Breaking News

09/04/2019

గుజరాత్ లో రాహుల్ గిరి

గాంధీనగర్, ఏప్రిల్ 9, (way2newstv.in)
దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోరులో అందరి దృష్టిని ఆకర్షించేది గుజరాత్. ఇందుకు బలమైన కారణాలున్నాయి. ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ల స్వరాష్ట్రమే కావడం ఇందుకు కారణం. గత ఎన్నికల్లో మొత్తం 26 లోక్ సభ స్థానాలు కమలం పార్టీ ఖాతాలో పడ్డాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచినప్పటికీ కాంగ్రెస్ ధీటైన పోటీ ఇచ్చి ముచ్చెమటలు పట్టించింది. నాటి ఎన్నికల్లో బీజేపీకి 99, కాంగ్రెస్ 77 స్థానాలతో సగర్వంగా తలెత్తుకు తిరిగింది. జాతిపిత మహాత్మాగాంధీ, తొలి కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీ దేశాయ్ ఈరాష్ట్రం వారే కావడం విశేషం.6.27 కోట్ల జనాభా గల రాష్ట్రంలో ఓటర్లు 4.33 కోట్ల మంది ఉన్నారు. గత ఎన్నికలలో ఇక్కడ 62.4 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 2014 ఎన్నికల్లో బీజేపీకి 60.1 శాతం, కాంగ్రెస్ కు 33.5 శాతం ఓట్లు వచ్చాయి. ఇతరులు 6.4 శాతం ఓట్లను కైవసం చేసుకున్నారు. వ్యవసాయ సంక్షోభం, కరవు, కాటకాల, తాగునీటి సమస్య, ఎరువుల ధరల పెరుగుదల, రిజర్వేషన్లు ఎన్నికల్లో కీలకాంశం కానున్నాయి. మూడోదశలో భాగంగా ఏప్రిల్ 23న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దఫా ఎన్నికలు జరగనున్నాయి. 


గుజరాత్ లో రాహుల్ గిరి

ప్రధాని మోదీ, అధ్యక్షుడు అమిత్ షా, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా బీజేపీ ప్రధాన ప్రచారకర్తలుగా ఉన్నారు. విపక్ష నేత పరేష్ ధనాని, పాటీదార్ల ఉద్యమనేత హార్థిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారంలో పాల్గొంటున్నారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పోటీ చేస్తున్న గాంధీనగర్, 2014 లో మోదీ పోటీ చేసిన వడోదర, పోరుబందర, మహెసెన, పఠాన్, పంచమహల్ కీలకస్థానాలు. గాంధీనగర్ లో చాలా కాలం నుంచి పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ పోటీ చేస్తూ వస్తున్నారు. ఈసారి పార్టీ ఆయనను పక్కనపెట్టి షాను బరిలోకి దించింది. దీంతో అందరిచూపూ ఈ నియోజకవర్గంపైనే ఉంది.జాతిపిత మహాత్మాగాంధీ జన్మించిన పోరుబందర్ లో బ్రాహ్మణులదే ఆధిపత్యం. ఇక్కడ కుల రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడ పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది. గోద్రా అసెంబ్లీ స్థానంగల పంచమహల్ లోక్ సభ నియోజకవర్గమూ కీలకమైనదే. ఇక్కడ హిందువులదే ప్రాబల్యం. కాంగ్రెస్ కు బలమున్న నియోజకవర్గం పఠాన్. ఈసారి ఇక్కడ విజయం తథ్యమని పార్టీ భావిస్తోంది. 2014 లో వడోదర నుంచి మోదీ 5.70 లక్షల మెజారిటీతో గెలుపొందారు. తర్వాత ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈసారి ఈ స్థానంపై అంతటా ఆసక్తి నెలకొంది. మహెసన నియోజకవర్గం పటేళ్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతం. పటేళ్ల ఉద్యమనాయకుడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన హార్థిక్ పటేల్ ఈ ప్రాంతానికి చెందిన వారే కావడం విశేషం. పటేళ్లతో పాటు దళితులు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువే. అహ్మదాబాద్ నియోజకవర్గంలో హిందువులదే ఆధిపత్యం.సుదీర్ఘకాలంగా రాష్ట్రాన్ని బీజేపీ పాలిస్తున్నప్పటికీ హస్తం పార్టీ కూడా ఇక్కడ అంతగా వెనుకబడి లేదు. మోదీ ప్రభావంతో 2014 లోనే మొత్తం 26 లోక్ సభ స్థానాలు కమలం పార్టీ పరమయ్యాయి. మిగిలిన సందర్భాల్లో హస్తం పార్టీ సత్తా చాటుతూనే ఉంది. 2009లో బీజేపీ 15, కాంగ్రెస్ 11 స్థానాలను గెలుచుకోవడం గమనార్హం. అప్పటి ఎన్నికల్లో పార్టీల ఓట్ల శాతంలో కూడా పెద్దగా వ్యత్యాసం లేదు. బీజేపీ 46.5 శాతం, కాంగ్రెస్ 43.4 శాతం సాధించాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గౌరవప్రదమైన స్థానాలను గెలుచుకుంది. వీటికి తోడు గత ఐదేళ్లలో మోదీపై వ్యతిరేకత, జీఎస్టీ, నోట్ల రద్దు వంటి అంశాలు తమకు మేలు చేస్తాయని హస్తం పార్టీ ఆశిస్తోంది. రైతులు, పాల ఉత్పత్తిదారుల సమస్యలను పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. సాగు, తాగు నీటి కొరత, నిరుద్యోగం, వలసలు, పాటీదార్ల రిజర్వేషన్ల అంశం ఎన్నికలలో ప్రభావం చూపనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జునాగర్ లోక్ సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను హస్తం పార్టీ గెలుచుకుంది. అదే విధంగా సురేంద్ర నగర్ నియోజకవర్గంలోని ఆరు స్థానాలను, బనస్కారాన్ నియోజకవర్గంలోని అయిదు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. పఠాన్, సబర్ కాంత్, ఆనంద్, ఆమ్రేలి నియోజకవర్గాల్లో హస్తానిదే ఆధిక్యం. అమిత్ షా, మోదీ మంత్రాంగంపైనే బీజేపీ పూర్తిగా ఆధారపడి ఉంది. షా స్వయంగా గాంధీనగర్ నుంచి పోటీ చేస్తుండటంతో యావత్ రాష్ట్రంపై దృష్టి పెట్టారు. ఏ ఒక్క చిన్న అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు. పోల్ మేనేజ్ మెంట్ లో దిట్ట అయిన షా ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నారు. ప్రధాని మోదీ ప్రచార సభలతో ఊపు రాగలదని పార్టీ అంచనా వేస్తోంది. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నామమాత్రమే. అంతా అమిత్ షానే పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతులకు ఆరు వేల సాయం తమను గట్టెక్కించగలదని కమలం ఆశిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత తమను కాపాడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.

No comments:

Post a Comment