Breaking News

08/04/2019

ముగ్గురిలో ఎవరు కాపు కాస్తారో

ఏలూరు, ఏప్రిల్ 8(way2newstv.in)
భీమవరం…ఇప్పుడు రాష్ట్రం దృష్టి అంతా ఇప్పుడు ఈ నియోజకవర్గంపైనే పడింది. దీనికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయడమే. అయితే పవన్ ఇమేజ్ గల నేత అని చెప్పి…గెలుపు సులువుగా వస్తుందా అంటే కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ టీడీపీ-వైసీపీ అభ్యర్ధులు కూడా బలంగా ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా వారు ఇక్కడే పాతుకుపోయిన నేతలు. టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ఇప్పటికే రెండు సార్లుగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు.. ఈ సారి కూడా గెలుపు తనదేననే ధీమాలో ఉన్నారు. అటు గత ఎన్నికల్లో ఓడిపోయి కసి మీదున్న వైసీపీ అభ్యర్ధి గ్రంథి శ్రీనివాస్…ఈ సారి ఎలా అయిన గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇక ఈ ముగ్గురి పోటీతో భీమవరంలో ట్రైయాంగిల్ ఫైట్ షురూ అయింది.తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న పవన్…అన్నీ సామాజిక సమీకరణలు. చూసుకునే తెలివిగా భీమవరాన్ని ఎంచుకున్నారు. ప‌వ‌న్ స్వ‌గ్రామం భీమ‌వ‌రం ప‌క్క నియోజ‌క‌వ‌ర్గ‌మైన న‌ర‌సాపురంలోనే ఉంది. ఇక ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు సైతం భీమ‌వ‌రం సెగ్మెంట్ ఉన్న న‌ర‌సాపురం ఎంపీ సీటు నుంచే బ‌రిలోకి దిగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇక్కడ కాపు ఓటర్లు, మెగా అభిమానులు ఎక్కువ ఉండటమే పవన్‌కి కలిసొచ్చే అంశం. ఇక ఎలాగో పవన్ క్రేజ్ ఉండనే ఉంది. అయితే ప్రజారాజ్యం ద్వారా ఎదురైన అనుభవాలు దృష్ట్యా కాపులు అందరూ జనసేనకి మద్ధతు ఇవ్వడం కష్టమే. పైగా పవన్ వెనుక 35 ఏళ్ళలోపు ఉన్న వారంతా ఎక్కువ కనిపిస్తున్నారు. 


ముగ్గురిలో ఎవరు కాపు కాస్తారో

ఆఖరుకి పవన్‌ సభల్లోనూ వీరి హాజరే ఎక్కువ. ఇక వీరిలో 15-20 ఏళ్ళు లోపు వారు కూడా ఎక్కువ ఉన్నారు. దీంతో కొందరు ఓటు హక్కు లేనివారే ఉంటున్నారు.పవన్ పరిస్తితి ఇలా ఉంటే…టీడీపీ అభ్యర్ధి అంజిబాబు గత ఐదేళ్లు అధికారంలో ఉండటం వలన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకి అందేలా చేశారు. ఇక అంజిబాబుకి ఓ బలమైన సామాజికవర్గం అండ బాగా ఉందని తెలుస్తోంది. అలాగే తన సొంత సామాజికవర్గం కాపులు కూడా కొంత మద్ధతు ఉంది. అయితే కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో…అసలైన టీడీపీ కార్యకర్తలని పట్టించుకోలేదనే వాదన ఉంది. దీంతో వారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. 2009లో కాంగ్రెస్‌, 2014లో టీడీపీ నుంచి వ‌రుస‌గా రెండుసార్లు గెలిచినా అంజిబాబు భీమ‌వ‌రం బ్రాండ్ వేల్యూను పెంచ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌న్న విమ‌ర్శ‌లు ఎక్కువే ఉన్నాయి. ఇక ఈ అసంతృప్తిని క్యాష్ చేసుకుంటూ వైసీపీ అభ్యర్ధి గ్రంథి శ్రీనివాస్…బలమైన టీడీపీ నేతలనీ తనవైపు తిప్పుకున్నారు. ఈ ఐదేళ్లు పార్టీ కేడర్‌ని సమన్వయం చేసుకుంటూ…ప్రజలతోనే ఉన్నారు. భీమవరం రూరల్ ఏరియాల్లో శ్రీనివాస్‌కి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది.ఇక నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఒక్కరే అత్యధికంగా 70 వేల వరకు ఓట్లు ఉన్నాయి. పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్ధులు కాపు సామాజికవర్గ నేతలే. దీంతో కాపు ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. అలాగే బీసీ ఓటర్లు లక్షకుపైగా ఉంటారు. తర్వాత ఎస్సీలు, క్షత్రియ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. బీసీలు మూడు పార్టీలకి ఉన్నారు. క్షత్రియులు ఆర్ధికంగా బలంగా ఉన్నారు. వీరికి ఇతర కులాల ఓట్లని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం వీరి మద్ధతు ఎవరికి ఉంటుందో సస్పెన్స్‌గా మారింది. మొత్తం మీద చూసుకుంటే పవన్ గెలుపు ఇక్కడ అంత సులువు కాదు. అలాగే టీడీపీ-వైసీపీ అభ్యర్ధులకి కూడా విజయావకాశాలు బాగానే ఉన్నాయి. ఇక క్ష‌త్రియులు వైసీపీ అభ్య‌ర్థి గ్రంధి శ్రీనివాస్‌తో ఉన్న వైరం నేప‌థ్యంలో ఆయ‌న‌కు స‌హ‌క‌రించే విష‌యంలో సందేహాలు ఉన్నాయి. ఏదేమైనా భీమ‌వ‌రంలో ఈ సారి ట్ర‌యాంగిల్ ఫైట్‌లో ఎవ‌రు గెలిచినా మెజార్టీ మాత్రం స్వ‌ల్పమే.

No comments:

Post a Comment