Breaking News

24/04/2019

నిమ్స్ కు డబ్బు జబ్బులు

హైద్రాబాద్, ఏప్రిల్ 24, (way2newstv.in)
నిజాం ప్రభుత్వ హయాంలో నిరుపేద రోగులకు వైద్యసేవలు అందించాలన్న లక్ష్యంతో అప్పట్లో పలువురు నిజాంలు ట్రస్ట్‌గా ఏర్పడి ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. నాటి నుంచి దినదినాభివద్ధి చెందుతూ, అతి తక్కువ ధరలతో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌)గా అవతరించింది. కొన్ని దశాబ్దాలపాటు రోగులకు సేవలు అందిస్తూ, దేశంలోనే అత్యంత అరుదైన ఆపరేషన్లు చేస్తూ రికార్డులకు ఎక్కింది. అలాంటి ఆస్పత్రికే నేడు చికిత్స చేయాల్సిన దుస్థితి దాపురించింది. అత్యవసర వైద్యవిభాగం(ఈఎండీ) ఉన్నత వైద్యాధికారి లాంటి అనేక మంది అధికారుల తీరు మూలంగా ఆస్పత్రి ప్రతిష్ట దిగజారుతున్నదని రోగులతోపాటు అందులో పనిచేస్తున్న డాక్టర్లు, ఇతర సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ఆస్పత్రిలోని రోగులకు ప్రతి రోజూ 400పైగా ఐవీ ఫ్లూయిడ్స్‌ (ఎన్‌ఎస్‌, ఆర్‌ఎల్‌, డీఎన్‌ఎస్‌) ఎక్కిం చాల్సి ఉంటుంది. నాణ్యత, తక్కువ ధరకు విక్రయించే ఫార్మా కంపెనీల నుంచి వీటిని కొనుగోలు చేయాలి. కాస్త పేరొందిన కంపెనీలు ఒక ఫ్లూయిడ్‌ను రూ.50కే విక్రయిస్తారు. కానీ, ఆ ఉన్నత వైద్యాధికారి రెండు కంపెనీల నుంచే వీటిని కొనుగోలు చేస్తున్నారు. 


