Breaking News

03/04/2019

ఏపీ చుట్టూనే జాతీయ రాజకీయాలు

విజయవాడ, ఏప్రిల్ 3, (way2newstv.in)
పుట్టబోయే సెక్యులర్ ఫెడరల్ ఫ్రంట్ టీడీపీ వైపా, టీఆర్ఎస్ వైపా తేల్చిచెప్పలేకపోతున్నారు పరిశీలకులు. ఇంకా రూపుసంతరించుకోని ఈ కూటమి తమదంటే తమదని తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్రసమితి క్లెయిం చేసుకుంటున్నాయి. తమ రాష్ట్రాల ప్రజల మద్దతు కూడగట్టడానికి ఈ ఎత్తుగడను ఎంచుకుంటున్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు జాతీయస్థాయి ప్రాధాన్యం కలిగినవి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి పతాకస్థాయికి చేరింది. తెలంగాణ లో స్తబ్దత కనిపిస్తుంటే మొత్తం మీడియా ప్రచారం ఏపీ చుట్టూ తిరుగుతోంది. ఇక్కడ టీడీపీ, టీఆర్ఎస్ పోటాపోటీగా ఉండటం ఇందుకు ఒక కారణం. జనసేన ఎటువంటి పాత్ర పోషిస్తుందోనన్న ఆసక్తి మరొక కారణం. కాంగ్రెసు, బీజేపీలు రెండూ నామమాత్రపు పోటీదారులే. అయితే పరోక్షంగా ఈరెండు పార్టీలు ప్రధానపార్టీలను భుజాన వేసుకోబోతున్నాయి. తెలుగుదేశానికి కాంగ్రెసు పరోక్షంగా సహకరిస్తోంది. ఆ పార్టీపై పెద్దగా విమర్శలు చేయడం లేదు. వైసీపీకి బీజేపీ సహకరిస్తోంది. జగన్ ను మోడీ పల్లెత్తు మాట అనడం లేదు. ఈ రెండు పార్టీలను తమ కూటముల్లో వేసుకోవడానికి జాతీయపార్టీలు సిద్ధంగానే ఉన్నాయి. స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రాంతీయ పార్టీలే పొత్తుకు ముందుకు రావడం లేదు. 


