Breaking News

25/04/2019

సంవ‌త్స‌రాంతానికి ఎస్‌.ఆర్‌.డి.పి మొద‌టి ద‌శ ప‌నుల పూర్తి

హైదరాబాద్ ఏప్రిల్ 25(way2newstv.in)   
గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో వ్యూహాత్మ‌క ర‌హ‌దారుల అభివృద్ది కార్య‌క్ర‌మం (ఎస్‌.ఆర్‌.డి.పి) మొద‌టి ద‌శ‌లో చేప‌ట్టిన ఫ్లైఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌ల నిర్మాణాల‌న్నింటిని ఈ సంవంత్స‌రాంతంలోగా పూర్తిచేసేందుకుగాను అవ‌స‌ర‌మైన 600 కోట్ల రూపాయ‌ల‌ను చెల్లించ‌నున్న‌ట్టు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ వెల్ల‌డించారు. నేడు జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో ఎస్‌.ఆర్‌.డి.పి, నాలా విస్త‌ర‌ణ ప‌నులు, భూసేక‌ర‌ణ త‌దిత‌ర అంశాల‌పై స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ప్రాజెక్ట్ విభాగం చీఫ్ ఇంజ‌నీర్ శ్రీ‌ధ‌ర్‌, చీఫ్ సిటీ ప్లాన‌ర్ దేవేంద‌ర్‌రెడ్డి, డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు, జోన‌ల్ సిటీ ప్లాన‌ర్లు, ప్రాజెక్ట్ విభాగం సూప‌రింటెండెంట్ ఇంజ‌నీర్లు, భూసేక‌ర‌ణ అధికారులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా క‌మిష‌న‌ర్ మాట్లాడుతూ న‌గ‌రంలో సిగ్న‌ల్ ఫ్రీ ర‌వాణా వ్య‌వ‌స్థ‌కు చేప‌ట్టిన ఎస్‌.ఆర్‌.డి.పి ప‌నుల‌కు ఏవిధ‌మైన నిధుల కొర‌త లేద‌ని స్ప‌ష్టం చేశారు. 


సంవ‌త్స‌రాంతానికి ఎస్‌.ఆర్‌.డి.పి మొద‌టి ద‌శ ప‌నుల పూర్తి 

రూపి ట‌ర్మ్ లోన్ క్రింద రూ. 3వేల కోట్ల‌ను జీహెచ్ఎంసీ సేక‌రించింద‌ని, ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళి పూర్తి అనంత‌రం ఈ నిధులు జీహెచ్ఎంసికి అందుతాయని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే ప్రారంభ‌మై వివిధ స్థాయిలో ఉన్న ఫ్లైఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌లు త‌దిత‌ర ప్రాజెక్ట్‌ల‌న్నీంటిని ఈ డిసెంబ‌ర్ మాసాంతానికి పూర్తిచేసే ల‌క్ష్యంతో ప‌నిచేయాల‌ని ఇంజ‌నీర్ల‌ను ఆదేశించారు. ప్ర‌తి ప్రాజెక్ట్ ప‌నుల పూర్తికి కాల నిర్ణ‌య ప‌ట్టిక‌ల‌ను త‌యారు చేసుకోవాల‌ని అన్నారు. ఇందుకు అవ‌స‌ర‌మైన దాదాపు 600 కోట్ల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ఎస్‌.ఆర్‌.డి.పి ప‌నుల‌కు ప్ర‌ధాన ఆటంకంగా ఉన్న భూసేక‌ర‌ణ ప‌నుల‌ను యుద్ద ప్రాతిప‌దిక‌పై చేప‌ట్టాల‌ని భూసేక‌ర‌ణ అధికారుల‌ను కోరారు. భూసేక‌ర‌ణ అంశంలో భూమి కోల్పోయేవారికి టి.డి.ఆర్‌లు అందించే విష‌యంలో విస్తృత అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని సూచించారు. ఎల్బీన‌గ‌ర్ అండ‌ర్‌పాస్‌కు సంబంధించి బైరమ‌ల్‌గూడ, ఎల్బీన‌గ‌ర్ ఉప్ప‌ల్ మార్గంలో భూసేక‌ర‌ణ‌కై వెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని తెలిపారు. అంబ‌ర్‌పేట్‌లో 1.60 కిలోమీట‌ర్ల ఫ్లైఓవ‌ర్ నిర్మాణానికి 281 ఆస్తుల‌ను సేక‌రించాల్సి ఉండ‌గా 171 మంది త‌మ ఆస్తుల‌ను అప్ప‌గించ‌డానికి అంగీక‌రించార‌ని తెలిపారు. వీటిలో ఇప్ప‌టి వ‌ర‌కు 140 ఆస్తుల‌కు సంబంధించి 175 చెక్కుల‌ను ల‌బ్దిదారుల‌కు అంద‌జేశామ‌ని, 129 నిర్మాణాల‌ను తొల‌గించామ‌ని దాన‌కిషోర్ వెల్ల‌డించారు. వ‌ర్షాకాలం ప్రారంభానికి ముందే నాలాల విస్త‌ర‌ణ ప‌నుల‌ను సాధ్య‌మైనంత మేర‌కు పూర్తిచేయాల‌ని క‌మిష‌న‌ర్ ఆదేశించారు. 

No comments:

Post a Comment