నిమ్స్ కు డబ్బు జబ్బులు

అదీ రూ.100-200 ధరకు. ఆ కంపెనీలు సంబంధిత వైద్యాధికారికి భారీ మొత్తంలో కమీషన్‌ చెల్లిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో పాటు కంపెనీలు ఇచ్చే కాంప్లిమెంటరీలు, బహుమతులు సరేసరి. ఇక అత్యవసర విభాగంలోని మెడికల్‌ ఆఫీసర్లు, సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లను సైతం తను చెప్పిన మందులే రాయాలంటూ ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. రోగి శ్వాస తీసుకుంటున్న సందర్భంలో ఏదైనా సమస్య తలెత్తితే శార్ప్‌నెస్‌ ఆఫ్‌ బ్రీత్‌  ప్రొఫైల్‌ కిట్లను ఉపయోగిస్తారు. అత్యవసరంగా శ్వాసకు సంబంధించిన పారామీటర్స్‌ తీసుకునే పరికరం అది. ఆ కిట్‌ ఒక్కోటి బయట మార్కెట్లో రూ.500కే దొరుకుతుంది. కానీ, నిమ్స్‌లో మాత్రం దీని ధర రూ.1500. 'అలారే' అనే కంపెనీ కిట్లను సరఫరా చేస్తుంది. గతంలో 'ఐస్టాట్‌' అనే కంపెనీ రూ.1,000కే పంపిణీ చేసేది. కమీషన్‌ చెల్లింపుల్లో తేడా రావడం.. ఏదైనా సమస్య తలెత్తి విచారణలో దొరికిపోతామనే భయంతో అప్పటికప్పుడు ఆ కంపెనీని తొలగించి 'అలారే'తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక, అత్యవసర విభాగంలో చికిత్స కోసం వచ్చే రోగులకు ఆరోగ్య శ్రీ, ఈహెచ్‌ఎస్‌, జేహెచ్‌ఎస్‌ సౌలభ్యం ఉంటే వారికి వెంటనే ఉచితంగా వైద్యం ప్రారంభించాలి. ఆ ఉన్నత వైద్యాధికారి ఇలాకాలో అది కుదరనే కుదరదు. కార్డుంది కదా అని డబ్బుల్లేకుండా వస్తే వైద్యం అందదు. ఈ పరిస్థితి సాధారణ ఆరోగ్యశ్రీ రోగులకే కాదు. అంతో ఇంతో నిబంధనలు తెలిసినా సీఎంఆర్‌ఎఫ్‌, ఈహెచ్‌ఎస్‌, జేహెచ్‌ఎస్‌ రోగుల బంధువులకు కూడా ఇక్కట్లు తప్పవు. అదేమంటే..అదంతే అంటూ ఖరాఖండిగా చెప్పేస్తారు ఆ వైద్యాధికారి. ఒక వేళ సదరు వైద్యాధికారి అంగీకరిస్తే రూ.10-15 వేలు చెల్లించిన తరువాత వైద్య పరీక్షలు , చికిత్స చేపడతారు. అందులో నిర్ధారణ అయితే అడ్మిషన్‌ లభిస్తుంది. సమస్య అంతటితో తీరిపోదు. మరో రూ.125 తీసుకొని ఓ ఎర్రకార్డు చేతిలో పెడతారు. అది మొదలు.. అత్యవసర దోపిడీకి తెరలేస్తుంది. సిరంజి, బ్యాండేజీ, గ్లూకోజ్‌, మందులు, ఇలా ప్రతీది రోగి సంబంధీకులు కొనుగోలు చేయాలి. తమకు కార్డు ఉందని, ఫీజు మినహాయించాలని వేడుకున్నా ప్రయోజనం ఉండదు. ఆ విభాగం నుంచి డిశ్చార్జీ అయ్యేంత వరకు రోగి సంబంధీకులకు ఈ సమస్య తప్పదు. కాదుగీదు అంటే వైద్యం ఆగుతుంది. రోగి ఏమైపోతాడోననే భయం, చేసేదిలేక డబ్బులు చెల్లించి వైద్యం పొందుతారు. స్టోర్‌లో మందులు లేవనే మాట తరచూ వినిపిస్తూనే ఉంటుంది. నిమ్స్‌ ఆస్పత్రిలోని ఈఎండీలో ఎమర్జెన్సీతోపాటు ట్రమటాలజీ (ట్రామా), క్రిటికల్‌ కేర్‌ అనే మరో రెండు విభాగాలు ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగికి మొదటి గంట గోల్డెన్‌ అవర్‌. ఆ సమయంలో ఎమర్జెన్సీ విభాగం చికిత్స అందిస్తుంది. ఆ తరువాత ట్రామా చికిత్స (సర్జికల్‌) చేస్తారు. రోడ్డు ప్రమాద బాధితులు ట్రామా సేవలు పొందిన అనంతరం క్రిటికల్‌ కేర్‌కు తరలిస్తారు. అతి ముఖ్యమైన ఈ మూడు విభాగాల్లో ఒక్కో దానికి ఒక్కో ఇన్‌ఛార్జీ ఉండాలి. అయితే, నిమ్స్‌ ఈఎండీలో ఎమర్జెన్సీ ఒక్కటే కొనసాగుతున్నది. మిగతా విభాగాలు మంజూరై ఏండ్లు గడుస్తున్నా అతీగతిలేదు. పట్టించుకునే నాధుడే లేడు. తప్పనిసరి పరిస్థితుల్లో నామమాత్రంగా ఈ రెండింటి నుంచి సేవలు అందిస్తున్నారు. దీంతో అన్నింటికీ కలిపి ఆ ఉన్నత వైద్యాధికారి పెత్తనమే.

No comments:

Post a Comment