ఏపీ చుట్టూనే జాతీయ రాజకీయాలు

కాంగ్రెసు విడిగా పోటీ చేస్తే వైసీపీ ఓట్లను కొన్నింటినైనా చీల్చగలుగుతుందనేది టీడీపీ యోచన. బీజేపీతో అంటకాగినట్లు కనిపిస్తే మైనారిటీ, ఎస్సీ ఓట్లు పోతాయేమోనన్న భయం వైసీపీది. అందువల్లనే ప్రత్యక్షంగా బహిరంగంగా చెప్పలేకపోతున్నాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే ఆయా పార్టీలకు మద్దతు ప్రకటించడానికి టీడీపీ,వైసీపీలు రెండూ సిద్ధమే. రాష్ట్రప్రయోజనాలనే నినాదం సాకుగా సిద్ధంగానే ఉంది.జాతీయ పార్టీలు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఆంధ్రా సెంటిమెంటు అయిన ప్రత్యేక హోదాను కాంగ్రెసు హామీ ఇస్తోంది. హిందూ సంప్రదాయ ఓటు బ్యాంకుతోపాటు మోడీ కరిష్మాతో తాము కూడా ఒకటి రెండు సీట్లయినా గెలుచుకోగలమని బీజేపీ విశ్వసిస్తోంది. ఈరెండు నేషనల్ పార్టీలు అగ్రనేతలతో బాగానే ప్రచారం నిర్వహిస్తున్నాయి. వాటికి ఈ ప్రాంతంలో పట్టుచిక్కకుండా చూడాలని ప్రాంతీయపార్టీలు పట్టుదలతో ఉన్నాయి. అందుకే కేంద్రంలో తామే కీలక పాత్ర నిర్వహిస్తాం. నేషనల్ పార్టీలకు ప్రత్యామ్నాయాన్ని ఆవిష్కరిస్తామంటూ నమ్మబలుకుతున్నాయి. ఇందులో టీఆర్ఎస్ ముందువరసలో నిలుస్తోంది. టీడీపీ ఫెడరల్ ఫ్రంట్ పేరు చెప్పకుండా తాను కీలకమవుతానంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తామే ప్రధాని పీఠంపై ఎవరుండాలో నిర్ణయిస్తామని బొంకగలిగితేనే తమ పార్టీలను ప్రజలు ఎన్నుకుంటారని టీడీపీ, టీఆర్ఎస్ రెండూ భావిస్తున్నాయి. వైసీపీది కూడా అదే ధోరణి.తెలంగాణలో పోటాపోటీ వాతావరణం పోయింది. ఏకపక్ష రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రస్తుతమున్న వేడిలో అధికారపార్టీని ఎదుర్కొనే సత్తా ఏ పార్టీకి లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఆరు నెలల లోపుగానే లోక్ సభ ఎన్నికలు వచ్చేశాయి. శాసనసభ ఎలక్షన్స్ లో ఎదురులేని విజయం సాధించింది టీఆర్ఎస్. విపక్షాలన్నీ కకావికలమైపోయాయి. ప్రతిపక్షాల నుంచి ఎన్నికైన వారు సైతం ఒక్కరొక్కరుగా అధికారపార్టీలో చేరిపోతున్నారు. దీంతో పొలిటికల్ మసాలా మాయమైపోయింది. అస్సలు ఎటువంటి హడావిడి లేదు. ఎన్నికల ప్రచారం మొక్కుబడిగా మారిపోయింది. అధికారపార్టీకి ఆర్థిక,అంగబలాలు మునుపెన్నడూలేని విధంగా సమకూరాయి. పార్టీలుగా ప్రజాక్షేత్రంలో పోరుతప్పదు. ఆశ చావక ప్రతిపక్షాలు పోటీ పడటమే తప్ప పెద్దగా ఒరగబెట్టేదేమీ లేదని రాజకీయపరిశీలకులు తేల్చేస్తున్నారు. ఖమ్మం, మహబూబాబాద్ వంటి రెండు లోక్సభ స్థానాల పరిధిలో మాత్రమే గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసు మెజార్టీ సాధించగలిగింది. దానిని కూడా టీఆర్ఎస్ ప్రస్తుతానికి సెట్ చేసుకోగలిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఎన్నికలు రసవత్తర రాజకీయాన్ని కోల్పోయాయి. ఫలితం ముందే తేలిపోవడంతో పసందైన పాలిటిక్స్ కనుమరుగైపోయాయి.
తెలంగాణ ఓటర్లలో గతంలో ఎన్నడూలేనంత నిరాసక్తత వ్యక్తమవుతోంది. ఎవరు నెగ్గితే మాకేమిటని అర్బన్ ఓటర్లు సాధారణంగా ఎన్నికల రోజును సెలవు దినంగా భావిస్తూ ఉంటారు. అందుకే 50శాతానికి అటూఇటూగా ఓటింగు పరిమితమవుతుంది. చదువుకున్న మధ్యతరగతి వర్గాలకు ఎన్నికల ప్రజాస్వామ్యంపై పెద్దగా విశ్వాసం లేదు. ఎవరు వచ్చినా ఒకటే అన్న భావన వారిది. అందుకే చర్చలు చేసే మధ్యతరగతి మనోభావం ఫలితాల్లో ప్రతిబింబించదు. గ్రామీణ, శ్రామిక వర్గాలే ఓటు హక్కును సంపూర్ణంగా వినియోగించుకుంటాయి. అర్బన్ ఓటర్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తారే తప్ప పోలింగుకు పోరు. అదే పల్లెల్లో నమ్మింది ఆచరించి చూపిస్తారు. తాము విధేయత చూపే పార్టీకి కచ్చితంగా ఓటేస్తారు. అందువల్లనే ఈనాటికీ ప్రభుత్వంలో ఎవరుండాలో నిర్ణయించేది పల్లె ప్రజలే. కేసీఆర్ హైదరాబాదులో సభ పెట్టుకుంటే జనంలేక రద్దు చేసుకోవాల్సి వచ్చిందంటే ఓటర్లలో ఎన్నికల పట్ల ఎంతటి ఉదాసీనత నెలకొందో అర్థమవుతుంది. ఎవరు ఎన్నికైనా అధికారపార్టీ వైపే వెళ్లిపోతారన్న భావన కూడా ఓటర్లలో ఆసక్తిని చంపేసింది. ఈ నిర్లక్ష్యం టీఆర్ఎస్ ను కూడా ముంచేసే ప్రమాదం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీకి చేదు అనుభవం ఎదురవ్వడం అందుకు నిదర్శనం. ఎలాగూ తామే గెలుస్తామనే ధీమాతో క్యాడర్ శ్రద్ధ పెట్టడం తగ్గించివేసింది.

No comments:

Post a Comment