Breaking News

04/04/2019

నిలిచిపోయిన డొంకరాయి విద్యుత్

విజయనగరం, ఏప్రిల్ 4, (way2newstv.in)
సీలేరు కాంప్లెక్స్ నుండి వచ్చే జలాలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో డొంకరాయి జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో జల విద్యుత్ కేంద్రం మూతపడింది. బలిమెల జలాశయం నుంచి ఆంధ్రా వాటాగా వచ్చే నీటితో సీలేరు కాంప్లెక్స్‌లో ఎగువ సీలేరు, డొంకరాయి, పొల్లూరు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు సరఫరా చేస్తారు. ప్రతీ ఏడాది డిసెంబర్ నెల నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు గోదావరి డెల్టా రబీ పంటకు సీలేరు కాంప్లెక్స్ నుంచి నీటిని విడుదల చేస్తుంటారు. ఈనేపథ్యంలో ప్రతీ ఏటా 45 నుంచి 50 టీఎంసీల నీటిని విడుదల చేస్తుంటారు. సీలేరు నుంచి 63.45 టీఎంసీల నుండి ప్రభుత్వ వత్తిడి మేరకు ఇప్పటికే సరఫరా చేసారు. ఇంకా ఈనెల 10 వరకు నీటి విడుదల కొనసాగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బలిమెల జలాశయంలో ఆంధ్రా వాటా అధికంగా వినియోగించుకోవడంతో ఒడిశాకు తిరిగి బాకీ పడింది. కాంప్లెక్స్‌లోని గుంటవాడ, డొంకరాయి జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరువలో ఉన్నాయి. డొంకరాయి పూర్తి స్థాయి నీటిమట్టం 1037 అడుగులు కాగా ప్రస్తుం 983 అడుగులకు నీటిమట్టాలు దిగజారి పోవడంతో విద్యుత్ ఉత్పత్తి చేయలేని పరిస్థితి నెలకొంది. 


నిలిచిపోయిన డొంకరాయి విద్యుత్

ప్రస్తుతం ఉన్న నీటి మట్టాలతో విద్యుత్ ఉత్పత్తికి ప్రయత్నిస్తే యూనిట్‌లో సాంకేతిక లోపాలు తలెత్తే ప్రమాదం ఉందని తెలుస్తోంది. సోమవారం ఉదయానికి 976 అడుగులకు నీటి మట్టాలు పడిపోయాయి. ఈసందర్భంగా డీఇ సత్యనారాయణను వివరణ కోరగా విద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయి నీటిమట్టాలు లేకపోవడంతో ప్రస్తుతం విద్యుత్ కేంద్రం మూతపడిందని, సీలేరు, పొల్లూరు జల విద్యుత్ కేంద్రాల ద్వారా కొద్దిపాటి విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నామన్నారు.బలిమెల జలాశయంలో ఆంధ్రా వాటాగా నీటిని పూర్తి స్థాయిలో వాడకపోవడం, అదనంగా ఒడిశా నీటిని వినియోగించుకోవడం వలన ఒడిశాకు ఆంధ్రా బాకీ పడింది. దీంతో గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. దీనిపై జెన్‌కో ఈఈ వీఎల్ రమేష్ మాట్లాడుతూ బలిమెల జలాశయంలో ఇప్పటికే ఆంధ్రా వాటా పూర్తిగా వినియోగించామని, అదనంగా ఒడిశాకు కొంత మేర నీటిని బకాయి పడ్డామన్నారు. గోదావరి డెల్టాకు మరో ఐదు టీఎంసీల నీరు అవసరం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి అధికంగా ఉండడంతో ఒడిశా అధికారులతో మంగళవారం చర్చించి నీటిని అప్పుగా విడుదల చేయాలని కోరుతామన్నారు. ప్రస్తుతం సీలేరు నుంచి 4,500 క్యూసెక్కులు మాత్రమే గోదావరి డెల్టాకు విడుదల అవుతోందని, గత నెల 31 వరకు ఒడిశా నుంచి కూడా నీటిని తీసుకుని రెండువేల క్యూసెక్కులు గోదావరికి ఇచ్చేవారమన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఒడిశాలో కూడా విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతోందన్నారు. ఒడిశాలో కూడా వ్యవసాయ అవసరాలకు నీటిని వినియోగిస్తుండడంతో కేవలం 600 క్యూసెక్కులు మాత్రమే గోదావరి చేరుతోందని, దీంతో ఒడిశా సహాయం చేస్తేనే గోదావరి డెల్టాకు నీరు ఇవ్వగలుగుతామన్నారు.

No comments:

Post a Comment