నాఫెడ్‌ చెల్లిస్తుంది. కందులు ఎక్కువగా పండే ప్రాంతమైన వినుకొండకు కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. వినుకొండ మార్కెట్‌యార్డులో గోదాముల్లో ఆదరణ పరికరాలు నిల్వచేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో పంపిణీ ఆగిపోయింది. మే 23 వరకు ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున వాటిని మరో గోదాముకు తరలించాల్సి ఉంది. ఇక్కడ గోదాము అందుబాటులోకి వస్తే కానీ కొనుగోలు కేంద్రం తెరవలేమని చెబుతున్నారు. అదేవిధంగా పెదనందిపాడులో శనగలు కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేయాల్సి ఉండగా ఇక్కడ కూడా గోదాముల కొరతతో ఏర్పాటు చేయాలేదు.

No comments:

Post a Comment