Breaking News

13/04/2019

పవన్ దారెటు...

నెల్లూరు, ఏప్రిల్ 12, (way2newstv.in)
ఎన్నికలు అయిపోాయాయి. జాతకాలు పోలింగ్ పెట్టెల్లో భద్రంగా వున్నాయి. మే 23 వరకూ ఎవరి ఊహల్లో వాళ్లు ఊరేగడమే.చంద్రబాబు, జగన్ లు ఎవరి లెక్కలలో వాళ్లున్నారు. వీళ్లిద్దరిలో ఎవరో ఒక్కరు మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని సర్వేలన్నీ తేల్చి చెబుతున్నాయి. నిర్ణయాత్మకంగా మారుతానన్న పవన్ ఆశలకు గండి పడినట్టే. మరి ఇప్పుడు పవన్ ఏం చేస్తాడు? ఏం చేయాలి? పవన్ అభిమానుల మనసు తొలిచే ప్రశ్నలివే. భీమవరం, గాజువాకల నుంచి పవన్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. రెండింటిలోంచి కనీసం ఓ స్థానం నుంచి పవన్ గెలవడం దాదాపు ఖాయం. రెండు చోట్లా గెలిచే అవకాశాలూ ఉన్నాయి. రెండు చోట్లా గెలిస్తే.. ఒక స్థానానికి పవన్ రాజీనామా చేయాల్సివస్తుంది. ఏం చేసినా పవన్ ఎం.ఎల్.ఏ గా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. తనకు ఎన్ని సీట్లొస్తాయన్నది పక్కన పెడితే… పోరాటం చేయడానికి పవన్ కి ఓ వేదిక దొరికినట్టే. 


పవన్ దారెటు...

పైగా ఒక్క సీటు వచ్చినా చాలు.. నా గొంతు వినిపిస్తా, పోరాటం చేస్తా అని పవన్ పదే పదే చెప్పాడు. ఆ ఒక్క సీటు వచ్చినా.. పవన్ ఇచ్చిన మాట ప్రకారం.. ప్రజల తరపున మాట్లాడాల్సిందే. పోరాటం చేయాల్సిందే. మరి సినిమాల మాటేంటి? సినిమాలతోనూ తన అభిమానులకు పవన్ టచ్ లో ఉంటాడా? అని ఆశగా ఎదురుచూస్తోంది టాలీవుడ్. సరైన సినిమా రావాలే గానీ, రికార్డులు బద్దలు కొట్టగల దమ్ము ఇంకా పవన్ కల్యాణ్ లో ఉందన్నది ఎవరూ కాదనలేని నిజం. అందుకే పవన్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని దర్శక నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. పవన్ అభిమతం కూడా అదే. కాకపోతే.. ఇప్పటికిప్పుడు, ఎన్నికలు అయిపోగానే అర్జెంటుగా సినిమాలు చేసే ఉద్దేశంలో మాత్రం పవన్ లేడని అతని సన్నిహితులు చెబుతున్నారు. కాకపోతే ఈ యేడాది చివర్లో పవన్ నుంచి ఓ సినిమా ప్రకటన ఉండొచ్చు. అది కూడా అగ్ర దర్శకుడితోనే. పవన్ దగ్గర కొన్ని సంస్థల అడ్వాన్సులు ఉన్నాయి. వాటిని పవన్ అప్పులుగా చూపించుకున్న సంగతి తెలిసిందే. వాటికి క్లియర్ చేయడానికైనా పవన్ సినిమాలు చేస్తాడని అనుకుంటున్నారు. పవన్ కూడా మంచి తరుణం కోసం ఎదురు చూస్తున్నాడు. రాజకీయాలు అచ్చు రాలేదు కాబట్టి.. సినిమాల్లోకి మళ్లీ వచ్చేశాడని అనిపించుకోకుండా.. పక్కా ప్లాన్ ప్రకారం రీ ఎంట్రీ ఇవ్వాలని ఫిక్సయ్యాడు. మళ్లీ ఎన్నికల వరకూ పార్టీని నడిపించుకోవాలన్నా, తన స్టార్ డమ్, సినీ గ్లామర్ కాపాడుకోవాలన్నా పవన్ కి ఇంతకు మించిన మార్గం లేదు కూడా. 

No comments:

Post a Comment