Breaking News

26/04/2019

కర్ణాటకలో మళ్లీ ఆపరేషన్ లోటస్

బెంగళూర్, ఏప్రిల్ 26, (way2newstv.in)
లోక్ సభ ఎన్నికలు ముగిశాయో లేదో…? అప్పుడే కర్నాటక రాజకీయం మళ్లీ వేడెక్కింది. కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు మరోసారి కమలం పార్టీ ఆపరేషన్ కమల్ ను ప్రారంభించిందన్న వార్తలు కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వందకుపైగా స్థానాలు వచ్చినా అధికారానికి రాలేకపోయింది. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ కు మద్దతివ్వడంతో కన్నడనాట సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీని దూరంగా ఉంచాలనే కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు వచ్చినా జేడీఎస్ నేత కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని అప్పగించింది.సంకీర్ణ సర్కారు ఏర్పడిన నెల నుంచే కమలం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించినా పెద్దగా సక్సెస్ కాలేదు. కాంగ్రెస్ పార్టీ, జనతాదళ్ ఎస్ లలో అసంతృప్త నేతలు అనేక మంది ఉన్నారు. సంకీర్ణ సర్కారు ఏర్పడి మే నాటికి ఏడాది పూర్తి కావస్తుంది. 

కర్ణాటకలో మళ్లీ ఆపరేషన్ లోటస్

వారిని తమ దారికి తెచ్చుకునేందుకు కమలం పార్టీ విశ్వప్రయత్నం చేసింది. అయితే శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలన్న షరతుతో కొందరు వెనక్కు తగ్గినా కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ జార్ఖిహోళి లాంటి నేతలు అందుకు సై అన్నట్లు తెలిసింది. ఈలోపు లోక్ సభ ఎన్నికలు రావడంతో ఆపరేషన్ కమల్ కు ఆ పార్టీ విరామం ప్రకటించింది.అయితే లోక్ సభ ఎన్నికలు ముగియడంతో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు కమలం పార్టీ తెరలేపినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలో అంకెలు దోబూచులాడుతున్నాయి. రమేష్ జార్ఖిహోళి పార్టీ మారడం ఖాయమని తేలిపోయింది. ఆయనపై ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ వద్ద అనర్హత వేటు అంశం పెండింగ్ లో ఉంది. అయినా రమేష్ జార్ఖిహోళి లెక్క చేయడం లేదు. రమేష్ జార్ఖిహోళి తో పాటు మరో నలుగురు కాంగ్రెస్ పార్టీని వీడితే సంకీర్ణ ప్రభుత్వం సంకటంలో పడినట్లే.లోకసభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అదే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు. జనతాదళ్ ఎస్ నుంచి కూడా కొందరు ఎమ్మెల్యేలు వస్తామని సంకేతాలు పంపుతున్నట్లు బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కుమారస్వామి పార్టీ నేతలతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ లోనూ పదవులు రాని వారి సంఖ్య ఎక్కువగా ఉండటం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే బీజేపీలోకి వెళ్లడమే మేలనుకునే వారి సంఖ్య హస్తం పార్టీలో కన్పిస్తుందటున్నారు. మొత్తం మీద లోక్ సభ ఎన్నికలలో వచ్చే ఫలితాలను బట్టి సంకీర్ణ సర్కార్ భవితవ్యం ఆధారపడి ఉంటుందన్నది వాస్తవం.

No comments:

Post a Comment